Tirumala Geo Tagging: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రక్షణ, సౌకర్యం కోసం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో పోలీసులు జియో ట్యాగ్ ను గురువారం ఉదయం నుంచి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇవాళ 2350 మందికి డిజిటల్ జియో ట్యాగ్ లను అమర్చారు.
డిజిటల్ జియో ట్యాగ్ సాయంతో భక్తులు ఎక్కడున్నారో సులభంగా గుర్తించడం సాధ్యం అవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్లు తప్పిపోయిన సందర్భాల్లో త్వరితగతిన వారిని కనుగొనవచ్చు.
గురువారం ఉదయం నలుగురు సీనియర్ సిటిజన్లు తప్పిపోయిన ఘటనలో, సంబంధిత జియో టాగ్ ద్వారా పోలీసులు వారిని తక్షణమే గుర్తించారు. వారి బంధువులకు సురక్షితంగా అప్పగించారు. తప్పిపోయిన భక్తులు తిరిగి తమ బంధువులను కలుసుకోవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులు చూపిన స్పందనకు, జిల్లా ఎస్పీ ముందుచూపునకు కృతజ్ఞతలు తెలిపారు.
“భక్తుల భద్రత మా మొదటి ప్రాధాన్యత. ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రతి భక్తుడికి సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శన అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సమయంలో పెద్దవారు, చిన్న పిల్లలు తప్పిపోకుండా జాగ్రత్త వహించాలి.
తప్పిపోయిన సంఘటనలు ఎదురైన వెంటనే పోలీస్ హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ సిబ్బందిని సంప్రదించాలి.
పోలీస్ శాఖ అందిస్తున్న సాంకేతిక సదుపాయాలను భక్తులు వినియోగించుకోవాలి.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడు నూతన వసతి సముదాయాన్ని (వేంకటాద్రి నిలయాన్ని) గురువారం ప్రారంభించారు. పీఏసీ 5ను రూ.102 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది.
ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చిన భక్తులకు వసతి కల్పించేందుకు గానూ నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనం ద్వారా ఒకేసారి 4 వేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా నిర్మించారు.
Also Read: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ
ఈ నూతన వసతి సముదాయంలో 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలూ వేడినీటి సదుపాయం తదితర సౌకర్యాలతో పిలిగ్రిమ్స్ అమెనిటీస్ సెంటర్ 5ను తీర్చిదిద్దారు. ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణ కట్టను కూడా పీఏసీ 5 ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసింది. ఒకేసారి 1400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా ఈ కాంప్లెక్సులో రెండు భారీ డైనింగ్ హాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.