West Godavari Crime: వారిద్దరికి పెద్దలు దగ్గరుంచి పెళ్లి చేశారు. వివాహం జరిగి పుష్కరకాలం అయ్యింది. అనుకోకుండా సమస్యలు పెరిగాయి. ఏళ్లు గడిచినా భర్త నుంచి టార్చర్ పోలేదని భావించింది ఆ ఇల్లాలు. చివరకు విసిగిపోయిన ఆమె, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో వెలుగుచూసింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణమైన ఘటన జరిగింది. భీమవరం మండలం వెంప ప్రాంతానికి చెందిన ఝాన్సీ- యలమంచిలి మండల మేడపాడు గ్రామానికి చెందిన దుర్గా పెద్దిరాజులకు పెళ్లి జరిగింది. మొదట్లో దంపతులు అన్ని విషయాలు చర్చించుకునేవారు. తమకు అలాంటి కూతురు-అల్లుడు ఉంటే బాగుండేదని ఇరుగుపొరుగువారు అనుకునేవారు.
వివాహం జరిగి పుష్కర కాలం దాటిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సరదాగా సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. కుటుంబ తగాదాల కారణంగా ఝాన్సీ-పెద్దిరాజు దంపతులు పాలకొల్లు మండలం పూలపల్లిలో ప్రత్యేకంగా కాపురం పెట్టారు. ఫ్యామిలీ సమస్యల నేపథ్యంలో మనశ్శాంతి కోసం కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు.
మద్యం పుచ్చుకుని తరచూ భార్యను వేధించేవాడు. మొదట్లో లైటుగా తీసుకుంది ఝాన్సీ. రోజురోజుకూ భర్త ఆగడాలు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయింది. బుధవారం రాత్రి పెద్దిరాజు మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. పెళ్లైన 13 ఏళ్ల తర్వాత ఇలాంటి సమస్య ఏంటని విసిగిపోయింది. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో గొడవలను తట్టుకోలేకపోయింది.
ALSO READ: ఏపీ-తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు
జీవితంపై విరక్తి కలిగిన ఝాన్సీ, ఆమె తన సోదరుడి ఫోన్‌లో మేసెజ్ పెట్టింది. భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నారని, పిల్లలు జాగ్రత్త అంటూ అందులో ఉంది. గురువారం ఉదయం సోదరుడు వచ్చేసరికి ఝాన్సీ మృతదేహం ఇంటి బయట ఉంది. సోదరిని ఆ విధంగా చూసి షాకయ్యాడు. గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నట్లు పిల్లలు చెప్పారు.
ఝాన్సీ తండ్రి ప్రభుదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త పెద్దిరాజు, అత్త-మామలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఝాన్సీ భర్తను పెద్దిరాజును పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి. పిల్లలను ఝాన్సీ తల్లిదండ్రులు తీసుకుని వెళ్లిపోయారు.