TDP: టీడీపీ మహానాడులో కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయా? యువనేతకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైందా? పార్టీలో అన్ని వర్గాల నుంచి హైకమాండ్ సమాచారం సేకరించిందా? చినబాబుకు పగ్గాలు అప్పగించాల్సిందేనని ఫీడ్‌బ్యాక్ వచ్చిందా? అవుననే అంటున్నారు పార్టీలో కొందరు సీనియర్లు.
టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించేందుకు రంగం సిద్ధమైనట్టు పార్టీ వర్గాల మాట. పార్టీ శ్రేణులు, నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అధినేత చంద్రబాబు అటువైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కడపలో జరగనున్న టీడీపీ మహానాడులో చర్చించి ఆయనకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షణం తీరిక లేకుండా అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు సీఎం చంద్రబాబు. వచ్చే నెల నుంచి తనిఖీల పేరుతో పర్యటనలు మొదలు పెడతానని ఉద్యోగులకు చెప్పారు. మునుపటి ముఖ్యమంత్రిని చూస్తారని పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వం వ్యవహారాల్లో అధినేత నిమగ్నమైతే, పార్టీ వ్యవహారాలు లోకేష్‌కు అప్పగిస్తే బెటరని కొందరు నేతల సూచన.
రాజకీయ నేతలకు పార్టీ ఎంత ముఖ్యమూ, ప్రభుత్వం అంతే ముఖ్యం. ఒకప్పుడు చంద్రబాబు ఈ రెండింటినీ నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత పునర్ నిర్మాణంలో ఆయన తనమునకలైపోయారు. రాజధాని, పోలవరం, పెట్టుబడుల ఆకర్షణ వంటిపై దృష్టిపెట్టారు. దీంతో అధినేత దృష్టంతా ప్రభుత్వంపై మళ్లింది.
ALSO READ: ఫిల్మ్ ఇండస్ట్రీ గుట్టు బయటకు.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి దుర్గేష్
పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దాని ఫలితంగా 2019లో టీడీపీ ఓటమి పాలైంది. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపై దృష్టి పెట్టారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా మంత్రులు, కీలక నేతలు పార్టీ ఆఫీసులో ఉంటున్నారు.
ఒకవిధంగా చెప్పాలంటే ఈ విషయంలో పార్టీ నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. గత మాదిరిగా ప్రత్యర్థులకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని పార్టీ భావిస్తోంది. ఏమైనా పనులుంటే నేరుగా కేంద్ర పెద్దలతో లోకేష్ మాట్లాడుతున్నారు. మరోవైపు పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
అన్నట్లు మొన్నటికి మొన్న అమరావతిలో నిర్వహించిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో తొలుత నేతలంతా లోకేష్‌తో భేటీ అయ్యారట. ఆ తర్వాత పొలిట్‌బ్యూరో సమావేశం జరగడం, తీసుకున్న నిర్ణయాలు ఆమోదించడం జరిగిందని అంటున్నారు. మొత్తానికి పార్టీ వ్యవహారాల్లో లోకేష్ పాత్ర కీలకంగా మారిందని చెప్పవచ్చు.