August 1 Rules: ఆగస్టు 1 నుంచి సామాన్యులను తీవ్రంగా ప్రభావితం చేసే ఎన్నో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్ ఖాతాదారులు, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు, రైలు ప్రయాణికులపై ఈ కొత్త రూల్స్ నేరుగా ప్రభావం చూపనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరల సవరణ, తత్కాల్ టికెట్ల బుకింగ్ లో మార్పులు, CKYC 2.0 అమలు ఇలా ఆగస్టు 1 నుంచి రాబోతున్న కీలక మార్పుల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ప్రతి నెల మాదిరిగానే ఆగస్టు 1న చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలను పునఃసమీక్షించనున్నాయి. జులై నెలలో వాణిజ్య వినియోగం కోసం వాడే 19 కేజీల సిలిండర్ ధర తగ్గినప్పటికీ 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈసారి గృహ వినియోగ గ్యాస్ ధరలు తగ్గుతాయా? లేదా పెరుగుతాయా? అనేది ఆసక్తి రేపుతోంది. అమెరికా-ఇరాన్ యుద్ధం తిరిగి మెుదలైన నేపథ్యంలో గ్యాస్ ధరలు పెరిగితే సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. దీంతో పాటు విమాన ఇంధనం (ATF) ధరలను కూడా ఆగస్టు 1న సవరించనున్నారు. ఏటీఎఫ్ ధరల్లో వచ్చే మార్పులు విమాన టికెట్ల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రక్రియలో భారతీయ రైల్వే కీలక మార్పు తీసుకువస్తోంది. కొత్త నిబంధన ప్రకారం.. తత్కాల్ బుకింగ్ ప్రారంభమయ్యే సమయంతో పాటుగానే టోకెన్ల పంపిణీ కూడా ప్రారంభమవుతుంది. గతంలో తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే ముందే ప్రయాణికులు టోకెన్ తీసుకోవాల్సి వచ్చేది. ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త విధానం ప్రయాణికులకు మరింత సులభతరం కానుంది.
ముడి సరుకుల వ్యయం పెరగడంతో ఆగస్టు నెలలో కొన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. టీ పొడి, సబ్బులు, హెయిర్ ఆయిల్ వంటి ఎఫ్‌ఎమ్‌సిజి (FMCG) ఉత్పత్తుల ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. వీటితో పాటు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు.. మెమోరీ చిప్స్ వ్యయం పెరగడం వల్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా ప్రియం కానున్నాయి. కొన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ వాహనాల ధరలను పెంచే ఆలోచనలో ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెచ్చిన కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ విధానంలో మరింత పారదర్శకత రానుంది. ఆగస్టు 1 నుంచి క్రెడిట్ కార్డ్‌పై ఉండే బాకీ మొత్తం (Outstanding Balance)పై విధించే ఫైనాన్స్ ఛార్జీల్లో.. పెండింగ్ కన్వీనియన్స్ ఛార్జీలు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, పన్నులను మినహాయించనున్నారు. దీనివల్ల పూర్తి బిల్లు చెల్లించలేకపోయే వారికి వడ్డీ భారం తగ్గనుంది. అయితే దీనికి సమాంతరంగా కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు, వార్షిక రుసుముల్లో మార్పులు చేసే అవకాశం ఉంది.
వేతన జీవులు, ఆడిటింగ్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులకు జులై 31 లోపు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయాల్సి ఉంది. ఒకవేళ ఆగస్టు 1 నుంచి ఐటీఆర్ 1, 2 ఫైల్ చేసేవారు.. తమ వార్షిక ఆదాయాన్ని బట్టి అదనంగా పెనాల్టీ రుసుము (Late fee / Penalty) చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు, స్వతంత్ర నిపుణులు, చిన్న వ్యాపారులు ఆగస్టు 31 వరకూ ఐటీఆర్ దాఖలకు అవకాశం ఉంది.
ఆర్థిక రంగంలో వినియోగదారుల గుర్తింపు ప్రక్రియను మరింత సులభతరం, సురక్షితం చేసేందుకు ‘సెంట్రల్ కేవైసీ 2.0’ను ప్రవేశపెడుతున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కస్టమర్ కేవైసీ వివరాలను వేగంగా వెరిఫై చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. దీనివల్ల కొత్త బ్యాంక్ ఖాతాలు తెరిచేవారు, ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే ప్రతిసారీ డాక్యుమెంట్లను (Physical Documents) సమర్పించాల్సిన అవసరం ఉండదు.
Also Read: బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!
ఆగస్టు 1 నుంచి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ ఎస్‌ఎంఎస్ అలర్ట్ ఛార్జీలను ప్రతి మెసేజ్‌కి 30 పైసలుగా సవరించనుంది. కాబట్టి మిగిలిన బ్యాంక్ ఖాతాదారులు కూడా తమ బ్యాంకులు.. ఎస్‌ఎంఎస్ లపై ఇలాంటి సర్వీస్ ఛార్జీలు ఏమైనా తీసుకొస్తున్నాయా? లేదా? అనేది ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్.
Also Read: బంగారు షాపులో కేడీ ఎలుక.. రాత్రికి రాత్రే ఉంగరాలు, గొలుసులు మాయం.. సీసీటీవీ చూస్తే..!