ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం సీఐ శంకరయ్య అనే పేరు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించడంతో ఆయన టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు. తనపై చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని, వాటివల్ల తన పరువుకు భంగం కలిగిందని, అసెంబ్లీలో తనకు క్షమాపణలు చెప్పాలని ఆ నోటీస్ లో శంకరయ్య పేర్కొన్నారు. తన పరువుకి భంగం కలిగించినందుకు రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించడం విశేషం.
చంద్రబాబు ఆగ్రహం..
శంకరయ్య లీగల్ నోటీసులపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో సంఘటన స్థలంలోనే ఉన్న శంకరయ్య పోలీసు అధికారిగా విధులు సక్రమంగా నిర్వర్తించకుండా.. ఇప్పుడు తనకు నోటీసు ఇవ్వడానికి ఎంత ధైర్యం అని అన్నారు. శంకరయ్య నాడు అధికారిగా తన విధులు సక్రమంగా నిర్వర్తించలేదని, బాక్సు తెప్పించి వివేకా మృతదేహాన్ని అందులోకి మార్పించారని, రక్తపు మరకలతో ఉన్న ప్రాంతాన్ని కాపాడలేకపోయారని తెలిపారు. అలాంటి శంకరయ్య క్రిమినల్స్‌తో కలిసిపోయి ముఖ్యమంత్రికే నోటీసులు పంపిస్తారా? ఎంత ధైర్యం? అని అసెంబ్లీలో ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.
ఎవరీ శంకరయ్య?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత కేసు దర్యాప్తు కోసం సంఘటనా స్థలానికి వెళ్లిన అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య. అప్పట్లో వివేకాది సహజ మరణం అని చిత్రీకరించేలా ఆయన కొంతమందికి సహకరించారనే అనుమానాలున్నాయి. అప్పట్లో సీబీఐ అధికారులకు శంకరయ్య స్టేట్ మెంట్ ఇచ్చారు. వివేకా మరణంపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదని అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని అన్నారు. అయితే ఆ తర్వాత కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు రాకుండా ఆయన తప్పించుకోవడం సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటీవల ఆయన వీఆర్ లో ఉన్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శంకరయ్య ఒక్కసారిగా సీఎంకి నోటీసులు పంపి మరో సంచలనం సృష్టించారు.
ఏం జరిగింది?
శంకరయ్య వ్యవహారంలో రాజకీయ ఒత్తిడిలు ఉన్నాయని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. జగన్ ఆడిస్తున్న నాటకంలో శంకరయ్య పాత్రధారిగా మారారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో శంకరయ్యకు వైసీపీ తరపున టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి ఉంటారని, అలా ప్రలోభ పెట్టి ఆయనతో లీగల్ నోటీసులు పంపించారని అన్నారు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా శంకరయ్య తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
ముఖ్యమంత్రికి నేరుగా లీగల్ నోటీసులు పంపించడం చట్ట సమ్మతమేనా? అలా పంపిస్తే తర్వాత జరిగే పరిణామలేంటి అనే విషయంపై అసెంబ్లీ వర్గాలు చర్చిస్తున్నట్టు సమాచారం. అది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అంటున్నారు. మరోవైపు పోలీస్ డిపార్ట్ మెంట్ లో కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీఆర్ లో ఉన్న శంకరయ్య ఉద్యోగ భవిష్యత్ ఏంటనేది తేలాల్సి ఉంది.