BigTV English

China New Virus: చైనాలో అసలేం జరుగుతుంది? మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..?

China New Virus: చైనాలో అసలేం జరుగుతుంది? మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..?

China New Virus: మరోసారి ప్రపంచం లాక్ డౌన్ కానుందా..? చాలా మంది దీనిపై ఆందోళన చెందుతున్నారు. చైనాలో కొత్త వైరస్ వచ్చిందనే వార్తతో ప్రపంచదేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఈ కొత్త వైరస్‌తో చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారనీ… ఇప్పటికే, జపాన్‌లో వేల కొద్దీ కేసులు నమోదవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఇండియాలో కూడా తాజాగా రెండు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక, ముంబయ్‌లో జనవరి 9 నుండి 12 వరకూ లాక్ డౌన్ విధిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తేంటే.. మళ్లీ లాక్ డౌన్ తప్పదా..? అనే సందేహాలు వస్తున్నాయి.


కొవిడ్​-19 విజృంభించిన ఐదేళ్లకు చైనాలో కొత్త వైరస్ కలకలం

చైనా నుండి కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయా..? మరోసారి చైనా ప్రపంచంలో అలజడి సృష్టించనుందా..? ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే.. ప్రస్తుతం, కొత్త వైరస్‌ ఒకటి చైనా ప్రజల్ని ఊపిరాడకుండా చేస్తుందనే వార్త ప్రచారంలో ఉంది. ఇప్పుడు, సోషల్ మీడియా అంతా దీనికి సంబంధించిన సమాచారమే వైరల్ అవుతోంది. వైరస్ బారినపడిన పేషెంట్లతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్న ఫోటోలూ, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే, చైనా ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించదనే వార్త అందర్నీ ఆందోళనకు గురిచేస్తుంది.


14 ఏళ్లలోపు పిల్లకు, వృద్ధులకు ప్రమాదకరం

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 విజృంభించిన సరిగ్గా ఐదేళ్లకు చైనాలో కొత్త వైరస్​ కలకలం సృష్టిస్తోంది. దీని పేరు హ్యూమన్​ మెటాన్యుమోవైరస్-HMPV. పలు నివేదికల ప్రకారం ఈ వైరస్​ అతి వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్​ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికే హాస్పిటల్స్​, స్మశానాలు కిక్కిరిసిపోతున్నాయని అంటున్నారు. జపాన్‌లో కూడా వైరస్ విజృంభిస్తోందట. మరోవైపు, భారత్‌లో తాజాగా ఈ వైరస్ కేసులు రెండు నమోదయ్యాయి. 14 ఏళ్లలోపు పిల్లకు, వృద్ధులకు ప్రమాదకరమని చెబుతున్న ఈ వైరస్ ఎందుకింత భయపడుతోంది?

చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్త

గతంలో కరోనా మహమ్మారి ప్రారంభమై ప్రపంచాన్ని కుదిపేసిన పరిస్థితి గుర్తుకు తెస్తూ, ఈ కొత్త వైరస్‌పై చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే, తాజా పరిస్థితులను ఆరోగ్యశాఖ అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించి, పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్​ 16-22 వారంలో ఇన్​ఫెక్షన్‌తో చైనా ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య పెరిగినట్టు డేటా చెబుతోంది. అయితే, శీతాకాలంలో ఊపిరితిత్తులకు సంబంధించి అనేక రోగాలు వెలుగులోకి వస్తాయనీ.. ఇందులో భాగంగానే, ఈ ఏడాది మరిన్ని ఎక్కువ కేసులు వచ్చాయని చైనా అంటోంది.

