Nagula Chavithi: తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి పండుగ ఘనంగా జరుపుకున్నారు భక్తులు. ప్రతీ గ్రామంలోనూ నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. నాగ దేవతకు ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించారు భక్తులు. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి తర్వాత వచ్చే అత్యంత పవిత్రమైన పండుగ నాగుల చవితి. ఈ పండుగను గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వాడవాడలా ప్రజలు ఉదయం నుంచి నాగేంద్రుడి పూజల్లో మునిగిపోయారు. నాగుల చవితి రోజు నాగదేవతను పూజిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎక్కుడున్నా నాగుల చవితిరోజు ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో కలిసి నాగదేవతకు పూజలు చేయడం తరతరాలుగా వస్తోంది.
దీనివల్ల నాగేంద్రుడి చల్లని ఆశీస్సులు కుటుంబంపై పడి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతో వేకువజాము నుంచి భక్తులు పల్లెలు, పొలాలు, తోటలు, ఖాళీ ప్రదేశాల్లోవున్న పుట్టల వద్దకు తండోప తండాలుగా తరలివస్తుంటారు. నాగ దేవతకు భక్తులు సంప్రదాయబద్ధంగా దీపారాధన చేసి, నైవేద్యం సమర్పిస్తారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకోవడం ఈ పండగలో అత్యంత కీలకమైనది. పాలతోపాటు, గుడ్లు, చలివిడి, తెగ, బుర్రగుంజు వంటి పుట్టలో వేసి నాగరాజుకు పూజలు చేస్తారు భక్తులు.
తమ కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖ శాంతులు ప్రసాదించాలని వేడుకున్నారు. అనేకమంది మహిళలు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోరికలు నెరవేర్చమని మొక్కుకుంటారు. పుట్టల వద్ద ఓ వైపు పూజలు జరుగుతుండగా మరోవైపు బాణాసంచా కలుస్తూ సందడి చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇదొక స్మాల్ దీపావళి లాంటిదే. నాగుల చవితి సందర్భంగా దేశంలోని అన్ని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేస్తుంటారు.
ALSO READ: ఏపీలో పంచాయతీలకు బంపరాఫర్.. ఏకంగా రూ.50 లక్షలు సొంతం, ఇంకెందుకు ఆలస్యం?
హిందూ సనాతన ధర్మంలో నాగ దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం నాగ దేవతలకు దైవిక శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. క్షీరసాగర మథన సమయంలో అమృతం కోసం వాసుకి నాగరాజును కవ్వం తాడుగా ఉపయోగించారు దేవతలు-రాక్షకులు. శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా ఉంటుంది. లయ కారకుడు పరమశివుడి కంఠాభరణంగా వాసుకిని ధరించి ప్రసిద్ధి చెందాడు. కుటుంబ సంక్షేమం కోసం నాగులచవితి కఠిన ఉపవాసాలు ఆచరించి నాగ దేవతలను ప్రసన్నం చేసుకుంటారు. దానివల్ల నాగదేవతల వల్ల కలిగిన దోషాలు కొంతైనా తగ్గుతాయని నమ్ముతారు.