Tirumala: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల ఎన్నో మహిమలకు నిలయం. ఆ క్షేత్రంలోని ప్రతి అనువణువు పరమ పవిత్రం. ఏడుకొండలవాడ.. శ్రీ శ్రీనివాస వేంకట రమణ గోవింద గోవిందా అంటూ భక్తులు తన నామాన్ని జపిస్తే చాలు, ఆ స్వామి భాగ్యం మనకు కలుగుతుంది. స్వామి వారిని దర్శించే భాగ్యం ఒక్కసారి దక్కినా చాలు కదా అంటూ భావించే భక్తులు ఎందరో ఉన్నారు.
తెలుగు వారే కాదు దేశ విదేశాల నుండి భక్తులు, శ్రీ శ్రీనివాసుడి దర్శనార్థం అందుకే నిరంతరం తిరుమలకు చేరుకుంటారు. నిశ్చలమైన భక్తితో శ్రీవారిని దర్శించుకొని, మా కోరికలు తీరాయి స్వామి అంటూ మళ్లీ తిరుమల కొండెక్కే భక్తుల సంఖ్య మన ఊహకు కూడ అందదు. అయితే శ్రీవారి దర్శనార్థం వెళ్లే భక్తులకు తిరుమల క్షేత్రం వింతలు విశేషాలు తెలుసుకోవాలన్న భావన ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ ప్రత్యేక కథనం.
మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారా.. అయితే ఈ వింత తెలుసుకోండి. సాధారణంగా శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు, కాలినడకన వెళుతుంటారు. అది కూడ అలిపిరి మెట్ల మార్గం ద్వార భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటారు. అసలే తిరుమల గిరులు మహిమాన్వితం. ఈ కాలినడక మార్గంలో మీకు ఎన్నో వింతలు, విశేషాలు తారసపడి, మీలోని భక్తి భావాన్ని మరింత పెంచుతాయి. అలాంటి అనుభవమే అలిపిరి మెట్ల మార్గంలో మొదటగా వచ్చే తలయేరు గుండు వద్ద కలుగుతుంది. ఈ తలయేరు గుండు ఎన్నో మహిమలకు నిలయంగా భక్తులు విశ్వసిస్తారు.
అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు తప్పక ఇక్కడ కొలువైన శ్రీ అంజనేయస్వామి వారిని తప్పక దర్శిస్తారు. అలాగే మనం గమనిస్తే ఇక్కడే ఒక పెద్ద బండ మనకు కనిపిస్తుంది. తిరుమల కొండలలో ప్రతి అనువణువు పవిత్రమని ఎందుకు చెప్తారో ఇక్కడే మీకు అర్థమవుతుంది. ఈ బండకు మోకాలి చిప్పల అచ్చులు అంటే గుర్తులు మనకు కనిపిస్తాయి. ఏంటా గుర్తులు అనుకుంటున్నారా.. అయితే తెలుసుకుందాం. సాధారణంగా ఒక వయస్సుకు వచ్చాక ఎవరికైనా మోకాళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి.
అలా నడవలేరు, కదలలేరు. అలాంటి భక్తులు ఇక్కడ గల పెద్ద బండకు మోకాళ్లను ఆనిస్తే చాలు, ఆ నొప్పులు మటుమాయ అవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తిరుమలకు వెళ్లే భక్తులు తప్పక తలయేరు గుండు వద్దకు వెళ్లి, ఇక్కడి పెద్ద బండకు మోకాళ్లను స్వామి నామం జపిస్తూ తగిలిస్తారు. ఆపై శ్రీ ఆంజనేయస్వామికి మొక్కుకుంటారు. ఆ తర్వాత వారి నొప్పులను స్వామివారు హరించి వేస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడి పెద్ద బండ మీద మనకు మోకాలి గుర్తులు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. మరి మీకు కూడ ఈ బాధలు ఉంటే, తప్పక శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు ఒకసారి తలయేరు గుండును దర్శించండి.. ఆ స్వామి కృపకు పాత్రులు కండి!