Banana For Glowing Skin: ముఖం ఎప్పుడు తాజాగా, మెరిసేలా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది అమ్మాయిలు.. అనేక చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖంపై మొటిమలు రావడం, మచ్చలు ఏర్పడటం వల్ల అందవిహీనంగా కనిపిస్తారు. ఇక వీటిని తగ్గించుకునేందుకు అమ్మాయిల అవస్థలు అంతా ఇంతా కాదు. పార్లర్‌కి వెళ్లడం, వేలకు వేలు ఖర్చు చేసి రకరకాల ఫేస్ క్రీములు ఉపయోగిస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. కాబట్టి అరటిపండుతో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పట్టులాంటి చర్మం మీ సొంతం అవుతుంది. సాధారణంగా అరటిపండు అరోగ్యానికి ఎంత మంచిదో.. చర్మ సౌందర్యానికి కూడా అంతే మంచిదట. ఇందులో ఉండే ఔషద గుణాలు చర్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మరి అరటిపండుతో సౌందర్య రక్షణ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండు తొక్కలతో..
అరటిపండు తిని తొక్కలను పడేస్తున్నారా? అయితే ఇక నుంచి అలా చేయకండి. ఎందుకంటే అరటిపండు తొక్కలో కూడా అనేక చర్మ సౌందర్య గుణాలు ఉన్నాయి. తొక్కలను కంటికింద నల్లటి వలయాలు దగ్గర కాసేపు మసాజ్ చేసి, ఓ పావుగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. రోజు మొత్తంమీద వీలు కుదిరినప్పుడల్లా ఇలా చేస్తే.. వారం రోజుల్లోనే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి.
అరటిపండు, ఓట్స్ పొడి ఫేస్ ప్యాక్
బాగా పండిన అరటిపండు గుజ్జు.. ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని..అందులో రెండు టేబుల్ స్పూన్ ఓట్స్ పొడి లేదా పెరుగు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెగ్యులర్‌గా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. మొటిమలు, మచ్చలు తగ్గిపోయి చాలా అందంగా కనిపిస్తారు.
అరటిపండు, తేనె ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో బాగా పండిన అరటిపండు గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని వాష్ చేసుకోండి. ఇలా రోజు మార్చి రోజు చేస్తే.. ఫేస్ చాలా స్పూత్‌గా, తాజాగా, మిల మిల మెరుస్తుంది.
అరటిపండు, నిమ్మరసంతో ఫేస్ ప్యాక్
ఒక గిన్నెలో అరటిపండు గుజ్జు తీసుకుని, అందులో రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. 10 నిమిషాల తర్వాత చల్లటి నీచితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.. ముఖంపై అదనపు నూనెలను తగ్గించడంతో పాటు.. మొటిమలను తొలగిస్తుంది.
అరటిపండు, పసుపు ఫేస్ ప్యాక్
బాగా పండిన అరటిపండు గుజ్జు.. చిన్న బౌల్‌లోకి తీసుకుని.. అందులో టేబుల్ స్పూన్ పసుపు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై నలుపుదనాన్ని తగ్గించి, తాజాగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
Also Read: పాలతో రోజూ ఇలా చేస్తే.. అందమైన మెరిసే చర్మం మీ సొంతం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.