వైరస్‌ని పర్యవేక్షించేందుకు చైనాలో కొత్త వ్యవస్థ ఏర్పాటు

మరోవైపు, “చైనాలో అనేక వైరస్​‌లు ఒకేసారి వ్యాపిస్తున్నాయనీ.. వీటిల్లో ఇన్​ఫ్లుయెంజా ఏ, హెచ్​ఎంపీవీ, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్​-19 ఉన్నాయనీ.. వీటి వల్ల ఆసుపత్రులు, క్రిమేషన్​ గ్రౌండ్లు కిక్కిరిసిపోతున్నట్లు.. మరీ ముఖ్యంగా పిల్లల ఆసుపత్రుల్లో రోగుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది” అని సార్స్​- సీఓవీ-2 అనే ఎక్స్​ అకౌంట్​ కొన్ని ఫొటోలను పోస్ట్​ చేసింది. అలాగే, న్యుమోనియా తరహా వైరస్‌ని పర్యవేక్షించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చైనా అధికారులు చెప్పినట్లు రాయిటర్స్​ కూడా ఒక కథనం ప్రచురించింది. దీనితో, ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి.

ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్న వైద్య నిపుణులు

2019 డిసెంబర్‌లో చైనాలో కరోనా మహమ్మారి మొదలై మూడు నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది. అంతర్జాతీయంగా ప్రజల జీవనశైలిని మార్చేసిన ఈ వైరస్ భయంతో మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అప్పటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం అన్ని చర్యలు ముందుగా చేపట్టాలని చెబుతున్నారు. HMPV విస్తరణపై సమర్థవంతమైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే లాక్ డౌన్ పరిస్థితులు మళ్లీ రావొచ్చని నిపుణులు అంటున్నారు.

తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, పలు రాష్ట్రాలు అధికారిక ప్రకటన

ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలనీ.. ముందస్తు జాగ్రత్తలతో సామాజిక దూరం, మాస్కుల వినియోగించాలని తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాలు అధికారిక ప్రకటన చేశాయి. ఈ కొత్త మహమ్మారిని అడ్డుకునేందుకు ఇప్పటి నుంచే భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశాల మధ్య ప్రయాణాలు, వాణిజ్య సంబంధాల వల్ల వైరస్ ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది గనుక, అన్ని దేశాలు సంయుక్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి విపత్తులను నివారించవచ్చని అంటున్నారు. మరోవైపు, చైనా దీనికి సంబంధించిన డేటాను స్పష్టంగా బయటకు చెప్పక పోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి.

దగ్గు, జలుబు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ అనే ఈ వైరస్ బారిన పడిన వారిలో దగ్గు, జలుబు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. మానవ న్యుమోనియా వైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయని చైనా ఇప్పటికే చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రో తెలిపింది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ వైరస్ కేసులు ఎక్కువ నమోదౌతున్నాయనీ.. ఇప్పటికే ఏదైనా శ్వాసకోశ వ్యాధి ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ వైరస్ అంటువ్యాధి కాగా.. ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి.. చైనా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొంది.

శ్వాసకోశ వ్యాధి ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం

వైరస్ నిరోధించడానికి పెద్ద ఎత్తున పరీక్షలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వైరస్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది , కొన్నిసార్లు ఇది న్యుమోనియా, ఆస్తమా లేదా క్రానిక్ అబ్‌స్ట్రక్టీవ్ పల్మనరీ డిసీజ్ వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రమాదకరంగా ఉంటుంది. సాధారణంగా ఈ వైరస్ కేసులు పిల్లలలో కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో, ఇది పిల్లలలో సాధారణ వ్యాధి అయిన RSV సంక్రమణను పోలి ఉంటుంది. దీంతో పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

2001లో కనుగొన్న హ్యూమన్ మెటాప్‌ న్యూమోవైరస్‌ (HMPV)

చైనాలో ప్రస్తుతం విజృంభిస్తున్న హ్యూమన్ మెటాప్‌ న్యూమోవైరస్‌ 2001లో కనుగొన్నారు. శ్వాసకోశ సమస్యలను కలిగించే ఈ వైరస్ సంబంధిత కేసులు శీతాకాలంలో మరింతగా పెరుగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా పిల్లలలో 10% నుండి 12% శ్వాసకోశ వ్యాధులు HMPV వల్ల సంభవిస్తాయి. చాలా సందర్భాలలో తేలికపాటి కొన్ని లక్షణాలు ఉంటాయి. అయితే, 5% నుండి 16% మంది పిల్లలు న్యుమోనియా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. న్యుమోనియా అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి, ఇది సకాలంలో నియంత్రించబడకపోతే ప్రాణాంతకం కావచ్చు.

