Nara Brahmani: నారా లోకేశష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్ )లో ఆదివారం మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నొమెంట్ ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రారంభించారు.
క్రీడా ప్రాంగణానికి చేరుకున్న నారా బ్రాహ్మణికి కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించి, ఆప్యాయంగా అభివాదం చేశారు. అనంతరం బ్రాహ్మణి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నారా లోకేశ్ పుట్టిన రోజును పురష్కరించుకొని ప్రతి ఏటా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. గెలుపొందిన విజేతలకు రూ.10 లక్షల విలువైన బహుమతులు అందంజేస్తామని చెప్పారు.
ఈ ఏడాది మంగళగిరి ప్రీమియర్ లీగ్–4 టోర్నమెంట్ మరింత విశాల స్థాయిలో నిర్వహించబడుతోంది. నేటి నుంచి జనవరి 21 వరకు సాగనున్న ఈ పోటీల్లో మొత్తం 125 జట్లు పాల్గొననున్నాయి. ఈరోజు మ్యాచ్‌ను బ్రాహ్మణి టాస్ వేసి ప్రారంభించారు. ఆటగాళ్లను ఉద్దేశించి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బ్రాహ్మణి, నిఖిల్ కొద్దిసేపు సరదాగా క్రికెట్ ఆడడం అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వారి ఆటను చూసిన యువత చప్పట్లతో హర్షం వ్యక్తం చేసింది.
క్రీడా కార్యక్రమాల అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై.. ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను నారా బ్రాహ్మణి తిలకించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
కాగా, ఈ రోజు నారా బ్రాహ్మణి పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన పుట్టినరోజునే క్రీడా కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, యువత మధ్య ఉండటం ప్రత్యేక అనుభూతినిస్తోందని బ్రాహ్మణి అన్నారు.
Also Read: పవన్ హామీ నెరవేర్చిన టీటీడీ.. కొండగట్టులో రూ.35.19 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
ఇదిలా ఉంటే.. ఎక్స్ వేదికగా తన సతీమణి నారా బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేష్. కష్టసుఖాల్లో, ప్రశాంతతలో, గందరగోళంలోనూ నువ్వే నాకు తోడుగా ఉన్నావంటూ పోస్ట్ చేశారు. దేవాంశ్‌కు ప్రేమగల తల్లిగా, పగటిపూట రాక్ స్టార్ సీఈఓగా, నా ప్రతి అడుగులోనూ నడిచిన నీకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ లోకేష్ ట్వీట్ చేశారు.