Ande Sri: అందెశ్రీ.. పూర్తిపేరు అందె ఎల్లయ్య. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రచించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందెశ్రీకి తెలంగాణ ప్రజల గొంతుకగా పేరుంది. ఈయన జీవితం కాపరిగా ప్రారంభమై, కవిత్వంతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి పోషించారు.
అందెశ్రీ.. 1961 జులై 18వ తేదీన జన్మించారు. ఈయనది.. వరంగల్ జిల్లా జనగాంలోని మద్దూరు స్వస్థలం. అందెశ్రీ చిన్నప్పటి వయస్సులో తండ్రిని కోల్పోయాడు. తల్లె తనను పెంచి పోషించింది. చదుకోలేకపోయినా కూడా పల్లె బాషల్లో జానపద గీతాలు, కథలు విని స్ఫూర్తి పొందారు. శృంగేరి మఠ స్వామీ శంకర్ మహారాజ్ ఆయన పాటలు విని, రచనలకు ప్రోత్సహించారు.
అందెశ్రీ.. కవిగాను, సినీ గేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ.. మలిదశ ఉద్యమంలో “తెలంగాణ ధూంధాం” కార్యక్రమ రూపకర్తగా, 10 జిల్లాల్లో స్ఫూర్తి కలిగించారు. ఈయన రచనలు ప్రకృతి, పల్లె జీవితం, సామాజిక న్యాయం, తెలంగాణ గొంతుకలపై ఆధారపడి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం, పల్లెనీకు వందనములమ్మో, మాయమై పోతున్నడ మ్మో మనిషన్నవాడు, గలగల గజ్జెలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరాతోపాటు జన జాతరలో మన గీతం, యెల్లిపోతున్నావా తల్లి, చూడ చక్కని పాటలు రాశారు.
2006లో గంగ సినిమాకు పాటలు రాసి నంది పురస్కారం గెలిచారు. బతుకమ్మ సినిమాకు సంభాషణలు రాశారు. విప్లవాత్మక సినిమాలకు పాటలు అందించారు. ప్రధానంగా అందెశ్రీకి తెలంగాణ, దేశవ్యాప్తంగా అనేక పురస్కారాలు లభించాయి.
కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్.. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, అదే ఏడాది రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది. 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం కూడా అందెశ్రీ అందుకున్నారు.
ప్రకృతే నా బడి, పల్లెటూరే నా గురువు.. అందెశ్రీ నోటి మాట..
ప్రకృతే నా బడి, పల్లెటూరే నా గురువు.. ఇదీ ప్రముఖ కవి అందెశ్రీ నోటి మాట. అన్నట్లుగానే పల్లె, ప్రకృతి చుట్టూ అందెశ్రీ పాటలు, సాహిత్య జీవితం గడిచింది. ఆయన అసలైన జీవిత సంపద ‘పద’ సంపదే. Man of many letters అని సాహితీ వేత్తల ప్రశంసలు అందుకున్న సుకవి, ప్రజాకవి, ప్రకృతి కవి మన అందెశ్రీ. మట్టిలో నుంచి వచ్చిన మాటలే ఆయన పాటలు. పాటలకు సాహిత్యానికి విద్యార్హత ముఖ్యం కాదు.. మనసు ముఖ్యం అని నిరూపించిన మహా కవి మన అందెశ్రీ. ఆయన కలమే కాదు.. గళం కూడా మహాద్భుతం. ఉద్యమ గీతాలైనా, ఉద్వేగాన్ని పెంచే పాటలైనా, ఓదార్చే మాటలైనా, హుషారు పెంచే అక్షరాలైనా అన్నీ అందెశ్రీ సొంతం. ప్రజాకవిత్వానికి ఆయనో ప్రతినిధి. అందెశ్రీ అక్షరం సూటిగా, లోతుగా, మానవతా విలువలతో నిండి ఉంటుంది. అందుకే ఆయన అభ్యుదయ కవి అయ్యారు.