HMPVకి చికిత్స చేసే యాంటీవైరల్ మందులు లేవు

అటువంటి పరిస్థితిలో, ఈ వైరస్ పిల్లలలో న్యుమోనియాకు కారణమైతే, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిజానికి, మానవ మెటాప్‌న్యూమోవైరస్‌కు చికిత్స చేసే యాంటీవైరల్ మందులు లేవు. చాలా మంది వ్యక్తులు కేవలం లక్షణాల ఆధారంగా చికిత్స పొందుతారు. తీవ్రంగా అనారోగ్యంతో ఉంటే, ఆసుపత్రిలో చేరాలి. ఊపిరితిత్తుల సంక్రమణను నివారించడానికి వైద్యులు ఆక్సిజన్ థెరపీ , మందులతో చికిత్స చేస్తారు. ఇక, ఈ వైరస్‌కు యాంటీబయాటిక్ ఔషధం లేకపోవడంతో కంగారు మొదలయ్యింది.

8 నెలల బాలుడికి, 3 నేలల బాలికకు HMPV వైరస్ పాజిటివ్‌

తాజాగా, బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో ఎనిమిది నెలల బాలుడికి, మూడు నేలల బాలికకు ఈ వైరస్ పాజిటివ్‌ వచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఆ శిశువులకు ఇంటర్నేషనల్ ప్రయాణ చరిత్ర లేదని అంటున్నారు. అయితే… ఇది HMPV కేసు అని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు. ఈ సమయంలో రోగి నుంచి నమూనాలను సేకరించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతున్నారని అంటున్నారు.

రెండు కేసుల్లోనూ నిమోనియాలోని బ్రాన్‌కోప్‌నిమోనియా చరిత్ర

దీనిపై స్పందించిన కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం.. ఈ వైరస్ చైనా నుంచి ఉద్భవించినదేనా లేదా అనేది నిర్ధారించడానికి NIV నుంచి నివేదిక వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుందని తెలిపింది. ఇక, ఈ రెండు కేసుల్లోనూ నిమోనియాకు సంబంధించిన బ్రాన్‌కోప్‌నిమోనియా చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, ఇద్దరు చిన్నారులు కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. హెల్త్ మినిస్ట్రీ ప్రకటన మేరుకు.. చిన్నారుల్లో HMPV సాధారణంగానే వస్తుందనీ… ప్రజలు కంగారుపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఏవైన హెచ్చరికలు ఉంటే వెంటనే WHO ప్రకటనలు

జనవరి 4వ తేదీన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దీనిపై ప్రకటన విడుదల చేసింది. చైనాలో వైరస్ వ్యాప్తికి సంబంధించి నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ వైరస్‌పై ఐసిఎమ్ఆర్‌తో పాటు, ప్రపంచం ఆరోగ్య సంస్థ కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుందనీ.. ఏవైన హెచ్చరికలు ఉంటే వెంటనే జారీ చేస్తారని అన్నారు. ఇప్పటికైతే WHO దీనిపై ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించలేదని అన్నారు. ఇక, గతంలో కరోనా అనుభవంతో ఇప్పుడు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందనీ.. అనుకోని పరిణామాలు ఎదురైతే వేగంగా నివారించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్న భారత్

అయితే, ఈ కొత్త వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. జిత్తుల మారి చైనాను చూస్తుంటే అందరికీ అనుమానంగానే ఉంది. అందులోనూ, గతంలో డొనాల్డ్ ట్రంప్ పాలనలోనే చైనా నుండి కరోనా బ్లాస్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా.. మరో కొన్ని రోజుల్లో ట్రంప్ రెండో సారి అమెరికా పీఠం అధిరోహిస్తుండగా.. చైనా నుండి కొత్త వైరస్ వస్తుందనే చర్చ మొదలయ్యింది.

