వైసీపీ నేత, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ సమయంలో జగన్ ఓ సుదీర్ఘ ట్వీట్ వేశారు. వెంటనే వైసీపీ నేతలందర్నీ ఆయన వద్దకు వెళ్లి పరామర్శించాలని చెప్పారు. గతంలో మరికొందరు నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. కానీ జోగి రమేష్ విషయంలో ఎందుకో ఆయన నుంచి ఆశించిన స్పందన లేదని అంటున్నారు. జోగి అరెస్ట్ అయి మూడు రోజులవుతున్నా జగన్ ట్వీట్ వేసి సరిపెట్టారే కానీ బయట పెద్దగా స్పందించలేదు. కనీసం ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. తుఫాన్ బాధిత రైతులకోసం పెడన నియోజకవర్గం వెళ్లిన జగన్, అక్కడే ఉన్న జోగి కుటుంబాన్ని మాత్రం కలవడానికి వెళ్లలేకపోయారు. రైతుల్ని పరామర్శించే సమయంలో అయినా జోగి వ్యవహారం ప్రస్తావనకు రాకపోవడం విశేషమే. బీసీలను తొక్కేస్తున్నారంటూ జోగి అంటున్న మాటలు జగన్ గురించేనేమో అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
సింపతీ లేదా..?
ఇటీవల వైసీపీ మాజీ ఎంపీ, నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలు జగన్ కి భజన చేస్తున్నారని, అదే సమయంలో వైరి వర్గాలపై ఘాటు విమర్శలు చేస్తూ చిక్కులు కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. జోగి అరెస్ట్ పై ఆయన అలా పరోక్షంగా స్పందించారని తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే తేరుకుని, జోగిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ సింపతీ డైలాగ్ కొట్టారు. వాస్తవానికి వైసీపీలో చాలామంది నేతలు జోగి అరెస్ట్ ని పూర్తి స్థాయిలో ఖండించడం లేదు. ఆయన అరెస్ట్ అయింది లిక్కర్ కేసులోనే అయినా, గతంలో ఆయన చేసిన తప్పులు చాలానే ఉన్నాయని వైసీపీ నేతలే అంటుంటారు. కల్తీ లిక్కర్ స్కామ్ ని బయటకు తీసింది తానేనని చెప్పుకుంటున్న జోగి, ఆ లిక్కర్ కేసులో ఉన్న వ్యక్తులతో తనకు దగ్గరి సంబంధాలు లేవని మాత్రం నిరూపించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీసీ కార్డ్ పనిచేయలేదా?
తన అరెస్ట్ సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఎంత యాగీ చేశారో అందరికీ తెలుసు. బీసీ నేత అయిన తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. తనని అరెస్ట్ చేస్తే తన వర్గం చూస్తూ ఊరుకోదన్నారు. చివరకు తన కుటుంబాన్ని సైతం పోలీస్ స్టేషన్ వరకు తెచ్చారు. ఇంత చేసినా ఆయన అరెస్ట్ తప్పలేదు. సొంత పార్టీలో కనీసం సింపతీ కూడా రాలేదు. దీంతో జోగిలో దిగులు మొదలైంది.
Also Read: మీడియాపై చిందులు తొక్కిన శ్యామల
మాటలు మార్చడంలో దిట్ట..
2024 ఎన్నికల ఫలితాల తర్వాత జోగి రమేష్ చాన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. వైసీపీకి మద్దతుగా కూడా ఆయన బయటకు రాలేదు. అసెంబ్లీలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం అంటూ ఓసారి తమ పార్టీ నేతలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో తన కుటుంబ సభ్యులు కూడా ఆ వ్యాఖ్యల పట్ల నొచ్చుకున్నారని చెప్పారు. ఆ తర్వాత తిరిగి పార్టీలో యాక్టివ్ గా మారి, రీసెంట్ గా నకిలీ లిక్కర్ స్కామ్ విషయంలో హడావిడి చేశారు. తీరా ఆ స్కామ్ తో సంబంధం ఉన్నది ఆయనకేనని తేలడంతో ఆ విషయం సంచలనంగా మారింది. పోనీ జోగి మాటలు మార్చినా, వైసీపీ అధినేత జగన్ మద్దతు ఆయనకు పెద్దగా లేకపోవడం ఇప్పుడు మరింత సంచలనం అయింది. జగన్ ఏపీకి వస్తున్నారంటే కచ్చితంగా జైలుకి వెళ్లి జోగిని కలిసొస్తారేమో అనుకున్నారు. కానీ జగన్ రైతుల్ని పరామర్శించారే కానీ, జోగిని పరామర్శించడానికి వెళ్లలేదు. కనీసం జోగి కుటుంబాన్ని కూడా జగన్ ఓదార్చలేదు.
Also Read: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్