Jogi Ramesh: ఏపీలో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును చేర్చడంపై.. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ తాజాగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తనపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌లకు ఆయన కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
నా మీద ఎన్ని ఆరోపణలు చేసినా, నేను ఎక్కడికైనా సిద్ధం. లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను అని సవాల్ విసిరారు. చంద్రబాబు, నీకు ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు ఒక్కో సమాధానం చెప్పు. రాష్ట్ర ప్రజల ముందు నిజం బయటపడుతుంది అంటూ ఆయన సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ఇటీవల బయటపడిన నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు విషయంపై చంద్రబాబు, టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారని జోగి రమేష్ ఆరోపించారు. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డాక, మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ బాటిళ్లు పట్టుకున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
అలాగే ఈ నకిలీ లిక్కర్ సరఫరా చైన్ ఏంటి? ఎవరెవరు కొనుగోలు చేశారు? ఎవరెవరు అమ్మారు? ఈ మాఫియా వెనుక ఎవరు ఉన్నారు? అని ప్రజల ముందు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నకిలీ లిక్కర్ కేసులో ఉన్న అద్దేపల్లి జనార్దన్ అరెస్ట్‌పై కూడా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
జనార్దన్‌ను ఎవరు రప్పించారు? ఆయన స్వచ్ఛందంగా వచ్చారా? రెడ్ కార్నర్ నోటీసు ఎందుకు జారీ చేయలేదు? ఆ వ్యక్తి ముంబైలో ఉంటే, మీ ప్రభుత్వం ఎందుకు వెళ్లి అరెస్ట్ చేయలేకపోయింది? అని ఆయన అడిగారు.
జనార్దన్ ఫోన్ పోయిందని చెప్పినా, ఆ ఫోన్ నుంచి జోగి రమేష్‌తో చాట్ స్క్రీన్‌షాట్స్ ఎలా బయటపడ్డాయి? పోలీస్ కస్టడీలో వీడియోలు ఎలా విడుదలయ్యాయి? అని ప్రశ్నిస్తూ ఆయన ఆ వ్యవహారం వెనుక టీడీపీ చేతులు ఉన్నాయని ఆరోపించారు.
తంబళ్లపల్లె నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి తన అఫిడవిట్‌లో లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయని చెప్పాడు. అతనికి టిక్కెట్ ఎవరు ఇచ్చారు? మీరు ఇవ్వలేదా? ఆ టిక్కెట్ల వెనుక సూట్‌కేస్ డీల్ ఎవరిది? అని ఆయన ప్రశ్నించారు.
సీనియర్ నాయకుడు శంకర్ యాదవ్‌ను టిక్కెట్ కోసం ముంచిన సంగతి ప్రజలకు తెలిసే ఉంది అంటూ జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మీ ప్రభుత్వం వచ్చాక రూ.99ల లిక్కర్ స్కీమ్ ఎంతవరకు కొనసాగింది? మీరు చెప్పిన అద్భుత పాలసీలో ప్రజలకు ఏం లభించింది? అని ఆయన ప్రశ్నించారు. బార్లకు వేరుగా సరఫరా చేయాల్సిన మందు ఎందుకు లిక్కర్ షాపుల నుంచే అమ్ముతున్నారు? ఇందులో మత్తు రవి, రాజేష్, లోకేష్‌ల వాటాలు ఉన్నాయా? అని జోగి రమేష్ సూటిగా ప్రస్తావించారు.
నేను దైర్యంగా రాష్ట్ర ప్రజల ముందే చెబుతున్నా.. ఈ వ్యవహారాల్లో నేను ఏ తప్పూ చేయలేదు. మీరు చెప్పినట్టుగా ఉంటే లై డిటెక్టర్ టెస్ట్‌కైనా రండి. దైర్యం ఉంటే నిజం బయటపెట్టండి. వ్యవస్థలను దుర్వినియోగం చేయొద్దు అంటూ ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు.
Also Read: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం మంత్రి లోకేష్ విజ్ఞప్తి
అలాగే ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మడం మానేశారు. మిమ్మల్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. దుర్మార్గంగా వ్యవస్థలను వాడుకోవడం మానండి అని జోగి రమేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు.