Big Stories

AP Assembly Sessions 2024: సంక్షేమ పథకాలపైనే ప్రసంగం.. అభివృద్ధి మాటెత్తని గవర్నర్!

Share this post with your friends

AP Assembly Sessions 2024:

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. తమది పేదల పక్షపాత ప్రభుత్వమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ 4 బడ్జెట్లను ప్రవేశపెట్టిందని, వాటిలో విద్య, పేదల అభివృద్ధికి పెద్దపీట వేసిందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. నవరత్నాలు కింద చెప్పినవాటన్నింటినీ చేసి చూపించామని తెలిపారు.

“విజయవాడలో రూ.404 కోట్ల వ్యయంతో.. 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశాం. హామీల అమలు కోసం త్రికరణ శుద్ధిగా పనిచేశాం. అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా విద్యపైనే దృష్టి పెట్టాం. ఇతర రాష్ట్రాలతో పోల్చితే నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. విద్యతోనే పేదరికాన్ని జయించగలం. అమ్మఒడి పేరుతో విద్యార్థులను చదివిస్తున్నాం. రాష్ట్రంలో సామాజిక న్యాయానికి, సమానత్వానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేసినట్లు గవర్నర్ వివరించారు. పేదపిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు. 1 నుండి 10 తరగతుల విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకం కింద పౌష్టిక ఆహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు రూ. 4,417 కోట్లను కేటాయించినట్లు వివరించారు. మనబడి నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖల్నే మార్చేశామని పేర్కొన్నారు. గడిచిన నాలుగేళ్లలో విద్యారంగంపై రూ.73,117 కోట్లను ఖర్చుచేశామని వివరించారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సైతం విదేశీ విద్యాదీవెన ద్వారా సహాయం చేస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో పేదరికం 11.25 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గిందని నీతి అయోగ్ నివేదికలో వెల్లడైందన్నారు.

“బైజూస్ కంటెంట్ తో 8th, 9th విద్యార్థులకు 9.5 లక్షల ట్యాబులు ఇచ్చాం. జగనన్న విద్యాపథకం కింద పిల్లలకు యూనిఫాం, షూలు ఇచ్చాం. విద్యాకానుక కింద రూ.3367 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి రూ.20 వేలు 294 ప్రభుత్వ బడులను అప్ గ్రేడ్ చేశాం. 18 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నాం. 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ.11,900 కోట్లు రీయింబర్స్ చేశాం. వైఎస్సార్ ఆరోగ్య పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం. ఆరోగ్యశ్రీ కింద రూ.12,150 కోట్లు చెల్లించాం. 36 లక్షల మందికి లబ్ధి చేకూరింది. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రోగులకు రూ.5వేలు అందించాం. రూ.1208 కోట్లతో 1704.. 104, 108 అంబులెన్సులను కొనుగోలు చేశాం. వైద్య రంగంలో 53,126 మంది సిబ్బందిని నియమించాం. రైతులు, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద ఏటా రూ.13,500 ఇస్తున్నాం. 53.53 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ.33.300 కోట్లు ఇచ్చాం. రూ.63,827 కోట్లతో 3.34 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేశాం.

5.83 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు సాగుచేస్తున్నారు. చేపల ఉత్పత్తిలో మొదటి స్థానం, సూక్ష్మసేద్యంలో రెండవ స్థానంలో ఉన్నాం. కాపునేస్తం కింద రూ.2,029 కోట్లు అందించాం. మత్స్యకార భరోసా కింద 2.43 లక్షల లబ్ధిదారులకు రూ.540 కోట్లు జమ చేశాం. వేటకు వెళ్లి మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల సహాయం అందించాం. 20 వేల ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కింద రూ.128 కోట్లు ఇచ్చాం. విద్యుత్ చార్జీల రాయితీ కింద 3186 కోట్ల సాయం అందించాం. పేదలందరికీ 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ఈ నెలల వైఎస్సార్ చేయూత నాలుగో విడత కింద రూ.5064 కోట్లు పంపిణి చేశాం. రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం” అని గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.

అలాగే “జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం రూ.10 వేలు అందజేస్తోంది. జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ.10 వేలు వడ్డీలేని రుణం ఇస్తున్నాం. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా 350.89 కోట్లు అందిస్తున్నాం. నాన్ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలను అందించాం. 2023-24లో 268 కిలోమీటర్ల పొడవున 58 బీటీ రోడ్లు వేశాం.”

ఆక్వారైతులకు విద్యత్ చార్జీల రాయితీ కోసం రూ.3186.36 కోట్లను అందించినట్లు గవర్నర్ వివరించారు. రూ.50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్ లు, 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్ ను ఏర్పాటు చేశారు. రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాలో ఆక్వా హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ ఎదిగిందని గవర్నర్ తెలిపారు.

మహిళా సాధికారిత, శిశువుల ఆరోగ్యంపై జగన్ సర్కార్ ప్రత్యేక కృషి చేసిందన్నారు. రాష్ట్రంలో 55,607 మెయిన్, మినీ అంగన్ వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణీలు, 28.62 లక్షల మంది పిల్లలకు పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పౌష్టికాహార పథకాలకు రూ.6,688 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వైఎస్సార్ ఆసరా ద్వారా 78.84 లక్షల మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.25,571 కోట్లు పంచినట్లు తెలిపారు. రూ.71 కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను కొనుగోలు చేయగా.. 3,27,289 మంది తల్లులకు వీటిద్వారా లబ్ధి చేకూరిందన్నారు.

ఇక.. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 66.34 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి అర్హులకు రూ.3 వేలు పెన్షన్ అందిస్తున్నట్లు వెల్లడించారు. పెన్షన్ పెంచడంతో నెలవారీ పెన్షన్ బడ్జెట్ రూ.1961 కోట్లకు పెరిగింది. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ మొబైల్ డిస్పెన్సింగ్ ఓనర్లకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 4,969.05 కోట్లు కేటాయించామని వివరించారు.

సుమారు గంటన్నరకు పైగా సాగిన గవర్నర్ ప్రసంగంలో.. నాలుగేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించే ప్రస్తావించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో.. ఒక్కమాటైనా మాట్లాడకపోవడం గమనార్హం. గవర్నర్ ప్రసంగానికి మధ్యలోనే ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దామని అంతా అబద్ధాలు చెబుతున్నారని అసెంబ్లీలో కేకలు వేశారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News