Sub Registrar Office Seized: విశాఖ మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. బుధవారం సోదాలు చేసిన ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఇవాళ కార్యాలయాన్ని సీజ్ చేయడంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆపీస్‌లో డిజిటల్ పేమెంట్లపై దృష్టి సారించింది ఏసీబీ. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగిస్తూ ఉన్నారు.
సమాచారం మేరకు, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో.. పత్రాల రిజిస్ట్రేషన్లలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందనే ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు ఉదయం నుంచే సడెన్ రైడ్స్ చేపట్టారు. కార్యాలయంలో ఉన్న రికార్డులు, రిజిస్టర్ పుస్తకాలు, సర్వర్ డేటా, ఫైల్ మూమెంట్ వివరాలు, ఆన్‌లైన్ లావాదేవీలను ఒక్కొక్కటిగా పరిశీలించారు.
సోదాల సందర్భంగా అధికారులు పలు కీలక పత్రాలు, అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పత్రాల పరిశీలనలో అక్రమ రిజిస్ట్రేషన్లు, బెనామీ లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించిన కొన్ని అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. కొంతమంది సిబ్బంది హాజరుకాకుండా పారిపోవడంతో.. ఏసీబీ అధికారులు వారిని వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రాథమిక విచారణ అనంతరం అధికారులు మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. కార్యాలయ తాళాలను సీల్ చేస్తూ, ఎవ్వరూ లోపలికి వెళ్లకూడదని సూచించారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ కార్యాలయంలో అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
ఏసీబీ దాడుల ప్రభావంతో విశాఖలోని పలు దస్తావేజుల లేఖరి కార్యాలయాలు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయి. అధికారులు ఎప్పుడైనా సోదాలు నిర్వహిస్తారనే భయంతో లేఖరులు కార్యాలయాలను మూసి వేసినట్లు తెలిసింది. పత్రాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
విశాఖ నగరంలో గత కొద్ది నెలలుగా పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పత్రాల రిజిస్ట్రేషన్‌లో లంచాలు, మద్యవర్తిత్వం, తప్పుడు పత్రాలు, భూముల దందాలు తరచుగా వినిపిస్తున్నాయి.
Also Read: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే
అధికారులు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషించడానికి ప్రత్యేక బృందం ఏర్పాటుచేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యాలయాలపై సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.