అరెస్ట్ కి భయపడి పారిపోయిన కాకాణి గోవర్దన్ రెడ్డి తరపున ఆ పార్టీ నేతలు, సాక్షి మీడియా లాజిక్ లు బయటకు తీస్తున్నారు. కాకాణి నెల్లూరులో అందుబాటులో ఉన్నప్పుడు పోలీసులు నోటీసులివ్వలేదట. ఆయన ఉగాది పండగకోసం హైదరాబాద్ వెళ్తే, కావాలని నెల్లూరులో ఆయన ఇంటికి పోలీసులు వచ్చారట. పోనీ హైదరాబాద్ లో అయినా పోలీసులు వెళ్లినప్పుడు ఆయన ఉండాలి కదా, అప్పుడు కూడా అక్కడ లేకపోవడానికి ఇంకేదో కారణం ఉందట. పారిపోయిన కాకాణికి సపోర్ట్ గా లాజిక్ లు చెబుతూ వైసీపీ నేతలు తమ పరువు తామే తీసుకుంటున్నారు.
అప్పట్లో కాకాణి హవా..
వరుసగా రెండుసార్లు సర్వేపల్లి నియోజక వర్గం నుంచి గెలవడంతోపాటు, రెండో దఫా జగన్ కేబినెట్ లో బెర్త్ దక్కడంతో నెల్లూరులో కాకాణి ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా సాగింది వ్యవహారం. నెల్లూరు జిల్లాలోనే ఆయనతో వైసీపీ నేతలకు సఖ్యత లేదు. అనిల్ కుమార్ యాదవ్ ని ఆయన పూర్తిగా తొక్కేయాలని చూశారు. చివరకు ఆయన్ను నర్సరావు పేటకు పంపించడంలో కూడా కాకాణి హ్యాండ్ ఉందనే అంటారు. అప్పట్లో అనిల్ కి, కాకాణికి మధ్య ఫ్లెక్సీ వార్ కూడా నడిచింది. అది చాలదన్నట్టు మైనింగ్ మాఫియాకు కూడా తెరదీశారు కాకాణి. అంతే కాదు, కృష్ణపట్నంలో ఉన్న కంపెనీలకు కూడా కాకాణి బ్యాచ్ వార్నింగ్ లు ఇచ్చేది. సర్వేపల్లిలో తనకు ఎదురే లేదనుకున్నారాయన. చివరకు జగన్ ఓడిపోయినా తన నియోజకవర్గంలో తనపై వ్యతిరేకత ఉండదని డిసైడ్ అయ్యారు.
కాకాణి ఓవర్ కాన్ఫిడెన్స్..
కాకాణి ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్తా నేలకు దిగింది. కాకాణి చేతిలో పదే పదే ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఓడిపోయినా కాకాణి తనదే పైచేయి అనేవారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తన పట్టుకోసం కొన్నాళ్లు బెట్టు చేశారు. తీరా ఆ పదవి ఇచ్చాక మళ్లీ చక్రం తిప్పాలనుకున్నారు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్సీ ఉన్నా కూడా, మాజీ మంత్రిగా తనదే పైచేయి కావాలనుకునేవారు కాకాణి. ఇక కేసుల విషయానికొస్తే, కాకాణి పాపం పండిందనే చెప్పాలి. ఇన్నాళ్లూ అరెస్ట్ ని తప్పించుకున్నారు, ఇప్పుడు పక్కాగా ఆధారాలు దొరికాయి, దీంతో జైలు తప్పదని భయపడిపోయిన కాకాణి నెల్లూరు వదిలి పారిపోయారు.
పారిపోయిన కాకాణి
ఇప్పుడు కూడా కాకాణి కాకమ్మ కబుర్లు చెప్పిస్తున్నారు. ఆయన నెల్లూరులో కార్యకర్తలకు అందుబాటులో ఉన్నప్పుడు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే నోటీసులివ్వలేదట. ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్న వైసీపీ నేతల వ్యాఖ్యలివి. పోలీసులు ఎప్పుడు నోటీసులివ్వాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలో కూడా వీరే డిసైడ్ చేస్తున్నారు. తీరా పోలీసులు నోటీసులిచ్చే సమయానికి కాకాణి పారిపోవడం ఎందుకు..? అంత దమ్ము, ధైర్యం ఉన్నోడయితే నెల్లూరులోనే అందుబాటులో ఉండేవారు కదా. ఉగాది అనే పండగను హైదరాబాద్ లో జరుపుకుంటారా, లేక నెల్లూరు లాంటి సొంత ప్రాంతంలో జరుపుకుంటారా..? ఇంకా నయం సంక్రాంతికి కాకాణి హైదరాబాద్ వెళ్లారని చెప్పలేదు. పోనీ హైదరాబాద్ లో ఫొటోలు రిలీజ్ చేశారు సరే, అక్కడయినా ఉన్నారా అంటే పోలీసులు వెళ్లగానే మాజీ మంత్రిగారు అక్కడ్నుంచి జంప్. కేసులకు భయపడేది లేదంటూ మేకపోతు గాంభీర్యం చూపిస్తున్న కాకాణి, అరెస్ట్ ల నుంచి మాత్రం తప్పించుకోవాలనుకోవడం విశేషం.