Vallabhaneni Vamsi Case Updates: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? సోదాల్లో కీలక వివరాలు పోలీసులకు చిక్కాయా? సత్యవర్థన్ వ్యవహారంలో విలువైన ఫుటేజీ చిక్కిందా? జైలులో వంశీ సెల్ వద్ద ఎందుకు బందోబస్తు పెంచారు? అంతా అనుకున్నట్లు జరిగితే వంశీతో జగన్ ములాఖత్ కానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆ ముగ్గురే కీలకం
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అతని అనుచరుల ఆగడాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. బాధితుడు సత్యవర్థన్‌ను హైదరాబాద్‌లోని వంశీ ఇంటికి తీసుకెళ్లడం, అక్కడి నుంచి మరుసటి రోజు విశాఖ తరలించడం, ఆ తర్వాత విజయవాడ కోర్టుకు తీసుకొచ్చిన సీసీటీవీ పుటేజ్ పోలీసులకు చిక్కింది. దీంతో వంశీ పాత్ర నిరూపించే సాక్షాలను సేకరించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెదిరింపుల కేసు విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం వేట గాలిస్తున్నారు. హైదరాబాద్, విశాఖకు ప్రత్యేక పోలీస్ బృందాలు వెళ్లాయి. లభించిన డేటా ప్రకారం ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టారు. నిందితులు ఉపయోగించిన రెండు కార్లను గుర్తించే పనిలో పడ్డారు.
ఈ కేసులో 12 మందిని నిందితులుగా ప్రస్తావించారు పోలీసులు. ఇప్పటి కేవలం ఐదుగుర్ని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. వీరిలో కీలక నిందితులు రంగా, కోట్లు, రాము పట్టుబడితే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
ALSO READ: లగడపాటి దారిలో కేశినేని నాని, కాకపోతే చిన్న ట్విస్ట్
జైలులో వంశీ సంగతులు
ఇదిలావుండగా విజయవాడ జైల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బ్యారక్‌కు అధికారులు పరదాలు కట్టినట్టు తెలిసింది. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జైలు అధికారులు ఒకటో నంబరు బ్యారక్‌లో గదిని వంశీకి కేటాయించారు. వంశీకి ఇతర ఖైదీలకు కనిపించకుండా కటకటాల వద్ద పరదా కట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇతర ఖైదీలను వంశీ ఉన్న బ్యారక్ వైపు వెళ్లకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలావుండగా సత్యవర్ధన్‌ను జడ్జి ముందు ప్రవేశపెట్టడానికి పోలీసులు రెడీ అయ్యారు. వంశీ ప్రణాళికలతో ఆయన అనుచరులు తనను బెదిరించి కిడ్నాప్ చేయడం, టీడీపీ ఆఫీసు కేసు వ్యవహారాలపై సీఆర్పీసీ 161 ప్రకారం సత్యవర్ధన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ 164 కింద న్యాయాధికారి ముందు చెప్పాల్సి ఉంటుంది. దీనిపై చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు లేఖ రాశారు పోలీసులు. సోమవారం కోర్టు నిర్ణయం తీసుకుని సమయాన్ని కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం.
వంశీతో జగన్ ములాఖత్ డౌట్
మరోవైపు జైలులో ఉన్న వంశీని మంగళవారం కలవాలని భావిస్తున్నారు మాజీ సీఎం జగన్. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పరామర్శిస్తారని తెలిసింది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్, మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా గాంధీనగర్‌లోని జైలుకు వెళ్తారని సమాచారం. వంశీని కస్టడీపై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. ఆయన్ని పోలీసుల కస్టడీకి ఇచ్చినట్లయితే వంశీని జగన్ కలిసే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు.