Ram Gopal Varma: ఏ భయం లేకుండా మాట్లాడుతూ, తన అభిప్రాయాలను ట్వీట్ల రూపంలో బయటపెడుతూ నిరంతరం చిక్కుల్లో పడుతుంటాడు రామ్ గోపాల్ వర్మ. దానివల్లే ఆయనపై ఇప్పటికీ ఎన్నో పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఒక పోడ్కాస్ట్‌లో పాల్గొన్న వర్మ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడడం మాత్రమే కాకుండా ఒకసారి పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి ఇంటికి వచ్చిన సందర్భం గురించి బయటపెట్టారు. అయితే ఆ తర్వాత వర్మకు ఏమైయ్యిందా అని టెన్షన్ పడేలోపే అసలు విషయం చెప్పి నవ్వించారు. అంతే కాకుండా ఈ పోడ్కాస్ట్‌లో ఒక్కసారిగా తన కెరీర్ మొత్తాన్ని కూడా గుర్తుచేసుకున్నారు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.
చట్టాలు మారిపోయాయి
‘‘నాలుగు, అయిదేళ్ల క్రితం నేను కొన్ని ట్వీట్స్ చేశాను. ఎక్కువగా ఆలోచించకుండా ఏమనిపిస్తే అది పోస్ట్ చేసేశాను. కొన్ని గంటల తర్వాత డైరెక్టర్ మహేశ్ భట్ నాకు కాల్ చేసి నీ ట్వీట్స్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కానీ దేవుడికి అతీతంగా మాట్లాడడం చట్టరీత్యా నేరం ఏమీ కాదు అని అన్నారు. అసలు ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే నా ట్వీట్స్ గురించి అప్పటికే నేను మర్చిపోయాను. నేను దాని గురించి ఆలోచించే లోపే పోలీసులు నా ఆఫీసుకు వచ్చేశారు. అప్పటికే చట్టాలు అన్నీ మారిపోయాయి. నాపై కేసు అనేది ఇంక చెల్లదు. అందుకే పోలీసులకు కూడా ఏం చేయాలో తెలియక నాతో కూర్చొని మద్యం తాగి వెళ్లిపోయారు’’ అని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.
చాలామంది హెచ్చరించారు
‘‘చాలావరకు నేను చేసే ట్వీట్లు మామూలుగా చేస్తుంటాను కానీ కొన్నిసార్లు మాత్రం కొందరిని చిరాకుపెట్టడానికి చేస్తుంటాను’’ అంటూ తన ట్వీట్స్‌పై క్లారిటీ ఇచ్చారు వర్మ. ఇక అండర్ వరల్డ్‌పై ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు ఈ దర్శకుడు. దానిపై కూడా ఆయన స్పందించాడు. ‘‘చాలామంది అండర్ వరల్డ్‌పై సినిమాలు చేయకు అంటూ నన్ను హెచ్చరించారు. కానీ నేను ఎవ్వరినీ చెడ్డవారిగా చూపించడం లేదు. నేను ఒక సినిమా చేస్తున్నాను అంతే. దానికి వాళ్లు కూడా హ్యాపీ. అందులో నేను మంచినే చూపించాను. సత్య తెరకెక్కించడం వల్ల నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. నన్ను ఫ్రీగా వదిలేశారు కూడా’’ అంటూ ధైర్యంగా తెలిపాడు ఆర్జీవీ.
Also Read: దమ్ముంటే నన్ను బ్యాన్ చేయండి.. నేను చేసేది నేను చేస్తా..
తనే రీమేక్ చేయాలి
‘సత్య’ అనే సినిమా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సినీ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన కొత్తలో వర్మ తెరకెక్కించిన చాలావరకు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ‘సత్య’ లాంటి సినిమాను మళ్లీ తానే తీయాలనుకున్నా తీయలేనని పలుమార్లు స్టేట్‌మెంట్ ఇచ్చాడు వర్మ. ఈతరం దర్శకుల్లో ‘సత్య’ సినిమాను సందీప్ రెడ్డి వంగా రీమేక్ చేస్తే బాగుంటుందని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. సందీప్ రెడ్డి వంగా అంటే రామ్ గోపాల్ వర్మకు చాలా ఇష్టం. అచ్చం తనలాగానే మాట్లాడతాడని, తనలాగే ఉంటాడని ఎన్నోసార్లు తనపై ఇష్టాన్ని బయటపెట్టాడు వర్మ.