Deep Depression in Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వాయుగుండంగా బలహీన పడినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఒడిశా అంతర్భాగంపై కొనసాగుతున్న వాయుగుండం.. గడిచిన 6 గంటలలో 15 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనించి.. ఝార్సుగూడకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో, సంబల్ పూర్ కి తూర్పున 60 కిలోమీటర్ల దూరంలో, బిలాస్ పూర్ కి తూర్పు-ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో, రాయ్ పూర్ కి తూర్పున 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది.
ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సాయంత్రానికి ఛత్తీస్ గఢ్ – తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు అంచనా వేశారు.
వాయుగుండం కారణంగా కోస్తాంధ్రకు వర్ష సూచన కనిపిస్తోంది. ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అంతే కాదు ఉత్తర కోస్తాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పార్వతిపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళవద్దని వార్నింగ్ ఇచ్చింది.
Also Read: ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసం ఘటనలో ఇద్దరు అరెస్ట్.. కుట్రా? నిర్లక్ష్యమా?
అటు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ సాయంత్రం మరోసారి ఉత్తరాంధ్ర వర్షాలపై సమీక్షించి అవసరమైతే విశాఖకు వెళ్లాని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ముఖ్యంగా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితులు ఏవీ లేవని ఆయనకు అధికారులు వివరించారు.
ఇదిలా ఉండగా.. ఎన్నడూ చూడని భారీ వరదల నుంచి బెజవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బుడమేరు గండ్లు పూడ్చడం పూర్తవ్వగా.. వర్షం కూడా ఆగిపోవడంతో.. వరద ప్రభావిత ప్రాంతాలు జలదిగ్భందం నుంచి బయటపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా బురదమయంగానే ఉన్నాయి. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన ఇళ్లు, రోడ్లను శుభ్రం చేస్తున్నారు. వరదల కారణంగా రోడ్డున పడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, డ్రై ఫుడ్స్ పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా అందరికీ జత బట్టలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ నష్ట గణన సర్వేతో పాటు హెల్త్ సర్వే కొనసాగుతోంది.