సంపూర్ణ మద్య నిషేధం..
విడతలవారీ మద్యపాన నిషేధం.
మద్యపాన నిషేధం కాదు, మద్యపాన నియంత్రణ.
ఇదీ జగన్ హయాంలో మనం విన్నది, కన్నది. నేను విన్నాను, నేను ఉన్నానంటూ వచ్చిన జగన్ మద్యపాన నిషేధాన్ని నియంత్రణగా మార్చి, ఎలాంటి జిమ్మిక్కులు చేశారో అందరం చూశాం. అమ్మఒడికి నాన్నబుడ్డితో చెల్లు అని చంద్రబాబు చేసిన సూటి విమర్శలు కూడా బాగానే పనిచేసి 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. మరిప్పుడు వైసీపీ వాళ్లు నకిలీ మద్యం, నకిలీ బీరు అంటూ సోషల్ మీడియా పోస్టింగ్ లు పెడుతుంటే జనం ఊరుకుంటారా? అప్పట్లో జగన్ మద్యాన్ని నిషేధించి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉండేవి కాదు కదా అంటున్నారు కొంతమంది నెటిజన్లు. వైసీపీ విమర్శల్ని వారికే తిప్పికొడుతున్నారు.
మాట ఎందుకు తప్పారు?
నవరత్నాలన్నీ అమలు చేసినా మాకు తిరిగి అధికారం రాలేదు ఎందుకని అంటూ జగన్ పదే పదే ప్రశ్నిస్తుంటారు. అసలు నవరత్నాల్లో జగన్ నికార్సుగా ఎన్ని అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు తప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ కబుర్లు చెప్పి తర్వాత ఎందుకు మాట తప్పారు? ఇవన్నీ ప్రతిపక్షాలు అడుగుతున్నవి కాదు, సామాన్య ప్రజలు అడిగే ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పలేక కొన్నిరోజులు చంద్రబాబుని ప్రజలు గుడ్డిగా నమ్మారని విమర్శించారు, మరికొన్ని రోజులు నెపం ఈవీఎంలపైకి నెట్టారు.. ఇలా రకరకాలుగా తమని తాము సమర్థించుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపించేందుకంటూ నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టారు.
నకిలీ మద్యంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట
కల్తీ మద్యం కి వ్యతిరేకంగా వైయస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు,మాజీ మంత్రి ఎమ్మెల్సీ శ్రీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గారు,శ్రీ గిరిధర్ రెడ్డి గారు, జమ్మలమడుగు… pic.twitter.com/96iOjmk2sE
— YSR Congress Party (@YSRCParty) October 13, 2025
జనం నమ్ముతారా?
జగన్ హామీలను అమలు చేసినట్టే, చంద్రబాబు కూడా అన్నిట్నీ అమలు చేస్తున్నారు. ఆయన మద్యపాన నిషేధం చేయలేదు, ఈయన మహిళలకు నెల నెలా ఆర్థిక సాయంపై కాస్త గడువు కోరుతున్నారు. అంటే సూపర్ సిక్స్ విషయంలో జగన్ విమర్శించడానికేం లేదు. అందుకే కొత్తగా మెడికల్ కాలేజీలు, నకిలీ మద్యం అంటూ కొత్త రూట్ ఎంచుకున్నారు. నకిలీ మద్యం గురించి అడిగే అర్హత అసలు జగన్ కి కానీ, వైసీపీ నేతలకు కానీ ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మద్యపాన నిషేధం విషయంలో పూర్తిగా మాట తప్పిన జగన్, అసలు తాను నిషేధం అనలేదని, నియంత్రణ అని మాత్రమే అన్నానంటూ అబద్ధాలు మొదలు చెప్పారని కూడా ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు నకిలీ మద్యం అంటూ రోడ్డెక్కుతుండటం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. మద్యపాన నిషేధం గురించి వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని అంటున్నారు. పోనీ వైసీపీ అధికారంలోకి వస్తే ఈసారయినా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పగలరా అని నిలదీస్తున్నారు.
Also Read: ‘జగన్ కోసం’ నారా లోకేష్ సాయం..
జగన్ హయాంలో కూడా నకిలీ లిక్కర్ కేసులు బయటపడ్డాయి. కనీసం నాడు కేసులు పెట్టడానికి కూడా ప్రభుత్వం ఇష్టపడలేదు. అసలు కల్తీ జరగలేదని చెప్పుకొచ్చారు. కానీ కూటమి హయాంలో తప్పుడు వ్యవహారం బయటపడిన తర్వాత ప్రభుత్వమే కేసులు పెట్టింది. టీడీపీ నుంచి కొందరు నేతల్ని సస్పెండ్ చేశారు కూడా. అంటే వైసీపీ కంటే కూటమి ప్రభుత్వం గొప్ప పనే చేసింది కదా అని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
Also Read: కర్నూలు సభలో మోదీ ఆ ఒక్క పని చేయగలరా?