కూటమి హయాంలో ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారడంతోపాటు, గ్రీన్ వర్క్ ఫోర్స్ విప్లవానికి కేంద్రబిందువుగా కూడా మారుతోందని అంటున్నారు మంత్రి నారా లోకేష్. బుధవారం విజయవాడలో జరగబోతున్న రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ గా ఇది రికార్డులకెక్కబోతుండటం విశేషం. ఈ స్కిల్లింగ్ డ్రైవ్ లో 250కు పైగా కంపెనీలు భాగస్వామ్యం కాబోతున్నాయి.
గ్రీన్ ఎనర్జీ..
శక్తి వనరుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్న రోజులివి. పునరుత్పాదక శక్తి వనరులపై ప్రపంచం ఆధారపడుతోంది. అదే సమయంలో గ్రీన్ ఎనర్జీ కూడా సరికొత్త ఒక విప్లవానికి నాంది పలుకుతోంది. ఈ గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీ ముందు వరుసలో ఉండటం విశేషం. ఇందులో భాగంగానే తాజాగా స్కిల్లింగ్ డ్రైవ్ నిర్వహణకు ఏపీని ఎంపిక చేసుకున్నారు. సౌర, పవన శక్తికి నైపుణ్య హబ్ గా ఏపీ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఈ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో హై-ఇంపాక్ట్ ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. సోలార్, విండ్ పవర్ పరిశ్రమలకు చెందిన దిగ్గజాలు, శిక్షణ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. డిమాండ్ ఆధారిత, పరిశ్రమల అవసరాలకు తగ్గ వర్క్ ఫోర్స్ అభివృద్ధికి రోడ్‌మ్యాప్ ను వారు రూపొందిస్తారు. ప్రైవేట్ సెక్టార్ గ్రీన్ స్కిల్లింగ్ టాస్క్‌ఫోర్స్ ను కూడా ప్రారంభిస్తారు.
వర్క్ ఫోర్స్ కి డిమాండ్
ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీకి డిమాండ్ పెరుగుతోంది, దీంతో ఈ రంగంలో నిపుణులైన ఉద్యోగులకు కూడా డిమాండ్ ఉంది. అందుకే డిమాండ్ ఉన్న ఈ రంగంలో పరిశ్రమల ఏర్పాటుతోపాటు, దానికి అవసరమైన నిపుణులను తయారు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు స్కిల్లింగ్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. గ్రీన్ ఎనర్జీ కంపెనీలు కూడా ఇందులో భాగస్వాములు కావడం విశేషం. గ్రీన్ ఎనర్జీ రంగానికి అవసరమైన నిపుణుల కొరత లేకుండా చేసేందుకు కంపెనీలు చొరవ చూపుతున్నాయి. ఆ చొరవకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తోంది.
ఏపీ కేంద్ర బిందువు
భారతదేశం 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2030 నాటికి 160 గిగావాట్ల సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కార్యాచరణ రూపొందించింది. ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే పరిశ్రమలు రావాలి, అదే సమయంలో దానికి అవసరమైన నిపుణులు కూడా అవసరం అవుతారు. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విషయంపై కూడా ఏపీ దృష్టి పెట్టడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ వర్క్‌ఫోర్స్ విప్లవానికి కేంద్రబిందువుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పునరుత్పాదక ఇంధన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో వేలాది మంది యువతకు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇన్ స్టలేషన్, ఆపరేషన్స్, నిర్వహణ అన్నీ ఇందులో కవర్ చేస్తారు. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలోనే కాకుండా గ్లోబల్ టాలెంట్ ఎక్స్ పోర్టేషన్ కి కూడా ఏపీ కేంద్ర బిందువు కాబోతోంది.