పెద్దగా చదువు లేకపోయినా తన సహజ ప్రతిభతో సాహిత్య రంగంలో శిఖరాగ్రాన నిలిచారు. తన కవితలు, పాటల ద్వారా తెలంగాణ రైతు, కార్మిక, పేద ప్రజల మనోగతాన్ని ప్రతిబింబిస్తూ ప్రజాకవి పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది. జయజయహే తెలంగాణ అన్నా.., జైబోలో తెలంగాణ అంటూ స్వరాష్ట్ర కాంక్షను రగిలించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని జ్వలింపచేయడంలో ఆయనకు ఆయనే సాటి. తన పాటల ద్వారా సామాజిక న్యాయం, స్వాభిమానాన్ని చాటిచెప్పిన మహా మనిషి అందెశ్రీ. ఆయన పాట రాశారంటే.. ఒక తెలియని ఉత్సాహం, భవిష్యత్ పై ఆశ కనిపిస్తాయి.
సామాజిక సమస్యలను కవితాత్మకంగా చూపాలన్న సంకల్పం ఆయనను ప్రజాకవిగా మార్చింది. నదీ గమనం ఆయన మనసును మార్చింది. ఒక్క మనదేశమే కాదు ప్రపంచంలోని అన్ని ప్రముఖ నదులనూ సందర్శించారు. సరికొత్త అణ్వేషణ సాగించారు. నదీ ప్రవాహం నుంచి ఎన్నెన్నో పాటలు వెల్లువలా రాసుకున్నారు. ఆయన అక్షరాల్లో తెలంగాణ మాండలికం ప్రతిధ్వనిస్తుంది. మాయమౌతున్న మనిషిని చేయితో పట్టుకొచ్చిన మనీషి అందెశ్రీ. గల గల గజ్జెల బండి అంటూ పల్లె ప్రకృతి సౌందర్యాన్ని ప్రతింబింబింపజేసినా, స్వగ్రామంపై భావోద్వేగంతో పల్లే నీకు వందనములమ్మో అని రాసినా, బాల్యంలోనే దూరమైన తల్లిని స్మరించుకుంటూ మాతృప్రేమను వర్ణించేలా చూడా చక్కని తల్లి చుక్కల్లో జబిల్లి అని పాట రాసినా ఆయన గుండె లోతుల్లోనుంచి వచ్చిన పదాలే అవి. జన జాతరలో మన గీతం అంటూ రాసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. కొమ్మ చెక్కితే బొమ్మరా… కొలిచి మొక్కితే అమ్మరా అంటూ పల్లెటూరి మనస్తత్వాలను కళ్లకు కట్టారు.
అందెశ్రీ పాటకు అవార్డులు, రివార్డులు, బిరుదులు దాసోహమన్నాయి. ఆయన మాట, పాట విద్యార్థులకు పాఠాలయ్యాయి. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే నిగర్వి అందెశ్రీ. జయజయహే అంటూ అందెశ్రీ రాసిన గీతం.. ఒక గీతమే కాదు.. తెలంగాణ తల్లికి అందెశ్రీ అలంకరించిన అక్షర సుమమాలు అవి. ఈ గేయం తెలంగాణ రాష్ట్ర గీతంగా మారడం ప్రజాకవిత్వానికి ప్రతీక. అందెశ్రీ అకాల మరణం కేవలం సాహితీ లోకానికే కాదు. యావత్ తెలంగాణ ప్రజానీకానికి, పల్లెపాటలకు తీరని లోటు. కానీ ఆయన మాటలు, పాటలు అజారమరం. అసమాన్యం. అందుకే ఆయన కారణజన్ముడయ్యారు.
ప్రముఖ రచయిత అందెశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జననం
జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ
ఇటీవల రూ.కోటి పురస్కారం అందించిన ప్రభుత్వం
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య
కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ pic.twitter.com/jSOlbxbOEJ— BIG TV Breaking News (@bigtvtelugu) November 10, 2025