Plane Spotted Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం పై ఆగమన శాస్త్ర సాంప్రదాయం ప్రకారం విమానాల రాకపోకలు నిషిద్ధం. అయితే అప్పుడప్పుడు శ్రీవారి ఆలయం పై విమానాలు చక్కర్లు కొడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖను టీటీడీ పలుమార్లు విన్నవించింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని టీటీడీ అభిప్రాయపడుతోంది. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అప్పుడప్పుడు శ్రీవారి ఆలయం పై విమానాలు చక్కర్లు కొట్టడంతో వివాదానికి దారితీస్తోంది.
తాజాగా గురువారం శ్రీవారి ఆలయం పై విమానం చక్కర్లు కొట్టినట్లు భక్తులు గుర్తించారు. ఉదయం 10 గంటల సమయంలో ఆలయం పై ఓ విమానం వెళ్ళినట్లుగా భక్తులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి పలువురు భక్తులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఇంతకు శ్రీవారి ఆలయం పై విమానం చక్కర్లు కొట్టిందా లేదా అన్న విషయంపై టీటీడీ ఆరా తీస్తోంది.
Also Read: Horoscope scorpio 2025 : వృశ్చిక రాశి జాతకులకు 2025లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం
ఎన్నో ఏళ్లుగా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్ భక్తుల నోట వినిపిస్తోంది. పురాణాల ప్రకారం తిరుమల చిత్రం శ్రీ వెంకటేశ్వరుని దివ్య నివాసం. అందుకే నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని గతంలో కూడా చర్చ సాగిన సమయంలో, అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సెంట్రల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం తిరుమలను నో ఫ్లై జోన్ గా గుర్తించలేమని స్పష్టం చేశారు. అయితే భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిరుమల స్వామి ఆలయం మీదుగా విమానాలు నేరుగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం మరో మారు తిరుమల శ్రీవారి ఆలయం పై విమానం చక్కర్లు కొట్టడంతో, ఈ విషయం తెర మీదికి వచ్చింది.