Employee Car Gifts: పండుగ వేళ ఉద్యోగుల కష్టానికి తగిన గుర్తింపు లభిస్తే ఆ ఆనందమే వేరు. సరిగ్గా అలాంటి అరుదైన బహుమతినే అందించి వార్తల్లో నిలిచింది హర్యానాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ. దీపావళి పండుగను పురస్కరించుకుని సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నలుగురు ఉద్యోగులకు ఏకంగా బ్రాండ్ న్యూ ‘కియా సోనెట్’ ఎస్‌యూవీ (SUV) కార్లను కానుకగా ఇచ్చి సర్ప్‌రైజ్ చేసింది.
హర్యానాలోని పంచకుల కేంద్రంగా పనిచేస్తున్న ‘మిట్స్ హెల్త్‌కేర్’ (MITS Healthcare) సంస్థ.. ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కంపెనీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఎం.కే భాటియా స్వయంగా బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ కారులో డీలర్‌షిప్ వద్దకు చేరుకుని ఉద్యోగులకు కార్ల తాళాలను అందించారు. డీలర్‌షిప్ వద్ద నల్లటి క్లాత్‌తో కప్పబడిన నాలుగు ఎస్‌యూవీ కార్లను ఉద్యోగుల సమక్షంలో రివీల్ చేశారు. డ్రమ్స్ వాయిద్యాలు, కేక్ కటింగ్స్, ఉద్యోగుల డాన్స్‌లతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
సమర్థవంతంగా పనిచేస్తూ కంపెనీకి నిబద్ధతతో సేవలు అందిస్తున్న సిబ్బందిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని యాజమాన్యం తెలిపింది. ఈ కారు బహుమతిగా పొందిన ఒక ఉద్యోగి మాట్లాడుతూ.. తాను గత ఐదేళ్లుగా మిట్స్ హెల్త్‌కేర్‌లో పనిచేస్తున్నానని తన కష్టానికి తగిన గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తంచేశారు. కాగా ఈ కార్ల రిజిస్ట్రేషన్ నేరుగా ఉద్యోగుల పేరిటే కంపెనీ చేసింది. వాహనాలకు సంబంధించిన డౌన్ పేమెంట్‌ను కంపెనీయే చెల్లించడం విశేషం.
కేవలం కొందరు ఉద్యోగులకే కాకుండా మిగిలిన సిబ్బందికి కూడా కంపెనీ ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. సంస్థలో కనీసం 18 నెలల సర్వీస్ పూర్తి చేసుకున్న అర్హులైన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా విధానాన్ని ప్రవేశపెట్టింది. సెక్యూరిటీ గార్డుల నుంచి సీనియర్ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ ఈ లక్కీ డ్రా ద్వారా కారును గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది.
Also Read: బంగారంలో అసలు పసుపు రంగే ఉండదా? మరి ఈ దగదగ మెరుపు వెనుక రహస్యం ఏంటి?
దీపావళి పండుగ సమయంలో ఉద్యోగులకు కార్లను గిఫ్ట్‌గా ఇవ్వడం ఎంకే భాటియా కంపెనీకి ఇదే మొదటిసారి కాదు. 2024లో కూడా మిట్స్ హెల్త్‌కేర్ తన 15 మంది ఉద్యోగులకు టాటా పంచ్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి పాపులర్ ఎస్‌యూవీ కార్లను కానుకగా అందించి వార్తల్లో నిలిచింది. వరుసగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగుల మనసు గెలుచుకోవడంతో పాటు ఇతర కంపెనీలకు కూడా మిట్స్ హెల్త్‌కేర్ ఆదర్శంగా నిలుస్తోంది.
Also Read: బిల్ గేట్స్ హెచ్చరించిన మరుసటి రోజే.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ షాక్.. 60 వేల మందికి బైఅవుట్ ఆఫర్!