బీజేపీ, వైసీపీ మధ్య బంధం జగమెరిగిన సత్యం. కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం బీజేపీని ఎదిరించడానికి జగన్ సాహసం చేయరు. అదే సమయంలో జగన్ ని కూడా బీజేపీ రహస్య స్నేహితుడిలాగే పరిగణిస్తోంది. ఏపీ బీజేపీ నేతలు జగన్ ని విమర్శించినా, తాజా ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పుడల్లా జగన్ సాయం చేస్తూనే ఉన్నారు. అలాంటి జగన్ పై మోదీ విమర్శలు చేస్తే..? ఏపీలో ప్రతిపక్షాన్ని మోదీ ఇరుకున పెట్టేలా మాట్లాడితే..? కచ్చితంగా టీడీపీకి లాభమే. ఈనెల 16న కర్నూలులో జరగబోతున్న మోదీ సభలో అదే జరుగుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆహ్వానాల అంతరార్థం కూడా అదేనంటున్నారు. ఏపీలో ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపుతూ మోదీ ప్రసంగం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో మరో రెండ్రోజుల్లో తేలిపోతుంది.
సూపర్ జీఎస్టీ..
ఈనెల 16న కర్నూలులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభ జరగబోతోంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. జీఎస్టీ సవరణలతో ప్రజలకు ఎంత మేలు జరిగిందనే విషయాన్ని వివరిస్తారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై కూడా ఆయన విమర్శలు ఎక్కుపెట్టబోతున్నారు. బీహార్ ఎన్నికల వేళ ఎక్కడ ఏ సభ జరిగినా కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేలా ప్రవర్తిస్తారు మోదీ. ఏపీలో కాంగ్రెస్ పాత్ర లేకపోయినా.. జీఎస్టీ లాభాలు చెప్పే క్రమంలో ఆ పార్టీని మోదీ టార్గెట్ చేయక మానరు. ఇక ఏపీలో ప్రతిపక్ష వైసీపీపై కూడా మోదీ విమర్శలు ఎక్కుపెడతారని తెలుస్తోంది.
Also Read: అలా వద్దు, ఇలా చేయండి. విజయ్ కు పవన్ సలహా..?
జగన్ ని టార్గెట్ చేస్తారా?
మోదీకి మొహమాటాలేం లేవు. చంద్రబాబుతో స్నేహం ఉన్నప్పుడు ఎలా పొగిడేవారో, అప్పట్లో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వెళ్లిన తర్వాత అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే మోదీ గతంలో ఎప్పుడూ జగన్ ని ఆస్థాయిలో టార్గెట్ చేయలేదు. కాంగ్రెస్ కి జగన్ ఆగర్భ శత్రువు అని మోదీ నమ్ముతున్నారు కాబట్టే ఆయన్ను ఎప్పటికీ స్నేహితుడిగానే భావిస్తున్నారు. అయితే ఏపీలో కూటమికి జగన్ ఉమ్మడి శత్రువు. ఇప్పుడైనా జగన్ పై మోదీ విమర్శలు ఉంటాయో లేదో చూడాలి. ఏపీలో పీపీపీ పద్ధతిలో నిర్మించబోతున్న మెడికల్ కాలేజీలను వైసీపీ వ్యతిరేకిస్తోంది. అమరావతి నిర్మాణంలోనూ లోపాలు వెదుకుతోంది. పోలవరం నిర్మాణంపై కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. తన హయాంలో ఆ పనులన్నీ చేయలేక చతికిలపడిన జగన్, ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మరి మోదీ మాట కూడా అదేనా? ఏపీలో ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డుపడుతోందని ఆయన అనగలరా? అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు జగన్ అంటూ నిలదీయగలరా? అదే జరిగితే టీడీపీకి మైలేజ్ పెరుగుతుంది. బీజేపీతో నేరుగా జట్టు కట్టకపోయినా పరోక్షంగా ప్రతి సందర్భంలోనూ సాయం చేస్తున్నారు జగన్. ఆ బంధాన్ని వేరుచేయగలిగితే టీడీపీకి మేలు జరుగుతుంది. మోదీ చాణక్యం ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: ‘జగన్ కోసం’ నారా లోకేష్ సాయం..