Minister Lokesh On AU: ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన అవకతవకలపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. వైసీపీ హయాంలో ఏయూ రాజకీయాలకు కేరాఫ్‌గా మారింది. ఈ విషయంలో అప్పటి వీసీ ప్రసాద్‌రెడ్డిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఏయూకి సంబంధించిన భూములను ఉచితంగా ధారాదత్తం చేశారనే ఆరోపణలు లేకపోలేదు. అంతేకాదు కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ అటువైపు దృష్టి పెట్టింది.
గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే దీనిపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. 2019-24 మధ్యకాలంలో ఏయూలో జరిగిన అవకతవకలపై అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిపై ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు. అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డితోపాటు కొంతమందిపై అనేక ఆరోపణలు ఉన్నాయని వివరించారు. ఈ వర్సిటీలో చదివినవారు ప్రస్తుతం వ్యాపారవేత్తలుగా, రాజకీయ నేతలుగా ఉన్నారని గుర్తు చేశారు.
ప్రపంచంలోని టాప్ 100లో ఏయూ ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు సదరు మంత్రి. సంస్కరణలో భాగంగా ఐఐటీ ఖరగ్‌పూర్ మేథ్స్ ప్రొఫెసర్ రాజశేఖర్‌ను ఏయూ వీసీగా నియమించామన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు డిమాండ్ మేరకు ఏయూలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ వేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి లోకేష్. 60 రోజల్లో విజినెన్స్ నివేదిక ఇవ్వనుంది. నివేదిక రాగానే నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకోసారి పొరపాటు చేయాలంటే భయపడేలా ఉంటాయన్నారు. విజిలెన్స్ రిపోర్టును సభ్యులకు అందజేస్తామన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అప్పటి ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆనాడే ప్రభుత్వాన్ని కోరామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నియమాకాలు, నిధులు దారి మళ్లింపు, రాజకీయాలకు కేంద్రంగా ఏయూని మార్చారని అన్నారు. విజిలెన్స్ విచారణ వేసి వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
ALSO READ: ఇక చెవిరెడ్డి వంతు, అయితే ఏంటి?
టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు మాట్లాడుతూ.. గతంలో ఏయూ వైసీపీ కార్యాలయంగా మారిందన్నారు. ఇక్కడ కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. ఆ నిధులను జగన్ విశాఖ వచ్చినట్టు మూడు హెలిపాడ్లు తయారు చేయాలని ప్లాన్ వేశారన్నారు. వందేళ్లు చరిత్ర కలిగిన చెట్లను సైతం నరికేశారన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో యూనివర్సిటీలు రాజకీయాలకు అడ్డాగా మారాయన్నారు. నిందితులపై కఠినమైన చర్యలు ఉండాలన్నారు. కచ్చితంగా విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విచారణ కమిటీకి నిర్థిష్టమైన కాల పరిమితి ఉండాలన్నారు. ఆ తర్వాత శిక్షలు కఠినంగా ఉండాలన్నారు.
బీజేపీ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఆంధ్ర యూనివర్సిటీ అంటే మంచి పేరు ప్రతిష్టలు ఉండేవన్నారు. రాజకీయాల జోక్యం అస్సలు ఉండేది కాదన్నారు. ఏయూ భూములు కబ్జాకు గురయ్యాయని అన్నారు. దయచేసి మంత్రి వేస్తున్న విచారణలో ఆయా భూములపై నిగ్గు తేల్చాలన్నారు. వర్సిటీలో 60 శాతం ఖాళీలు ఉన్నాయన్నారు. వాటిని కూడా నియమించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులు మార్కులు లిస్టు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు తీసుకునే సదుపాయం కల్పించాలన్నారు. అంతేకాదు క్యాంపస్‌లో విజిలెన్స్ టీమ్ ఏర్పాటు చేయాలన్నారు. బయట వ్యక్తులు వర్సిటీలోకి రాకుండా ఉండేలా చూడాలన్నారు.
జనసేన కొణతాల మాట్లాడుతూ.. ఏయూకి ఒకప్పుడు ఘనమైన చరిత్ర ఉండేదన్నారు. ఇప్పుడు ఆ మాట చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. అక్కడ మంచి వాతావరణం కల్పించాలన్నారు. ఒకప్పుడు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీని ఐఐటీ స్టేటస్ ఇవ్వాలని ఆలోచన చేశారన్నారు. కానీ కొన్ని సమస్యల వల్ల జరగలేదన్నారు. ప్రస్తుతం పీహెచ్‌డీలు అమ్మే కార్యక్రమం ఏయూలో జరుగుతోందన్నారు.అందులో కొందరు రాజకీయ నేతలు ఉన్నారని గుర్తు చేశారు.