గత కొంత కాలంగా ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ ప్లాట్ ఫారమ్ లు డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడులు పెట్టేలా తమ వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాయి. బంగారం ధర రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ పద్దతిలో బంగారం కొనుగోలు చేసుకోవడం మంచిని చెప్తున్నాయి. చాలా మంది డిజిటల్ గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెబీ కీలక హెచ్చరిక చేసింది. డిజిటల్ గోల్డ్/ఇ గోల్డ్ ఉత్పత్తులు ప్రభుత్వం అనుమతించిన సెక్యూరిటీలు కావని చెప్పింది. ఇవి సెబీ నియంత్రణ పరిధిలోకి రావన్నది. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా డిజిటల్ గోల్డ్/ఇ-గోల్డ్ ఉత్పత్తులలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని చెప్పింది. డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడులు పెట్టకూడదని హెచ్చరించింది.
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో సెబీ ఈ హెచ్చరికను జారీ చేసింది. ఇటీవల, దేశంలో బంగారాన్నిడిజిటల్ పద్దతుల్లో విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసింది. “సాధారణంగా మార్కెట్ పెట్టుబడులకు సంబంధించి ఇబ్బందులు ఉంటే వెంటనే సెబీ పర్యవేక్షణలో ఉన్న పెట్టుబడిదారుల రక్షణ సంస్థలను సంప్రదించే అవకాశం ఉంటుంది. కానీ, ఈ గోల్డ్/డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టే వారికి అందుబాటులో ఈ వ్యవస్థలు అందుబాటులో ఉండవు” అని తెలిపింది. సెబీ నియంత్రలో ఉన్న ఇతర పద్దతుల ద్వారా పెట్టుబడులు పెట్టుకోవాలని సూచించింది.
ఫిజికల్ గోల్ల్ కు ప్రత్యామ్నాయంగా వివిధ సంస్థలు విక్రయించే ఇ గోల్డ్, డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులను రెగ్యులేటర్ గమనించింది. డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ-నియంత్రిత బంగారు ఉత్పత్తులకు భిన్నంగా ఉన్నాయని వెల్లడించింది. అవి అసలు సెక్యూరిటీలుగా గుర్తించబడలేదని తెలిపింది. కమోడిటీ డెరివేటివ్ లుగా నియంత్రించబడవన్నది. ఇవన్నీ పూర్తిగా సెబీ పరిధికి బయట పని చేస్తాయని వెల్లడించింది. ఇటువంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులలో పెట్టుబడులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయన్నది. వీలైనంత వరకు పెట్టుబడిదారులు సేఫ్ గా ఉండే వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలని సూచించింది.
దేశంలో ఆభరణాల వ్యాపారంలోని కొన్ని సంస్థలు డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులను అమ్ముతాయి. స్విస్ కంపెనీతో జాయింట్ వెంచర్‌లో ఉన్న ఒక PSU, కొన్ని ఆన్ లైన్ ఆభరణాల వ్యాపారులు, ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్‌లు కూడా డిజిటల్ గోల్డ్ ను అమ్ముతాయి. డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయడానికి, కొనుగోలుదారులు.. అమ్మేవారి వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ తక్కువలో తక్కువ రూ. 100 నుంచి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడి పెట్టిన మొత్తం, కొనుగోలు చేసిన బంగారానికి సంబంధించి అమ్మకందారులు రసీదును ఇస్తారు. అవసరమైనప్పుడు, కొనుగోలుదారు తన దగ్గర ఉన్న బంగారం విలువకు సమానమైన డబ్బును పొందడానికి రసీదును సబ్ మిట్ చేస్తే సరిపోతుంది. లేదంటే, విక్రేత అందించే ఆప్షన్స్ ను బట్టి బంగారు ఆభరణాలను మార్పిడి చేసుకోవచ్చు. అయితే, ఈ పద్దతి తమ పరిధిలోకి రాదని సెబీ వెల్లడించింది. పెట్టుబడి దారులు మోసపోయేందుకు ఎక్కువగా అవకాశం ఉందని తెలిపింది. వీలైనంత వరకు డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడులు పెట్టకపోవడం ఉత్తమని తేల్చి చెప్పింది.
Read Also: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!