ప్రపంచంలోని మారుమూలల్లో కూడా ప్రాణ భయం

కొవిడ్-19 మహమ్మారి ఎంత పెద్ద విపత్తు తెచ్చిందో ప్రపంచం ఇంకా మరచిపోలేదు. 2019లో చైనాలోని వూహాన్ ల్యాబ్ నుండి వచ్చిందని చెప్పుకుంటున్న కరోనా.. ఇలాగే మొదలై వ్యాప్తి, తీవ్రతను పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే.. ప్రపంచంలోని మారుమూలల్లో కూడా ప్రాణ భయాన్ని చూపించింది. ఎడారి, సముద్రం తేడా లేకుండా అంతటికీ వ్యాపించుకుంటూ వెళ్లింది. ఇది అంటు వ్యాధి, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో లాక్ డౌన్ అనివార్యమయ్యింది.

20 ఏళ్ల క్రితమే గుర్తించిన HMPVకి ఎందుకు వ్యాక్సిన్ లేదు?

దీంతో ప్రపంచం ఆర్థికంగా ఇప్పటికీ కోలుకోలేని నష్టాన్ని అనుభవించింది. అయితే, ఈ కొత్త వైరస్ కూడా అలాంటి మరో లాక్ డౌన్‌కి కారణమవుతుందా అనే భయమే అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. అలాంటి పరిస్థితి రాబోతోందా? అంటే కాదని, స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇక్కడ మరో అర్థంకాని విషయం ఏంటంటే.. ఐదేళ్ల క్రితం వచ్చిన కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న ప్రపంచం.. దాదాపు కరోనా లాంటి ఈ HMPV వైరస్, 20 ఏళ్ల క్రితమే గుర్తించినప్పటికీ ఎందుకు వ్యాక్సిన్ కనిపెట్టలేదు? దీని వెనుక చైనా దీర్ఘ కాల కుటిల వ్యూహం ఏదైనా ఉందా..?

HMPVని మొదటిసారి డచ్ వారిచే గుర్తింపు

2001లో తెలియని ఓ వ్యాధికారకాల వల్ల శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు ఉన్న పిల్లల్లో నాసోఫారింజియల్ ఆస్పిరేట్ శాంపిల్స్‌లో డచ్ వారు దీన్ని మొదటిసారిగా గుర్తించారు. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఇది 60 సంవత్సరాలు ఉనికిలో ఉన్నట్లు తేలింది. అప్పటి నుండీ చిన్నారుల్నే ఎక్కువ ప్రభావితం చేస్తున్న ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టే చర్యలు ఎందుకు చేపట్టలేదు? ప్రస్తుతం, చైనాలో ఈ ఫ్లూ వ్యాప్తిని ఆసియా అంతటా ఆరోగ్య నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. చైనా ఈ వైరస్ వ్యాప్తి నివారణకు కఠినమైన చర్యలను అమలు చేస్తుంది.

ప్రస్తుత సీజన్‌లో జపాన్‌లో కేసుల సంఖ్య 7 లక్షల 18వేలు

హాంకాంగ్‌లో తక్కువ కేసులు నమోదయ్యాయి. జపాన్ ఆరోగ్య అధికారులు ఈ సమస్యపై వేగంగా స్పందిస్తున్నారు. జపాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా 5 వేల ఆసుపత్రులు, క్లినిక్‌లలో డిసెంబర్ 15 వరకు వారంలో 94 వేల 259 ఫ్లూ రోగులు చికిత్స కోసం చేరారు. ప్రస్తుత సీజన్‌లో జపాన్‌లో కేసుల సంఖ్య 7 లక్షల 18వేలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి, దీన్ని నివారించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ, చైనా గానీ, ఇతర ప్రభావిత దేశాలు కానీ ఎందుకు అంత సీరియస్‌గా చర్యలు చేపట్టలేదు.. అనేది చర్చను రేకెత్తిస్తోంది.

