Android Settings: కొత్త స్మార్ట్‌ఫోన్ చేతిలోకి రాగానే మనందరికీ ఉండే ఆత్రుత వేరు. బాక్స్ ఓపెన్ చేయడం, ఫోన్ ఆన్ చేసి కెమెరా క్వాలిటీ చూడటం, నచ్చిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో సరిపెట్టుకుంటాం. కానీ, అసలైన పనిని మాత్రం చాలామంది మర్చిపోతుంటారు. అదే ఫోన్ ఇనిషియల్ సెట్టింగ్స్ మార్చడం. కొత్త ఫోన్ కొన్న వెంటనే కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ మార్చకపోతే డేటా లీక్ అవ్వడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం, ప్రకటనల గోల ఎక్కువవ్వడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఫోన్ చేతికి రాగానే మార్చాల్సిన ఆ 7 ముఖ్యమైన సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫోన్ కొన్నప్పుడు Adaptive Brightness ఆన్‌లో ఉంటుంది. ఇది వెలుతురును బట్టి స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఆటోమేటిక్‌గా మారుస్తుంది. దీంతో ప్రాసెసర్, సెన్సార్లు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండి బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తాయి. దీన్ని ఆఫ్ చేసి, మీకు అవసరమైనంత వరకే బ్రైట్‌నెస్ మ్యాన్యువల్‌గా సెట్ చేసుకోవడం మంచిది.
కొత్త ఫోన్‌లో ఇన్స్టాల్ చేసిన ప్రతి యాప్ ఏదో ఒక నోటిఫికేషన్ పంపుతూనే ఉంటుంది. దీనివల్ల దృష్టి మరళడమే కాకుండా.. ఫోన్ బ్యాటరీ, ఇంటర్నెట్ డేటా వృథా అవుతాయి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి షాపింగ్, గేమ్స్, సోషల్ మీడియా యాప్స్ పంపే అనవసర నోటిఫికేషన్లను వెంటనే డిసేబుల్ చేసుకోండి.
మనం డౌన్‌లోడ్ చేసే చాలా యాప్స్‌కు లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్ పర్మిషన్లు అవసరం ఉండదు. ఉదా: ఒక క్యాలిక్యులేటర్ యాప్‌కి మీ లొకేషన్ పర్మిషన్ ఎందుకు? అందుకే సెట్టింగ్స్‌లోని Privacy and Security లోకి వెళ్లి, ఏ యాప్‌కి ఏ పర్మిషన్ ఉందో చెక్ చేసి, అవసరం లేని వాటిని While using the appకి మార్చండి.
Also Read: వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?
ఫోన్ ఉపయోగించి పక్కన పెట్టినప్పుడు స్క్రీన్ ఆఫ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడితే బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అవుతుంది. సాధారణంగా డిఫాల్ట్‌గా ఇది 1 లేదా 2 నిమిషాలు ఉంటుంది. దాన్ని 30 సెకన్లకు తగ్గించుకుంటే బ్యాటరీ లైఫ్ గణనీయంగా పెరుగుతుంది.
మీరు ఫోన్‌లో దేని గురించి వెతికినా, మాట్లాడినా దానికి సంబంధించిన యాడ్స్ రావడం గమనించారా? గూగుల్ మీ డేటాను ఉపయోగించి ఇలాంటి యాడ్స్ చూపిస్తుంది. సెట్టింగ్స్‌లోని గూగుల్ ఆప్షన్‌లోకి వెళ్లి Personalized ads లేదా Ad IDని డిసేబుల్ చేయడం వల్ల మీ ప్రైవసీకి రక్షణ ఉంటుంది.
ఫోన్ సెటప్ చేసేటప్పుడు తెలియకుండానే Send diagnostic data ఆప్షన్‌కు ఓకే చేస్తాం. దీంతో ఫోన్ కంపెనీలు మీ వినియోగ వివరాలను బ్యాక్‌గ్రౌండ్‌లో సేకరిస్తుంటాయి. ఇది ప్రైవసీకి మంచిది కాదు. అలాగే బ్యాటరీని కూడా అమాంతం లాగేస్తుంది. సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్‌ను వెతికి ఆఫ్ చేయండి.
కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లలో కంపెనీలు ముందే కొన్ని యాప్స్ (బ్లోట్‌వేర్) ఇన్స్టాల్ చేసి ఇస్తాయి. వీటిలో చాలావరకు మనకు అసలు ఉపయోగపడవు. ఇవి ఫోన్ స్టోరేజ్, ర్యామ్‌ను ఆక్రమిస్తాయి. అందుకే ఫోన్ ఆన్ చేయగానే అవసరం లేని సిస్టమ్ యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ లేదా డిసేబుల్ చేయడం వల్ల ఫోన్ స్పీడ్‌గా పనిచేస్తుంది.
Also Read: రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!