తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఇలాంటి దారుణ హత్య గురించి మనం ఎక్కడా వినలేదు. చంపి శవాన్ని మాయం చేయడం కోసం హంతకుడు దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బోరుబావిలో పడేశాడు. బోరు బావి కి ఉన్న ప్లాస్టిక్ పైప్ లోపలికి ఆ ముక్కలు తోసేసి ఏమీ ఎరగనట్టు పొలం పనులు చేసుకుంటున్నాడు. అన్నట్టు ఈ హత్యకు రాజకీయ రంగు కూడా పులిమేశారు. చనిపోయింది టీడీపీ నేత అని అంటున్నారు.
రాజకీయ హత్యేనా..?
నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో ఈ దారుణం జరిగింది. జంపాలవారి పాలెం శివారులోని పొలాల్లో ఈ హత్య జరిగినట్టు తేలింది. తోపూరి నరసింహం అనే వ్యక్తిని బ్రహ్మయ్య అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. రెండు రోజులపాటు నరసింహం శవంతోనే ఉన్నాడు బ్రహ్మయ్య. ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అలా నరికిన ముక్కల్ని నిమ్మతోటలో ఉన్న బోరుబావిలో పడేశాడు. దీంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఆ తర్వాత తోటలో పని చేసుకుంటూ ఉండిపోయాడు. చివరకు పోలీసులు బోరుబావిలో పడిన ముక్కల్ని వెలికితీసి ఆ శవం నరసింహందేనని తేల్చారు. ఈ విషయం తెలియగానే జంపాలవారి పాలెం వాసులు హడలిపోయారు. తమ గ్రామంలోని వ్యక్తిని హత్య చేయడమే కాకుండా, శవాన్ని ముక్కలు చేసి బోరుబావిలో పడేశారని తెలియడంతో వారు షాకయ్యారు.
అసలేం జరిగింది..?
జంపాలవారి పాలెంలో తోపూరి నరసింహం అనే వ్యక్తికి నిమ్మతోట ఉంది. ఆ తోటలో బ్రహ్మయ్య పనికి కుదిరాడు. కొన్నాళ్లుగా బ్రహ్మయ్య బాగానే పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. కొన్నిరోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందేనని స్థానికులు అంటున్నారు. అయితే నరసింహంను అంత దారుణంగా ఎందుకు హత్య చేశాడనేది తేలాల్సి ఉంది. యజమానిని హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి బోరుబావిలో పడేసిన బ్రహ్మయ్య, ఆతర్వాత తన పని తాను చేసుకుంటూ ఉండటం సంచలనంగా మారింది. తోపూరి నరసింహం కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఎంక్వయిరీ చేయగా నరసింహం తోట వద్దకు వెళ్లి ఆ తర్వాత మాయమైనట్టు తేలింది. దీంతో బ్రహ్మయ్యను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. బోరుబావిలో శవం ముక్కలు కనపడ్డాయి. నరసింహం దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది.
తోపూరి నరసింహం తెలుగుదేశం పార్టీ నాయకుడని తెలుస్తోంది. టీడీపీ నాయకుడి దారుణ హత్య అంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ పార్టీ ప్రస్తావన అవసరం లేదని కొందరు అంటున్నారు. ఈ హత్యకు రాజకీయాలకు సంబంధం లేదని అంటున్నారు. మొత్తానికి నరసింహం హత్య, శవాన్ని మాయం చేసే క్రమంలో ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన.. ఏపీలో సంచలనంగా మారింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వ్యక్తిగత కోపాలు, ద్వేషాలు అయితే హత్య చేయడంతోనే బ్రహ్మయ్య ఆగిపోయేవాడు. అంతకు మించి ప్రతీకారం ఉంటేనే ఇలా శవాన్ని ముక్కలు ముక్కలు చేసే ఆలోచన వస్తుందని అంటారు. మరి ఈ హత్వీయ వెనక అంత బలమైన శతృత్వం ఏంటో తేలాల్సి ఉంది.