ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్న జగన్, సమావేశాలకు రాకుండా కేవలం ప్రెస్ మీట్లు పెడుతూ కాలం గడుపుతున్నారు. పోనీ వైసీపీ ఎమ్మెల్యేలయినా వస్తారా అంటే అదీ లేదు. నియోజకవర్గాలనుంచి జగన్ తో మీటింగ్ కోసం తాడేపల్లి వరకు వస్తున్న ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి మాత్రం రావడం లేదు. అయినా అసెంబ్లీలో వైసీపీ ప్రస్తావన, జగన్ పాలన గురించిన చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా రాజధాని అమరావతిపై జరిగిన చర్చలో జగన్ ప్రస్తావన వచ్చింది. జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదని, మూడుముక్కలాట పేరుతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రస్తావించారు. అమరావతి నిర్మాణ పురోగతిని వివరిస్తూ మంత్రి నారాయణ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాజధాని పనుల్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కూటమి అధికారంలోకి వచ్చేనాటికి అమరావతి అడవిలా మారిపోయిందన్నారు. కేవలం అమరావతిలో చెట్లు తొలగించేందుకు రూ. 30 కోట్లు ఖర్చు పెట్లాల్సి వచ్చిందని వివరించారు. అదే సమయంలో కాంట్రాక్టర్లను కూడా జగన్ ఇబ్బందులు పెట్టారని చెప్పారు. వారికి విడుదల చేయాల్సిన నిధుల్ని హోల్డ్ లో పెట్టారని విమర్శించారు మంత్రి నారాయణ.
అమరావతిపై వైసీపీ వైఖరి ఏంటి?
ఏపీ రాజధానిపై వైసీపీ వైఖరి ఏంటో జగన్ స్పష్టం చేయాలని కోరారు ఎమ్మెల్యే కామినేని. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి, అమరావతిపై చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆయన సభలో ప్రస్తావించారు. గతంలో సకల శాఖ మంత్రిగా పేరుమోసిన సజ్జల, ఇటీవల అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారన్నారు. అమరావతినే రాజధానిగా చేసుకుని జగన్ పాలన చేపడతారని ఆయన వివరించారని, దానిపై జగన్ క్లారిటీ ఇవ్వాలన్నారు. అసలు అమరావతి గురించి జగన్ ఏమనుకుంటున్నారు, ఆయన రాజధానిగా అమరావతిని గుర్తిస్తారా లేదా అనేది, సభకి రాకపోయినా, కనీసం బయట ప్రెస్ మీట్ పెట్టి అయినా చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ సేఫ్ గేమ్..
జగన్ అసెంబ్లీకి వస్తే కూటమి నేతలు ఇబ్బందుల్లో పడతారంటూ ఇటీవల వైసీపీ నేతలు గంభీరంగా మాట్లాడారు. సభకు వచ్చినా జగన్ కి మాట్లాడే అవకాశం ఇవ్వరని అన్నారు. అయితే జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాల విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. బయట ప్రెస్ మీట్ లో అయితే తనకు నచ్చినట్టు మాట్లాడవచ్చు, మీడియా ప్రశ్నల్ని కూడా తానే డిసైడ్ చేయొచ్చు, గుచ్చి గుచ్చి ప్రశ్నించే రిపోర్టర్లను దగ్గరకి రానీయకుండా చూడొచ్చు. అదే అసెంబ్లీకి వెళ్తే, అమరావతిపై నీ వైఖరేంటి అని సభ్యులు ప్రశ్నిస్తే, అప్పుడు జగన్ నీళ్లు నమిలితే ఆ వ్యవహారం రాష్ట్ర ప్రజలంతా చూస్తారు. అందుకే జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని కూటమి నేతలు అంటున్నారు. కూటమి అడిగే ప్రశ్నలనుంచి తనను తాను రక్షించుకోడానికే జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని విమర్శించారు.
మరిన్ని ప్రశ్నలు..
అమరావతి ఒక్కటే కాదు, జగన్ అసెంబ్లీకి వస్తే మరిన్ని ప్రశ్నలు చుట్టుముడతాయి. సూపర్ సిక్స్ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జగన్, మద్యపాన నిషేధం హామీని ఎందుకు అమలు చేయలేకపోయారని కూటమి నేతలు ప్రశ్నించవచ్చు. సీపీఎస్ రద్దుపై ఆయన వైఖరిని మరోసారి స్పష్టం చేయాలని అడగొచ్చు. ఇక వైఎస్ వివేకా హత్య కేసు లాంటి ఘటనలపై కూడా అసెంబ్లీ దద్దరిల్లే అవకాశం ఉంటుంది. అందుకే జగన్ సైలెంట్ గా సభకు నమస్కారం పెట్టేశారు.