Tollywood:గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో సమస్యలు ఏ రేంజ్ లో సినిమాలకు అంతరాయం కలిగిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు సినీ కార్మికులు జీతాలు పెంచాలని పెద్ద ఎత్తున ధర్నాలు చేసి షూటింగ్లకు అంతరాయం కలిగించారు. అంతేకాదు గత రెండు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తమకు సరైన గౌరవ గుర్తింపులు కల్పించడం లేదని, తక్షణమే 30% జీతం పెంచాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై నిర్మాణ సంస్థలు ఒకేసారి అంత జీతం పెంపు అంటే తమ వల్ల కాదు అని చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాలంలో విడతల వారీగా జీతాల పెంపుకు అనుమతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ సమస్య సద్దుమణిగి సినిమా షూటింగ్ లు యధావిధిగా స్టార్ట్ అయిపోయాయి.
ఈ సమస్య సద్దుమణిగింది అనుకునేలోపే అటు TFCC అధ్యక్ష పదవి నుండి పదవీ కాలం ముగిసినా.. TFCC అధ్యక్షుడు భరత్ భూషణ్ అదే పదవిలో కొనసాగడం పై నిర్మాతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో సమస్యలు అందరికీ తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే.అయితే ఇలాంటి సమయంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్ర పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నట్లు తెలుస్తోంది.
సమస్యల పరిష్కారం కమిటీ నియామకం..
విషయంలోకి వెళ్తే.. సినీ కార్మికులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి కార్మిక శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీలో తెలుగు సినిమా పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్లు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రెండు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి అని కూడా ఆయన ఆదేశించడం జరిగింది.
ALSO READ:Bigg Boss 9: 3వారాలకు గానూ కామనర్ ప్రియాశెట్టి ఎంత రెమ్యూనరేషన్ పొందిందంటే?
కమిటీ సభ్యులు వీరే..
కమిటీ చైర్మన్గా కార్మిక శాఖ కమిషనర్, సభ్య కన్వీనర్ గా అదనపు కమిషనర్ ఉంటారు. అలాగే సభ్యులుగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆ సంస్థ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాత యార్లగడ్డ సుప్రియ,ఉద్యోగుల సమాఖ్య తరఫున వల్లభనేని అనిల్ కుమార్ అమ్మిరాజు కామమిల్లి ఉంటారు అని స్పష్టం చేశారు.
రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలి అని ఆదేశాలు..
ఇక వీరంతా కూడా ఇండస్ట్రీలో జరుగుతున్న సమస్యలు అన్నింటిని పరిశీలించి రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ కమిటీ అందించబోయే నివేదిక టాలీవుడ్ పరిశ్రమకు పెద్ద ఎత్తున ఊరట కలిగించబోతుందని చెప్పవచ్చు. ఏదేమైనా మరో రెండు నెలల్లో తెలుగు సినీ పరిశ్రమ సమస్యలన్నీ సాల్వ్ కాబోతున్నాయని తెలిసి ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.