చైనా నుంచే కరోనా వైరస్ వ్యాప్తి

ప్రపంచంలో అన్నింటి కంటే అగ్రరాజ్యంగా ఎదగాలని చైనా ఎప్పటినుంచో భావిస్తోంది. అమెరికాను సైతం పక్కన పెట్టాలని అనుకుంటుంది. ఇందులో భాగంగానే అనేక రకాల కుయుక్తులను పన్నుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. గ్లోబల్ మీడియా కథనాల ప్రకారం చైనా నుంచే కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఇందులో రకరకాల వేరియంట్లు తర్వాత ప్రపంచం మీద తీవ్రంగా ప్రభావం చూపించాయి. తొలి వేరియంట్ కంటే, రెండవ వేరియంట్ ప్రపంచానికి నరకం చూపించింది.

చైనాలో దాదాపు మూడు సంవత్సరాలు లాక్ డౌన్

లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దిక్కు లేని చావంటే ఏంటో కరోనా కళ్లకు కట్టింది. అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోకుండా బలయ్యారు. నాడు చైనా దాదాపు మూడు సంవత్సరాల పాటు తమ దేశంలో లాక్ డౌన్ విధించింది. తమ దేశంలో ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు నాటి రోజుల్నే తీసుకురావాలని చైనా ప్రయత్నిస్తోందా..? అలాంటి లాక్ డైన్ ప్రపంచం మరోసారి ఎదుర్కోవాలా..? ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇప్పుడైతే చెప్పలేని పరిస్థితి.

కోవిడ్‌తో అగ్రరాజ్యమైన అమెరికా సైతం అతలాకుతలం

మరో కోణంలో చూస్తే.. నాటి కరోనా విజృంభణ కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు కోవిడ్‌తో వచ్చిన విలయానికి అగ్రరాజ్యమైన అమెరికా సైతం అతలాకుతలం అయ్యింది. కోవిడ్-19ని చైనా చేసిన కుట్రగా పేర్కొన్న ట్రంప్.. దాన్ని చైనా వైరస్ అని వ్యాఖ్యానించారు. 188 దేశాల్లో లెక్కలేనన్ని మరణాలకు చైనా కారణమయ్యిందని అన్నారు. కరోనా ప్రభావం తెలిసినప్పటికీ.. చైనా అంతర్జాతీయ ప్రయాణాలను ఆపలేదనీ.. తర్వాత, స్వదేశంలో కూడా తీవ్రంగా వ్యాధి వ్యాపించేలా చేసిందని ఆరోపించారు. నాడు, ట్రంప్ అన్న చైనా వైరస్ అనే మాటలు జాతి వివక్షకు దారి తీస్తుందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ, ట్రంప్ తన మాటకు కట్టుబడినట్లే తర్వాత కూడా వ్యవహరించారు.

ప్రపంచ వైఖరిని బట్టి, అన్ని దేశాలూ కలిసి గ్లోబల్ గ్రౌండ్‌ లైఫ్

అయితే, చైనా కూడా ట్రంప్ మాటలపై ఘాటుగా స్పందించింది. ఐక్యరాజ్య సమితిలో చైనా ప్రతినిధి నుండీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వరకూ ట్రంప్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ఆ సందర్భంలో.. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్.. కరోనా లాంటి మహమ్మారిని అన్ని దేశాలు కలిసి ఎదుర్కోవాలనీ.. ప్రస్తుతమున్న ప్రపంచ వైఖరిని బట్టి, అన్ని దేశాలూ కలిసి గ్లోబల్ గ్రౌండ్‌గానే జీవిస్తున్నాయనీ.. ఇలాంటి వాతావరణంలో మహమ్మారులను వెంటనే అరికట్టడం సాధ్యం కాదని అన్నారు. అన్ని దేశాలూ కలిస్తేనే మహమ్మారిని అడ్డుకోగలమని అన్నారు.

