కాకాణి గోవర్దన్ రెడ్డి జైలుకి వెళ్లిన తర్వాత జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హడావిడి కాస్త మొదలైంది. మరోవైపు జిల్లా ఇన్ చార్జ్ గా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నియమించింది. ఇప్పుడు కాకాణి బెయిల్ పై రావడంతో వారిద్దరికీ కాస్త ఇబ్బందేనని చెప్పాలి. చంద్రశేఖర్ రెడ్డి కాకాణితో కలిసిపోతారు, కానీ అనిల్ కి ఆ అవకాశం లేదు. అనిల్, కాకాణి మధ్య ఇప్పటికీ గొడవలున్నాయి. కాకాణి బెయిల్ పై విడుదలైన తర్వాత అనిల్ కనీసం పలకరించకపోవడమే దీనికి తాజా రుజువు. మరి జిల్లా పార్టీపై పెత్తనం ఎవరిది అవుతుందో చూడాలి.
కాకాణి వర్సెస్ అనిల్..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ ఓ వెలుగు వెలిగింది. 2019 ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. 2024 నాటికి పార్టీ పరిస్థితి జిల్లాలో దారుణంగా తయారైంది. వలసలతో పార్టీ ఇబ్బంది పడగా, జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం గమనార్హం. ఆ తర్వాత కూడా పార్టీలో కదలిక లేకుండా పోయింది. కాకాణి గోవర్దన్ రెడ్డి ఒక్కరే పార్టీ తరపున వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల ఆయన అరెస్ట్ తో వైసీపీ పూర్తిగా చతికిలబడిందనే చెప్పాలి. ఆ సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి కూడా జరిగింది. కాకాణి లేకపోవడంతో ఆ దాడి తర్వాద పెద్ద హడావిడి కూడా జరగలేదు. ఈలోగా మాజీ మంత్రి అనిల్ జిల్లా పార్టీపై పెత్తనం చెలాయించేందుకు సిద్దమైనా అధిష్టానం ఆయన్ను పట్టించుకోలేదు. జిల్లా పార్టీపై పెత్తనాన్ని తాత్కాలికంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించింది. దీంతో అనిల్ మళ్లీ తెరవెనక్కు వెళ్లిపోయారు.
భవిష్యత్ ఏంటి?
కాకాణి బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత అదే దూకుడు కొనసాగిస్తున్నారు. ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ లేకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో తిరిగి వైసీపీలో హడావిడి మొదలైంది. తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జైలు దగ్గర కాకాణికి భారీగా స్వాగతం పలకడంతోపాటు తిరిగి ఆయన క్యాంప్ లోనే చేరినట్టయింది. దీంతో జిల్లాలో అనిల్ ఒంటరిగా మిగిలారు. మిగతా నాయకులు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఆత్మకూరు, కావలి మాజీ ఎమ్మెల్యేలు పక్కా వ్యాపారవేత్తలు కావడంతో బెంగళూరులోనే వారు మకాం వేశారు. అప్పుడప్పుడు మాత్రమే జిల్లాకు వస్తున్నారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఎంపీగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి ఇప్పటికే పార్టీని వీడారు, రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వ్యాపారలతో బిజీగా ఉన్నారు కానీ, పార్టీ నాయకులను, కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మొత్తమ్మీద నెల్లూరు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన వైసీపీ ఇప్పుడు ఇబ్బందులు పడుతోంది. తిరిగి పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత కాకాణిపైనే పడినట్టయింది. నాయకుల మధ్య సయోధ్య లేకపోవడం, అంతర్గత కుమ్ములాటలు, ఓటమితో కేడర్ దూరం కావడం.. ఇలా ఇప్పటి వరకైతే వైసీపీ కష్టకాలంలోనే ఉందని చెప్పాలి. కూటమి తప్పులు చేస్తే, ఆ తప్పుల్ని ప్రతిపక్షం ఉపయోగించుకోగలిగితే రాబోయే రోజుల్లో మార్పు జరిగే అవకాశముంది.