South Central Railway: సంక్రాంతి పండుగ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రజలంతా ఊరి బాట పడతారు. సంక్రాంతి జరిగి మూడు రోజుల పాటు హైదరాబాద్ ఖాళీ అవుతుంది. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లనున్న నేపథ్యంలో ఆర్టీసీతో పాటు రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ ఆర్టీసీ ఏపీకి సుమారు 5 వేల బస్సులు నడపనున్నట్లు ప్రకటించగా, ఏపీఎస్ ఆర్టీసీ 2400 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. అటు రైల్వే సంస్థ కూడా సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆరు రైళ్లను షెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది. ఈ స్పెషల్ రైళ్లలో జనరల్, స్లీపర్, ఫస్ట్ క్లాస్, 2AC, 3AC కోచ్ లను కలిగి ఉంటాయి.
సంక్రాంతి సందర్భంగా నడిపే ప్రత్యేక రైళ్ల వివరాలు
⦿కాచిగూడ నుంచి కాకినాడ టౌన్ వరకు..
సంక్రాంతికి నడిపే ప్రత్యేక రైలు(07653) జనవరి 9న కాచిగూడ నుంచి రాత్రి 8:30 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. ఇదే రైలు(07654) తిరుగు ప్రయాణంలో కాకినాడ నుంచి జనవరి 10వ సాయంత్రం 5:10 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 4:30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, చెర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతాయి.
⦿హైదరాబాద్ నుండి కాకినాడ టౌన్ వరకు
అటు జనవరి 10న మరో రైలు (07023) హైదరాబాద్ నుంచి బయల్దేరి కాకినాడ పట్టణానికి వెళ్తుంది. సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. ఇదే రైలు(07024) తిరుగు ప్రయాణంలో జనవరి 11న కాకినాడ టౌన్ నుంచి రాత్రి 8:00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ తీసుకుంటాయి. వీటితో పాటు మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణతో పోల్చితే ఏపీలో ఈ పండుగను మరింత అద్భుతంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు ఏ ఊరిని చూసిన సంతోషాలు వెల్లువిరుస్తాయి. కోడిపందాలు, పిండి వంటలు, హరిదాసుల గీతాలతో ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ ఉద్యోగాలు చేసినప్పటికీ… సంక్రాంతికి ఇంటికి చేరి అందరూ కలిసి సంబురంగా సంక్రాంతి జరుపుకుంటారు. తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన పండుగ కావడంతో రైల్వేతో పాటు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: మహా కుంభమేళా ఎఫెక్ట్, ఏపీలో రెండు నెలల పాటు ఆ రైళ్లు బంద్!