Chevireddy Bhaskar Reddy: వైసీపీ కీలక నేతలకు కష్టాలు మొదలవుతున్నాయా? కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది కాకముందే కేసులపై కేసులు నమోదు అవుతున్నాయా? పలువురు నేతలపై దర్యాప్తు జరుగుతున్నాయి. మరికొందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఆయా నేతలకు కష్టాలు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంతైంది. ఆయనకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు.
చిక్కుల్లో వైసీపీ నేతలు
వైఎస్సార్‌సీపీకి చెందిన మరో నేతకు పోలీసు నోటీసులు అందాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం పోలీసులు బుధవారం నోటీసులు అందించారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు నమోదైన 5 కేసుల్లో ఈ నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరారు. నేరుగా చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు.
చెవిరెడ్డిపై ఐదు కేసులు
ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఎన్నికల నియమావళిని అతిక్రమించినందుకు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో 3 కేసులు, పెద్దారివీడు, దోర్నాలలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఎర్రగొండపాలెంలో నమోదైన 3 కేసుల్లో ఆర్వో శ్రీలేఖను బెదిరించినట్టుగా కేసు నమోదయింది. తనకు అనుకూలంగా పనిచేయాలంటూ బెదిరించినట్టు ప్రధాన ఆరోపణ. ఎన్నికల ప్రచారం సందర్భంగా నమోదైన ఈ కేసులు ఎన్నికల సమయంలో నమోదయ్యాయి.
పార్టీ పిలుపు మేరకు ఒంగోలులో యువత పోరు నిరసన కార్యక్రమంలో చెవిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనకు పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని అందులో ప్రస్తావించారు. ఈ నోటీసులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కూటమి సర్కార్ కేసులు పెట్టి తమను అణచివేయాలని చూస్తోందని మండిపడ్డారు.
ALSO READ: తప్పు చేస్తే నరికేయండి.. జడ్జి ముందు పోసాని కంటతడి
గతంలో కూడా
2014-19 మధ్యకాలంలో తనపై 88 కేసులు టీడీపీ ప్రభుత్వం పెట్టిందని గుర్తు చేశారు.తాజాగా మరో ఐదు కేసులు నమోదు చేశారన్నారు. ఉద్యమాలు, పోరాటాలతో వైసీపీ పార్టీ పుట్టిందని, ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పోరాటం చేస్తామని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.
కూటమి సర్కార్ వచ్చిన తర్వాత చెవిరెడ్డిపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ప్రస్తుతం నోటీసులు ఇచ్చి ఎన్నికల సమయంలో నమోదైన కేసులపైనే. ఇప్పటికే వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిపై పలు కేసులు నమోదు అయ్యాయి. వారిని అరెస్ట్ చేయడంతో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని అరెస్టయ్యారు. తాజాగా మరో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంతైంది. మరి చెవిరెడ్డి విచారణకు హాజరవుతారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ హాజరు కాకుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయడమేకాదు, తనకంటూ ఇమేజ్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు ఆయన మద్దతుదారులు.