జగన్ జైలుకెళ్లడం ఖాయం అని దాదాపుగా డిసైడ్ చేశారు సజ్జల. ఆయన తొలిసారి జైలుకెళ్లినప్పుడే పార్టీని బలంగా నడిపామని, ఇప్పుడు కూడా అదే చేస్తామంటూ ధీమాగా చెబుతున్నారు. గతంలో జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీకి బలం లేదని, అప్పుడే ఆయన ఆదేశాల ప్రకారం అద్భుతంగా నడిపామని, ఇప్పుడు పార్టీ చాలా బలంగా ఉందని, ఈసారి పార్టీని నడిపిండచం పెద్ద లెక్కేమీ కాదన్నారు. మహా అయితే 40 రోజులు లేదా 4 నెలలు జగన్ ని జైలు లో పెట్టగలరని, ఆయన బయటకొచ్చిన తర్వాత తిరిగి ఉధృతంగా పోరాటం చేస్తామన్నారాయన.
జగనన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీ కీ బలం లేదు.
అప్పుడే పార్టీ చాలా అద్భుతంగా నడిపించాం.
ఇప్పుడు చాలా బలంగా ఉంది పార్టీ నడిపించడం పెద్ద లేక్కేమీ కాదు.
మహా అయితే 40 రోజులు లేదా 4 నెలలు జైలు లో పెడతారు.
మళ్లీ వస్తాం పోరాటాలు చేస్తాం.
– సజ్జల pic.twitter.com/Ft9warL3oR
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) July 24, 2025
డిసైడ్ అయ్యారా..?
పార్టీ అధినేత జైలుకి వెళ్తే మైలేజీ పెరుగుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే పదే పదే జగన్-జైలు అనే పదాలను టీడీపీకి మించి వారే వల్లె వేస్తున్నారు. ఇప్పటికే అంబటి రాంబాబు, పేర్ని నాని, రోజా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు సజ్జల కూడా జగన్ జైలుకెళ్లడం ఖాయం అనే విధంగా మాట్లాడారు. లిక్కర్ స్కామ్ లో జరుగుతున్న విచారణ స్పీడ్ చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. సాక్షాత్తూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం, రిమాండ్ లో ఉండటంతో నెక్స్ట్ బిగ్ బాస్ జైలుకెళ్లడం ఖాయం అని అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అంత సీన్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. జగన్ ని జైలుకి పంపితే రాజకీయంగా అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ మొదలవుతుంది. గతంలో చంద్రబాబుని జైలుకి పంపించి కక్ష తీర్చుకున్నాం కానీ, అప్పుడే వైసీపీ ఓటమి ఖాయమైందని కొంతమంది ఆ పార్టీ నేతలే చెప్పడం విశేషం. సరిగ్గా ఇప్పుడు కూటమి కూడా అలాంటి తప్పు చేసి, జగన్ కి అవకాశం ఇస్తుందా అనేది ప్రశ్నార్థకం.
సజ్జలకు లాభం ఏంటి..?
ఇప్పటికే పార్టీని సజ్జల గుప్పెట్లో పెట్టుకున్నారనే ప్రచారం ఉంది. జగన్ తర్వాత ఆయన నెంబర్-2. విజయసాయిరెడ్డి కూడా బయటకు వెళ్లిపోయారు కాబట్టి ఇక సజ్జలకు పెద్దగా కాంపిటీషన్ లేదు. ఆ మాటకొస్తే విజయసాయి బయటకు వెళ్లేటప్పుడు కూడా పరోక్షంగా సజ్జలను టార్గెట్ చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, వారి వల్లే తమలాంటి వాళ్లు ఇబ్బంది పడ్డారని అన్నారాయన. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రి అనిపించుకున్నారు సజ్జల. ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా, పార్టీకి నష్టం జరుగుతుందని నేతలు చెవిలో పోరు పెట్టినా జగన్ పట్టించుకోలేదు. ఈ దశలో జగన్ జైలుకి వెళ్తే పార్టీ వ్యవహారాలన్నీ సజ్జలే ముందుండి నడపాలి. ఆదే జరిగితే జగన్ బయటకొచ్చే వరకు పార్టీకి ఆయనే పెద్ద దిక్కు. ఆ తర్వాత కూడా ఆయన స్థానం మరింత పదిలం అవుతుంది. ఒకవేళ జగన్ ని వరుస కేసులు చుట్టుముడితే ఇక వైసీపీలో సజ్జలకు తిరుగుండదు. అందుకే ఆయన ఇలాంటి కామెంట్లు చేశారని వైరి వర్గాలంటున్నాయి. పార్టీపై పెత్తనం కోరుకుంటున్న సజ్జల జగన్ జైలుకెళ్తారంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తోంది.