AP BJP: ఆంధ్ర ప్రదేశ్‌లో మున్సిపల్, ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికల్లో టిడిపి-జనసేన-బిజెపిల కూటమి అద్భుత విజయాలతో దూసుకుపోయాయి. ప్రధాన ప్రతిపక్షాన్ని ఇంచుమించు తుడిచి పెట్టేశాయి. ఇంత వరకు ఇది కూటమి నేతలు ఆనందించాల్సిన పరిణామమే. కానీ కూటమి సాధించిన విజయాల్లో భారతీయ జనతా పార్టీ వాటా ఎంత? అన్నదే ఇపుడు చర్చకు దారి తీస్తోంది. ప్రత్యేకించి ఏపీ బిజెపి నాయకత్వం దీనిపైనే ఫోకస్ పెట్టింది. ఒక పక్క కేంద్రంలో అధికారంలో ఉండి మరో పక్క ఏపీలో కూటమే ధికారంలో ఉండి. బలమైన టిడిపి-జనసేనలతో పొత్తు పెట్టుకుని కూడా అనుకున్న విజయాలు ఎందుకు సాధించలేకపోయాం? లోపం ఎక్కడ ఉంది? అన్న అంశాలపై కమలనాథులు సమీక్ష చేసుకుంటుననారు.రానున్న కాలంలో ఏపీలో పార్టీ బలం పుంజుకోవాలంటే ఏం చేయాలి? అన్న అంశంపైనా మల్లగుల్లాలు పడుతోన్నట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికలనే తీసుకుంటే అనంతపురంలో మేయర్ పోస్ట్ ను బిజెపికి కేటాయించింది కూటమి. ఈ కార్పొరేషన్ లో మెజారిటీ డివిజన్లను కూటమి గెలుచుకుంది. కానీ మేయర్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి పరాజయం పాలయ్యారు. ఇక్కడ వైసీపీ సంచలన విజయం సాధించి మేయర్ పోస్టు ఎగరేసుకుపోయింది.తిరుపతి కార్పొరేషన్ లోనూ బిజెపి నేత సామంచి శ్రీనివాస్ కార్పొరేటర్ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచి పరువు తీసుకున్నారు.మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తోన్న ధర్మవరంలో బిజెపి కౌన్సిలర్ అభ్యర్ధి ఓటమి చెందారు. అల్లూరి, విజయనగరం జిల్లాలకు చెందిన బిజెపి అధ్యక్షులు ఇద్దరూ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ బిజెపి మెరుగైన ఫలితాలు సాధించలేకపోయింది. బిజెపితో పోలిస్తే టిడిపి,జనసేనలు చెప్పుకోదగ్గ విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఈ పరాజయాలకు కారణాలపైనే నేతలు ఆరా తీస్తున్నారు. క్షేత్ర స్థాయిలో బిజెపి నేతలు సమర్ధవంతంగా పనిచేయలేదా? ఎన్నికల ప్రచారంలో కీలక నేతలు బాధ్యతగా వ్యవహరించలేదా అన్న అంశాలపై నేతలను ఆరా తీస్తున్నారు. కూటమిలో టిడిపి-జనసేనల నుంచి బిజెపి అభ్యర్ధులకు ఓట్ల బదలాయింపు సజావుగా జరిగిందా లేక కోవర్టు ఆపరేషన్లు జరిగాయా అన్న అనుమానాలనూ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనంతపురంలో టిడిపి సహకరించకపోవడం వల్లనే బిజెపి ఓడి వైసీపీ గెలిచిందని స్థానిక బిజెపి నేతలే ఆగ్రహంగా ఉన్నారు. కూటమి పక్షాల మధ్య అనుకున్న స్థాయిలో ఐక్యత క్షేత్రస్థాయిలో లేదన్న అభిప్రయాలు వ్యక్తం అయ్యాయి. భవిష్యత్తులో పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయాలన్న అంశంపై నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: పైకి నవ్వులు.. లోపల కత్తులు.. యోగి, అమిత్ షా మధ్య నిజంగానే గ్యాప్ వచ్చిందా..?