ఇంతకీ పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది?
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల్లో చాలామంది ఈ ప్రశ్నకు జవాబుకోసం ఎదురు చూస్తుంటారు. వైసీపీ హయాంలో జలవనరుల శాఖకు మంత్రులుగా పనిచేసిన నేతలు అప్పుడు ఇప్పుడు అంటూ కోతలు కోశారు, డెడ్ లైన్లు పెట్టారు, అసెంబ్లీలో సవాళ్లు విసిరారు. కానీ ఫలితం లేదు. మాజీ మంత్రి అనిల్ కి ఆ విషయంలో బుల్లెట్ బాగానే దిగిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ పోలవరం డెడ్ లైన్ విషయంలో అనిల్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. ఇక అంబటి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. పోలవరం అనేది అసలు అర్థంకాని సబ్జెక్ట్ అని చెప్పి నవ్వులపాలయ్యారు అంబటి. ఆ తర్వాత కవర్ చేసుకోవాలనుకున్నా కుదర్లేదు. పోలవరం ఇప్పుడే కాదు, ఎప్పటికీ పూర్తి కాదంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి విమర్శలపాలయ్యారు అంబటి.
కూటమి సంగతేంటి..?
వాస్తవానికి కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే పోలవరం పూర్తి చేసి ఉండాల్సింది. కానీ కుదర్లేదు. 2019 నుంచి 2024 వరకు జగన్ పాలన కాబట్టి దాని పురోగతికి టీడీపీకి సంబంధం లేదు. ఇప్పుడు తిరిగి కూటమి అధికారంలోకి రావడంతో పోలవరం సంగతేంటనే ప్రశ్న వినబడుతోంది. దీనికి తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. పోలవరం డయాఫ్రం వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు కాగా, అందులో 500 మీటర్ల నిర్మాణం పూర్తయిందని, 2025 డిసెంబర్ నాటికి మొత్తం డయాఫ్రం వాల్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారాయన. వరదల సమయంలో సైతం డివాటరింగ్ చేస్తూ పనులు కొనసాగిస్తామన్నారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు మంత్రి నిమ్మల.
పోలవరం డయాఫ్రం వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గానూ, 500 మీటర్ల నిర్మాణం పూర్తయింది. 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా, వరదల సమయంలో సైతం డివాటరింగ్ చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.#PolavaramProject… pic.twitter.com/w6oSyxMG5s
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) August 14, 2025
లోకేష్ ట్వీట్..
నిమ్మల ట్వీట్ పై మరో మంత్రి నారా లోకేష్ స్పందించారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ సిబిఎన్ అని. ఆయన హయాంలో పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయని చెప్పారు. గతంలో వైసీపీ నేతలెవరూ పోలవరం విషయంలో ఇలాంటి ప్రకటనలు చేయలేదు. ఏడాది, రెండేళ్లు అంటూ టార్గెట్లు పెట్టుకుని పరువు తీసుకున్నారే కానీ, ఎంత శాతం పనులు పూర్తయ్యాయి, ఏస్థాయిలో జరిగాయనే లెక్కలు చెప్పలేకపోయారు. కూటమి హయాంలో మళ్లీ లెక్కలతో సహా సిద్ధమయ్యారు నేతలు. పనులు పరుగులు పెడుతోందంటూ లోకేష్ ట్వీట్ వేయడంతో మరోసారి పోలవరం పూర్తవుతుందనే ఆశలు చిగురించాయనే చెప్పాలి.
అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ సిబిఎన్. పరుగులు పెడుతున్న పోలవరం పనులు. @ncbn #Polavaram #IdhiManchiPrabhutvam https://t.co/fEyyzLZqlE
— Lokesh Nara (@naralokesh) August 14, 2025
అభివృద్ధి, సంక్షేమం జోడుగుర్రాల్లాగా పరుగులు తీస్తున్నాయంటూ కూటమి నేతలు చెబుతున్నా.. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి అనేవి కూటమికి కీలకమైన టార్గెట్లు. ఆ రెండిటిలో ఏది పూర్తయినా ఈ ఐదేళ్లలో అది కూటమి ప్రభుత్వ ఘన విజయం అవుతుంది. ఎన్నికల్లో దైర్యంగా తమ విజయాలను చెప్పుకుని ఓట్లు అడిగే అవకాశం దక్కుతుంది. కారణాలు చెప్పుకుంటూ పోలవరం, అమరావతి నిర్మాణాలు ఆలస్యం చేస్తే మాత్రం ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకే సీఎం చంద్రబాబు ఆ రెండు విషయాలపై ఫోకస్ పెట్టారు. ఈ దఫా అమరావతి నిర్మాణం కచ్చితంగా పూర్తి చేస్తామంటున్నారు, అదే సమయంలో పోలవరం పూర్తి చేసి దాని ఫలాలు రైతులకు అందేలా చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నారు.