Nara Lokesh: పార్టీ సభ్యత్వం నమోదులో టీడీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే 95 లక్షల మార్క్‌ని టచ్ చేసిన తెలుగుదేశం పార్టీ, కోటి టార్గెట్‌గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. సంక్రాంతి నాటికి ఆ టార్గెట్ రీచ్ కావాలన్నది ఆ పార్టీ ఆలోచన. వెంటనే తదుపరి కార్యచరణ మొదలుపెట్టేసింది.
గతరాత్రి విదేశాల నుంచి విజయవాడకు చేరుకున్న పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేస్.. గురువారం ఉదయం యునైటెడ్ ఇండియా-ప్రాగ్మ్యాటిక్ ఇన్యూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు కోటిమంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో రూ. 42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది.
వచ్చే ఏడాది దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీ చెల్లించనుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ. 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. 100 రూపాయలు చెల్లించి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల ప్రమాద బీమాతోపాటు పిల్లల చదువుకు ఆర్థిక సాయం, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు వంటి ప్రయోజనాలు కల్పించనున్నారు.
గతేడాది అక్టోబరు 26న పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. అయితే డిసెంబర్ 31తో గడువు ముగిసినప్పటికీ నేతల రిక్వెస్ట్‌తో దాన్ని సంక్రాంతి పండుగ వరకు పొడిగించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 65 లక్షలు మంది సభ్యత్వ తీసుకున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య అమాంతంగా పెరిగింది. ప్రాంతీయ పార్టీ ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు చేరడం ఇదొక రికార్డుగా చెబుతున్నారు పార్టీ నేతలు.
ALSO READ: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు.. తెరమీదికి మళ్లీ ఆ అంశం!