Uppada: ఉప్పాడలో మత్స్యకారులు వెనక్కి తగ్గారు. వచ్చే నెల 10లోగా పవన్ వస్తారని కలెక్టర్ హామీ ఇచ్చారు. దాంతో ఆందోళన విరమించారు. అయితే అప్పటిలోపు పరిష్కారమార్గాలపై.. డిప్యూటీ సీఎం పవన్ అధికారులతో చర్చించనున్నారు. ఇక ఒకవేళ పవన్ రాకపోతే మాత్రం ఆందోళనలు మరింత ఉధృతమవుతాయని మత్స్యకారులు హెచ్చరించారు
డిప్యూటీ సీఎం వచ్చేదాకా వేటకు వెళ్లబోమన్న మత్స్యకారులు..
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ మత్స్యకారులు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అధికారులతో చర్చలకు ససేమిరా అన్న మత్స్యకారులు.. ఏకంగా కుటుంబాలతో సహా రోడ్డు మీద ఆందోళనకు దిగారు. ప్రతి మత్స్యకార కుటుంబానికి 11 వేల 500 పరిహారం ప్రకటించాలన్నారు. అదేవిధంగా.. ఫార్మా ఫ్యాక్టరీల కాలుష్యం వల్ల.. మత్స్య సంపద లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు.. ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సముద్రంలోకి కాలుష్య జలాలు వదులుతున్న దివీస్, అరబిందో ఫార్మా కంపెనీలను వెంటనే మూసివేయాలంటున్నారు. ఆ కంపెనీల రసాయనాల కారణంగా సముద్రంలో మత్య్స సంపద నాశనమవుతోందని.. తమకు ఉపాధి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేట సమయంలో మరణించిన వారికి 50 లక్షల ఇన్సూరెన్స్ వచ్చేలా చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లపై.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చి హామీ ఇస్తే తప్ప.. ఆందోళన విరమించేది లేదని మత్స్యకారులు తెగేసి చెబుతున్నారు.
ఉప్పాడ మత్స్యకారుల ఆందోళనపై పవన్ కల్యాణ్ స్పందన..
ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను అర్థం చేసుకోగలనన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంవో ఓ ప్రకటన చేసింది. శాసనసభ సమావేశాల కారణంగా తాను ప్రత్యక్షంగా రాలేకపోతున్నానన్నారు పవన్. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం.. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ అధికారులు, కాకినాడ కలెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం కల్పించనున్నారు. సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధి, తీరప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై.. కమిటీ దృష్టి సారించనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుంది.
సమస్యల పరిష్కారం, మత్స్యకారుల జీవనోపాధిపై దృష్టి..
ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించినట్లు.. పవన్ తెలిపారు. మృతి చెందిన 18 మంది మత్స్యకారులకి సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవలకు నష్ట పరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో చర్చించానని, ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు.. పవన్ తన ప్రకటనలో తెలిపారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తానని.. వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటనలో తెలిపారు.
Also Read: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే.. స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానన్నారు పవన్ కల్యాణ్. ఇప్పటికే ప్రభుత్వం తరఫు నుంచి సమస్యల పరిష్కారం కోసం అడుగులు ముందుకు పడ్డాయి. మరి.. మత్స్యకారులు ఆందోళన విరమిస్తారా? కొనసాగిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.