AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. సూపర్ సిక్స్ పై లఘు చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అని సంబోధించారు. వైసీపీ ఎమ్మెల్సీ తీరుపై కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైసీపీ సభ్యుడు సీఎంను కుప్పం ఎమ్మెల్యే అని మాట్లాడారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్ ను కోరారు. సీఎంను అగౌరవపరిచినందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం సభా నాయకుడు, ఆ విషయాన్ని వైసీపీ సభ్యుడు ఎలా మర్చిపోతారని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సూపర్ సిక్స్‌పై లఘు చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ.. హామీలు అమలు చేయకుండానే సూపర్ హిట్ అంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఆరోపించారు.
వైసీపీ సభ్యుడి తీరుపై మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సూపర్ సిక్స్ హామీల అమలును జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు కడుపు మంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ క్షమాపణ చెప్పాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
పెద్దల సభలో పరిణామాలు సభా సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయని మండలి ఛైర్మన్ మోషేనురాజు అన్నారు. సభలో జరిగిన పరిణామాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు.
రమేశ్ యాదవ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని మండలి ఛైర్మన్ మోషేనురాజు తెలిపారు. పెద్దల సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని కోరారు. సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని, గతంలో సీఎంగా పనిచేసిన స్థాయి వ్యక్తుల గౌరవానికి తగ్గట్లు మాట్లాడాలని.
మండలి అంటే పెద్దల సభ, సభ్యులు సభా గౌరవాన్ని కాపావాలని మండలి ఛైర్మన్ సూచించారు. గందరగోళం నేపథ్యంలో సూపర్ సిక్స్‌పై లఘు చర్చను రేపటికి వాయిదా పడింది. అలాగే శుక్రవారం వ్యవసాయంతో పాటు సూపర్ సిక్స్ అంశాలను సభలో చర్చించనున్నారు.
మండలి విరామ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీల చిట్‌చాట్ లో మాట్లాడారు. మాజీ సీఎం జగన్‌ను ప్రతిసారి పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధిస్తున్నారన్నారు. అయితే ఇక నుంచి తమ పంథా కూడా మారుతుందన్నారు.
ఇక నుంచి శాసనమండలిలో సీఎం, మంత్రులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా సంబోధిస్తామని చెప్పారు. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే లోకేశ్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అని సంబోధిస్తామని వైసీపీ ఎమ్మెల్సీలు చిట్ చాట్ లో అన్నారు.
Also Read: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్
“ఆనాటి కుప్పం ఎమ్మెల్యే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అని వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడితే అందులో తప్పేముంది? మా నాయకుడు వైయస్ జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనాలి అని తెలియదా? మీరు ఎంత కాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో మేము అంత కాలం నాటి కుప్పం ఎమ్మెల్యే అని అంటాం” అని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు.