Lakshmi Parvathi: అమరావతి వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయకత్వం, ఆయన ఇచ్చిన హామీలు, అలాగే ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో సాగుతున్న ట్రోలింగ్‌పై ఆమె ఘాటుగా స్పందించారు.
భువనేశ్వరి వ్యాఖ్యలపై నిరసన
అబద్ధాల పునాదులపై బతుకుతున్న చంద్రబాబును నిజాయితీకి నిదర్శనమని భువనేశ్వరి పేర్కొనడం సిగ్గుచేటని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. వంచన, వెన్నుపోటుకు నిదర్శనమైన వ్యక్తికి ఆమె మద్దతుగా మాట్లాడటం దారుణమన్నారు. శాసనసభలో తనకు అవమానం జరిగిందని భువనేశ్వరి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ రికార్డులు పరిశీలిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు, లోకేష్‌లే భువనేశ్వరి క్యారెక్టర్‌ను బజారున పెట్టారని ఆరోపించారు.
లోకేష్ పెంపకం, సోషల్ మీడియా ట్రోలింగ్
తల్లిగా లోకేష్‌ను భువనేశ్వరి సరిగా పెంచలేదని ఆరోపించారు. అందుకే ఐటీడీపీ ద్వారా మహిళలపై నీచమైన ట్రోల్స్ చేయిస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. పరాయి స్త్రీలను, వైఎస్సార్ కుటుంబంలోని మహిళలను, చివరకు తనను ప్రతిరోజూ సోషల్ మీడియాలో అవమానిస్తుంటే భువనేశ్వరి ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేస్తున్న కొడుకు చెంప పగలగొట్టాల్సిన బాధ్యత తల్లిగా ఆమెపై ఉందన్నారు. ఎన్టీఆర్ కూతురనే విషయాన్ని మరచి భువనేశ్వరి కూడా అబద్ధపు ప్రచారాల్లో భాగమవ్వడం విచారకరమన్నారు.
హామీల అమలుపై ప్రశ్నలు
ఉచిత విద్యుత్ హామీ చంద్రబాబుదే అనడం అతిపెద్ద జోక్ అని లక్ష్మీపార్వతి కొట్టిపారేశారు. వైఎస్సార్ తన పాదయాత్రలో రైతుల కష్టాలను కళ్లారా చూసి ఉచిత విద్యుత్ పథకాన్ని తెచ్చారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల్లో ఎన్ని నెరవేర్చారో, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏమైందో, ఆడబిడ్డ నిధి ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబును భువనేశ్వరి నిలదీయాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నా నోరు మెదపని వారు, ఎన్నికల లబ్ధి కోసమే దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త కోర్సులు నేర్చుకుంటే జాబ్ పక్కా! – సీఎం రేవంత్