CM Chandrababu: దీపావళి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తీపి కబురు పంపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పారిశ్రామిక రాయితీలను.. విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పారిశ్రామిక రంగం పునరుత్తేజం పొందాలన్న లక్ష్యంతో.. తొలి విడతగా రూ.1500 కోట్ల పారిశ్రామిక రాయితీలు విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
ఈ నిధులు పరిశ్రమల అభివృద్ధి, విస్తరణ, ఉద్యోగావకాశాల సృష్టికి తోడ్పడనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు.. ఈ రాయితీలు ఇస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
చిన్న, మధ్య తరహా వ్యాపారాలు గత కొన్నేళ్లుగా ఇన్సెంటివ్‌ల కోసం ఎదురుచూస్తున్నాయి. ముడిసరుకు ధరలు పెరగడం, మార్కెట్ పోటీ, రుణాల భారంతో వాటి కార్యకలాపాలు మందగించాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పరిశ్రమలకు ఆర్థికంగా బలాన్నిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రాయితీలు విడుదల ప్రక్రియను నిర్వహించేందుకు.. ఆన్‌లైన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానం ద్వారా చెల్లింపులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఏ పరిశ్రమకు ఎంత ఇన్సెంటివ్ బకాయి ఉందో స్పష్టమైన డేటా ఆధారంగా చెల్లింపులు జరగనున్నాయని తెలిపారు.
Also Read: నన్ను జైలుకు పంపాలని టార్గెట్.. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు
పెట్టుబడిదారులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పరిశ్రమల సంఘాలు, ఇండస్ట్రియల్ అసోసియేషన్లు ప్రక్రియను దీపావళి గిఫ్ట్‌గా అభివర్ణించాయి. చాలా కాలంగా బకాయిలతో ఇబ్బందులు పడుతున్న సంస్థలకు ఇది తిరిగి పునరుజ్జీవనాన్ని ఇస్తుందని అన్నారు.