Pulivendula: స్థానిక సంస్థల ఎన్నికలతో వైసీపీ పనైపోతుందా? వైసీపీ నామినేషన్లు వేయడానికి ఎందుకు వెనక్కి తగ్గుతోంది? చీటికి మాటికీ న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయిస్తోంది? వైసీపీ అధినేతలో భయం పట్టుకుందా? ఎంతమంది వస్తారో రావాలని జగన్ సవాల్ వెనుక అసలు ఏం జరిగింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ-కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నేతలు ప్రజల్లోకి వెళ్లకపోయినా మీడియా ముందు సవాళ్లు- ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. తాజాగా సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. రెండు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు వెళ్లారు వైసీపీ అధినేత. అక్కడ పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవాలు చేయించుకున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో అధికారులకు చెప్పినా ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా సీఎం చంద్రబాబు వైఖరిలో మార్పు రాలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు తాను వస్తానని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అన్యాయాలు చేసేందుకు ఎవరు వస్తారో రావాలన్నారు. శకునితో సీఎం చంద్రబాబును పోల్చారు. తాను షర్టు ఎట్లాగూ మడిచానని, ఎంతమంది వస్తారో రావాలని సవాల్ విసిరారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పనైపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంకో వైపు కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డులు ఏకగ్రీవాలు అన్ని పార్టీలు చేసుకుంటున్నాయి. కాకపోతే మేయర్, ఛైర్‌పర్సన్ పీఠాలు కూటమికి వెళ్లడంతో ఆక్రోశంతో ఆ విధంగా శివాలెత్తారని అంటున్నారు. వైసీపీ రూలింగ్‌లో ఉన్నప్పుడు గ్రామంలో స్వరాజ్యం కావాలంటే ఏకగ్రీవాలు చేసుకోవాలని పిలుపు ఇచ్చిన జగన్, ఇప్పుడు మాట మార్చడాన్ని నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. జగన్ మాటలు పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు జగన్ కొత్తదారులు వెతుకుతున్నారని అంటున్నారు.
ALSO READ: ముద్దులు, హగ్గులతో ఓట్లు రావు.. వైసీపీకి మాస్ పంచ్ ఇచ్చిన మంత్రి టి.జి. భరత్!