ప్రజా పోరాటాలు పక్కనపెట్టి ట్వీట్లు వేయడమేంటి..? కేటీఆర్ ని ఉద్దేశించి పరోక్షంగా ఆయన చెల్లెలు కవిత చేసిన వ్యాఖ్యలివి. గతంలో కేటీఆర్ ని ట్విట్టర్ నాయకుడంటూ వైరి వర్గాలు విమర్శిస్తున్నా.. కవిత విమర్శలే హైలైట్ గా నిలిచాయి. జగన్ కూడా ఇదే బాటలో వెళ్తున్నట్టున్నారు. ఇటీవల ట్విట్టర్ ని బాగా ఉపయోగిస్తున్నారు. తాజాగా కూటమి ఏడాది పాలనపై ఆయన మరో ట్వీట్ వేశారు. ఏడాదిలోనే ఏపీ అప్పులపాలైపోయిందని అంటున్నారు జగన్.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా కూటమి పార్టీలు సంబరాలకు సిద్ధం కాగా, వైసీపీ ఆందోళనలతో హడావిడి చేయాలనుకుంటోంది. ఈ క్రమంలో నాయకులంతా తమ దగ్గర ఉన్న గణాంకాలతో విమర్శల దాడికి సిద్ధమవుతున్నారు. మాజీ సీఎం జగన్ కూడా కూటమి ఏడాది పాలన అంతా అప్పుల మయం అంటూ విమర్శించారు. సీఎంగా దశాబ్దాల అనుభవం ఉందని, పాలనపై లోతైన అవగాహన ఉందని తనకు తానే చంద్రబాబు ఎలివేషన్లు ఇచ్చుకుంటారని, కానీ ఆ దశాబ్దాల అనుభవం ఏపీకి ఏమిచ్చిందని సూటిగా ప్రశ్నించారు జగన్. కేవలం ఒక ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందన్నారు. తమ పాలనల ఐదేళ్ల మొత్తంలో చేసిన అప్పులో 44 శాతం అప్పుని ఒక్క ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఏమీ సాధించలేకపయారని ఎద్దేవా చేశారు జగన్.
. @ncbn garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered?
In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government… pic.twitter.com/UD8lWn2SBE
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025
కేంద్ర గణాంకాల శాఖ(MOSPI), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG) విడుదల చేసిన గణాంకాలను ఉదహరిస్తూ జగన్ ట్వీట్ వేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అసమర్థ ఆర్థిక దుర్వినియోగం గురించి ఆ రెండు సంస్థలు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడించాయని చెప్పారు జగన్.
కూటమి పాలనలో GSDPకి ఆర్థిక లోటు 4.08శాతం నుంచి 5.12శాతానికి పెరిగిందన్నారు జగన్. GSDPలో ఆదాయ లోటు 2.65 శాతం నుంచి 3.61శాతానికి పెరిగిందన్నారు. గతంలో తాము రుణాలు తీసుకున్నా దాన్ని మూలధన వ్యయం కోసం ఉపయోగించామన్నారు జగన్. తమ హయాంలో తీసుకున్న రుణాల్లో 33.25శాతం మూలధన వ్యయంగా ఖర్చు చేశామన్నారు. కానీ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం తీసుకున్న రుణంలో కేవలం 23.49శాతం మాత్రమే మూలధన వ్యయంగా ఖర్చయిందన్నారు.
జగన్ ట్వీట్లతో ఏం జరుగుతుంది..? ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందా..? లేక ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందా..? ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న. కానీ జనంలోకి వెళ్లేందుకు జగన్ ఇలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత హ్యాండిల్ ద్వారా పూర్తిగా యాక్టివ్ అయి, ఆ తర్వాత గతంలో లాగా జనం మధ్యకు వెళ్లి, అవే విషయాలు వారికి వివరించే ప్రయత్నం చేస్తారట జగన్. మరి ఈ ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. అటు తెలంగాణలో కేటీఆర్ కూడా సోషల్ మీడియాలో స్టార్ అనిపించుకున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆయన పప్పులు ఉడకలేదు. ప్రజలతో ఉంటేనే నాయకుడు అనిపించుకుంటారు. సోషల్ మీడియాలో మాత్రమే కనపడితే వారిని నెటిజన్లు మాత్రమే గుర్తించుకుంటారు.