కరోనా విజృంభణతో దేశాలన్నింటికీ కోలుకోలేని దెబ్బ

ఏది ఏమైనప్పటికీ, ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా, చైనాల పోటీ ఇప్పటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తన శక్తిని అమెరికా ఏ మాత్రం తగ్గనియ్యలేదు. మరోవైపు, చైనా ఆర్థికంగా పీక్స్‌కు వెళ్లిన తర్వాత, దాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. ట్రంప్ పాలనలో అయితే ఆ చర్యలు మరింత అధికమయ్యాయి. ఎప్పుడు లేనన్ని ఆంక్షలతో చైనా మార్కెట్‌ని అమెరికా అధమానికి తొక్కే ప్రయత్నాలు చేసింది. చైనా వ్యాపారాలపై ట్రంప్ కక్షగట్టినట్లు వ్యవహరించారు. అయితే, కరోనా విజృంభణతో దాదాపు దేశాలన్నింటికీ కోలుకోలేని దెబ్బ తగిలింది.

ఈ పరిస్థితికి చైనాపై నింద వేయడం సమంజసమనే భావన

అప్పటికే ఆర్థిక కష్టాలను ఎదుర్కుంటున్న ప్రపంచం భారీ సంక్షోభంలోకి నెట్టబడింది. ఈ పరిస్థితికి చైనాపై నింద వేయడం సమంజసంగానే భావించాయి అన్ని దేశాలు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ట్రంప్ రెండో సారి అమెరికా ప్రెసిడెంట్ పగ్గాలు తీసుకోబోతున్న తరుణంలో.. చైనా ఈ కొత్త వైరస్‌ను కావాలనే పెద్దగా పట్టించుకోవట్లేదా అనే సందేహాలు వస్తున్నాయి. కరోనా అంశంలో చేసినట్లే… ఈ వైరస్ కూడా పెద్ద ప్రమాదకారి కాదన్నట్లు వ్యవహరిస్తోందా అనే భావన వస్తుంది..?

వైరస్‌‌పై WHO ఎందుకు కినుకు వహించింది?

ట్రంప్, చైనా మధ్య జరిగిన కరోనా రచ్చతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ట్రంప్ WHOను నిందించారు. చైనా నుండి వచ్చిన వైరస్‌‌పై WHO ఎందుకు కినుకు వహించిందని విమర్శించారు. ఈ దెబ్బతో అమెరికా నుండి WHOకు నిధులు కూడా ఆపేస్తామనే స్థాయికి పంచాయితీ జరిగింది. అసలు, WHO నుండి అమెరికా వైదులుగుతుందని కూడా ట్రంప్ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. ఈ నేపధ్యంలో.. ఇప్పుడు, HMPV వైరస్ గొడవ ఎంత వరకూ దారి తీస్తుందో అర్థం కావట్లేదు. ఒక వైపు, భారత్‌లో కూడా కేసుల నంబర్లు పెరుగుతున్నాయి.

లాక్ డౌన్ రాదని చెప్పకుండా ఉండలేని పరిస్థితి

ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించడానికి ఎంతో టైమ్ పట్టదనే సూచనలు ఉన్నాయి. ఇదే జరిగితే.. మళ్లీ లాక్ డౌన్ రాదని చెప్పకుండా ఉండలేము. అసలే, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు అందరూ సిద్ధమవుతున్నారు. ప్రయాణాలు ఊపందుకున్నాయి. బహిరంగ ప్రదేశాలన్నీ రద్దీగా మారుతున్నాయి. పండుగ సీజన్‌లో ఎయిర్ పోర్ట్ నుండి బస్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోతుంది. సంక్రాంతి హాడావిడి అంతా బహిరంగంగా సమూహాలలోనే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో భారత్‌లో కూడా పెరుగుతున్న కొత్త వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×