TG Bharath: ప్రజల ఆశీస్సుల వల్లే తనకు మంత్రి పదవి దక్కిందని, అధికారం చేపట్టిన ఈ రెండేళ్లలోనే కర్నూలు నగర అభివృద్ధిలో మాకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశామని పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ స్పష్టం చేశారు. కర్నూలులో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రతిపక్ష వైసీపీ తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కర్నూలులో ప్రగతి పరుగులు
నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు మెడికల్ కాలేజీ రోడ్డు వద్ద ఉన్న మసీదు, ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద రోడ్డు వైడనింగ్ చేశామని తెలిపారు. దాదాపు 900 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తీర్చామన్నారు. అలాగే నగరంలోని పార్కులను, కర్నూలు స్టేడియంను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దామని, గతంలో అవి ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలే గమనించాలని కోరారు. మహిళల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
పారిశ్రామిక విప్లవం.. వేలాది ఉద్యోగాలు
కూటమి ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లును భారీ ఇండస్ట్రియల్ కారిడార్‌గా తీర్చిదిద్దుతున్నామని భరత్ చెప్పారు. దీని ద్వారా రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. గత వైసీపీ హయాంలో ఓర్వకల్లులో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో వైజాగ్ తరహాలోనే కర్నూలుకు కూడా డేటా సెంటర్లు రాబోతున్నాయని, ఇప్పటికే మెగా జాబ్ మేళాతో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. పత్తికొండ ప్రాంతంలో టమోటా, జ్యూస్ ఫ్యాక్టరీలు, గోల్డ్ మైన్స్ ద్వారా రాయలసీమను ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తున్నామన్నారు.
వైసీపీ వైఫల్యాలపై తీవ్ర ఆగ్రహం
గత ఎన్నికల్లో ప్రజలు 11 అసెంబ్లీ స్థానాలు ఇస్తే వైసీపీ నాయకులు ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు దూరంగా ఉంటూ, కేవలం పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లి ముద్దులు, హగ్గులు ఇస్తే ఓట్లు పడవని ఎద్దేవా చేశారు. వైసీపీ స్థానిక ఎన్నికల్లో గెలిచినా ప్రజలకు చేసేదేమీ ఉండదని అన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్థలం కబ్జా చేసి, దాని గురించి అడిగిన బాధితులపై బూతులతో రెచ్చిపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో సొంత నేతలు తప్పు చేసినా చర్యలు తప్పవని తమ అధినేత స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
Also Read: ‘కేంద్రంలో ఉండి ఏం పీకుతున్నారు’? మోడీ, అమిత్ షాలపై అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్!