Jagan: మాజీ సీఎం జగన్ ఈనెల 14న విదేశాలకు వెళ్లడం ఖాయమా? గతంలో మాదిరిగానే ఈసారి వాయిదా పడుతుందా? పాస్ పోర్టు విషయంలో ఎందుకు పట్టుదలకు పోతున్నారు? ఒక్కసారి కోర్టుకు హాజరైతే, కచ్చితంగా ఆస్తుల కేసులో హాజరుకావాల్సి వస్తుందని భయపడుతున్నారా? అందుకే న్యాయస్థానానికి వెళ్లకుండా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈనెల 14న మాజీ సీఎం జగన్ లండన్‌కు వెళ్తున్నారా? గతంలో మాదిరిగానే వాయిదా వేసుకుంటున్నారా? ఇదే చర్చ వైసీపీ నేతల్లో మొదలైంది. కూతురు బర్త్ డేకు గతేడాది సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో జగన్ లండన్ వెళ్లాల్సిన పర్యటన అనుకోకుండా ఆగిపోయింది. న్యాయస్థానం పర్మీషన్ ఇచ్చింది. కాకపోతే పాస్‌పోర్టు కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొన్నట్లు కనిపిస్తోంది. పాస్ పోర్టు రాకుంటే ఆయన ఈసారి లండన్ వెళ్లే పరిస్థితులు లేవంటున్నారు. అసలే ఈ పాస్ పోర్టు వ్యవహారమేంటి? ఇంకాస్త లోతుగా..
పాస్‌పోర్టు మంజూరుకు ఎన్ఓసీ పత్రం జారీ కోసం స్వయంగా న్యాయస్థానానికి హాజరై రూ.20 వేల పూచీకత్తు బాండు సమర్పించాలని జగన్‌కు విజయవాడ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారాయన. దీనిపై సోమవారం హైకోర్టులో ఇరువైపులా వాదోపవాదనలు చోటు చేసుకున్నారు. చివరకు తీర్పును రిజర్వు చేసింది.
దీనిపై వాదనల సమయంలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. పరువు నష్టం కేసులో పిటిషనర్‌కు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు వెసులుబాటు ఇచ్చిందని, ప్రత్యేక కోర్టులో స్వయంగా హాజరై పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. పూచీకత్తు కోసం స్వయంగా హాజరై సమర్పించాలంటూ విజయవాడ న్యాయస్థానం అనాలోచితంగా ఆదేశాలిచ్చిందన్నారు.
ALSO READ: తిరుమల అలిపిరి మెట్ల మార్గం ఓ అద్భుతం.. ఇక్కడికి వెళ్లే భాగ్యం మీకు దక్కిందా?
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఐదేళ్లకు పాస్‌పోర్టు ఇచ్చేందుకు ఎన్ఓసీ ఇవ్వాల్సిన బాద్యత కోర్టుపై ఉందన్నారు. లండన్ లో చదువుతున్న జగన్ కూతురికి ఈనెల 16న డిగ్రీ పట్టా ప్రదానం చేస్తారని దానికి హాజరుకావాల్సి ఉందన్నారు. స్వయంగా న్యాయస్థానానికి హాజపై పూచీకత్తు సమర్పించకుండా ఎన్ఓసీ జారీ చేసేలా ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరారు.
ఇంకా లోతుల్లోకి వెళ్తే.. పాస్‌పోర్టు వ్యవహారంలో సీబీఐ కోర్టు ఐదేళ్లకు ఎన్ఓసీ ఇచ్చింది. కానీ.. విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఏడాదికి మాత్రమే ఎన్ఓసీ ఇచ్చింది. దీనిపై గతేడాది హైకోర్టుకు వెళ్లారు జగన్. సీబీఐ మాదిరిగానే ఐదేళ్లు ఇస్తామని.. 20 వేల రూపాయల సెల్ప్ బాండ్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది.
కోర్టు ఆదేశాలతో జగన్ వెళ్లలేదు. దీంతో సెప్టెంబర్‌లో జగన్ విదేశీ పర్యటన రద్దయ్యింది. గతేడాది నవంబర్ మూడోవారం జగన్ పాస్ పోర్టు పరిమితి ముగిసింది. మళ్లీ కొత్తగా పాస్ పోర్టు తీసుకోవడానికి ఎన్‌ఓసీ ఇవ్వాలని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చామని తెలిపింది.
జగన్ స్వయంగా కోర్టుకు వచ్చి 20 వేల పూచీకత్తు బాండ్ ఇస్తే, ఎన్ఓసీ ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదని జనవరి నాలుగు తెలిపింది. దీని కోసం న్యాయస్థానానికి వెళ్తే.. కచ్చితంగా ఆస్తుల కేసుల హాజరుకావాల్సిందేనని ఆదేశాలు ఇస్తుందేమోనని భావిస్తున్నారట జగన్. అలా చేయడం ఇష్టం లేక గతేడాది కూతురు పుట్టిన రోజు వేడుకలకు లండన్ వెళ్లకుండా దూరంగా ఉన్నారని అంటున్నారు.