AP Heavy Rains: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అనంతరం 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వాయుగుండం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆదివారం రాత్రికి దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
అల్పపీడనం ప్రభావం కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, అనంతపురం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం వాయుగుండంగా ఆ తరువాత తుపానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ సీజన్ ఏర్పడే అల్పపీడనాలు తుపానులుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
వాయుగుండం ప్రభావంతో ఈ నెల 23న ప్రకాశం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, నంద్యాల, కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read: CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పలు జిల్లాల కలెక్టర్లు వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.