India Vs America: అమెరికా-పాకిస్తాన్ మధ్య అరుదైన ఖనిజ వనరుల ఒప్పందం చుట్టూ ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తోంది. సెప్టెంబర్ లో ట్రంప్ ను కలవడం, కొన్ని శాంపిల్స్ చూపించడం, సంతకాలు చేసేయడం.., అక్టోబర్ ఫస్ట్ వీక్ లోనే ఫస్ట్ బ్యాచ్ ఎగుమతి చేయడం చకచకా జరిగిపోయాయి. రేర్ ఎర్త్ మినరల్స్ అంత త్వరగా పంపించడం ఎలా సాధ్యం? ఏంటి ఈ లెక్కలు.. ఏంటి ఈ సీక్రెట్ డీల్స్.. ట్రంప్, ఆసిమ్ మునీర్ గేమ్ నడిపిస్తున్నారా?
ఖనిజ వనరులను అమ్ముకునే ప్లాన్‌లో పాక్
పాక్ ఆర్థికంగా కుదేలైపోయింది. ఇప్పుడు తమ దగ్గరున్న ఖనిజ వనరులను అమ్ముకుని బయటపడాలనుకుంటోంది. ఇప్పటికే బలూచిస్తాన్ లో చైనా, కెనడాలకు చెందిన కంపెనీలు మైనింగ్ చేస్తున్నాయి. వీటిని కాదని గత నెల సెప్టెంబర్ లో అమెరికన్ కంపెనీతో పాకిస్తాన్ డీల్ కుదుర్చుకుంది. పాకిస్తాన్ లో కొత్తగా పుట్టే ఖనిజాలేమీ లేవు. ఇదంతా అమెరికా ట్రంప్ మెప్పు కోసమే.
మునీర్‌కు వైట్ హౌస్‌లో రెడ్ కార్పెట్ వేసి ఆతిథ్యం
2018లో ట్రంప్ ఓ మాటన్నాడు. వాషింగ్టన్‌కు ఇస్లామాబాద్ అన్నీ అబద్ధాలు, మోసం తప్ప మరేమీ ఇవ్వలేదన్నాడు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చాక కంప్లీట్ గేమ్ మార్చేశాడు ట్రంప్. పాక్ చాలా చేరదీస్తున్నాడు. దక్షిణాసియాలోనే పాక్ పైనే 19 శాతం అతి తక్కువ టారిఫ్ తో సరిపెట్టాడు. మనకు మాత్రం ట్రంప్ 50 శాతం బాదేశాడు. మునీర్‌కు మాత్రం వైట్ హౌస్‌లో రెడ్ కార్పెట్ వేసి ట్రంప్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సంవత్సరం షరీఫ్, మునీర్ అమెరికాకు వెళ్లడం ఇది మూడోసారి. వెళ్లిన ప్రతిసారీ సీక్రెట్ డీల్సే అన్నీ. ఇదంతా ట్రంప్ తెరవెనుక గేమ్ ప్లాన్. ఆయన రమ్మనకపోతే వీళ్లనెవరు వైట్ హౌజ్ మెట్లెక్కనిస్తారు?
USకు ఫస్ట్ బ్యాచ్ ఖనిజాల ఎగుమతి కంప్లీట్
పాకిస్తాన్‌లో లోహాల ప్రాసెసింగ్ అభివృద్ధి సౌకర్యాల కోసం సుమారు 500 మిలియన్లు పెట్టుబడి పెట్టడానికి US స్ట్రాటజిక్ మెటల్స్ – USSM సెప్టెంబర్‌లో పాకిస్తాన్ మిలిటరీ ఇంజనీరింగ్ విభాగమైన ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ – FWOతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఖైబర్ పంక్తుఖ్వా ప్రావిన్స్‌లోని వజీరిస్తాన్ ఏరియాలో FWO ఇప్పటికే గనులను నిర్వహిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని చాఘి బెల్ట్‌లో, అలాగే గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో వారికి మైనింగ్ లైసెన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. సెప్టెంబర్ లో USSMతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈనెలలో ఫస్ట్ బ్యాచ్ ఖనిజాలను ఎగుమతి చేసేసింది కూడా. ఇందులో యాంటిమోనీ, కాపర్, నియోడైమియం, ప్రాసోడైమియం వంటి అరుదైన భూలోహాలు ఉన్నాయి.
పాక్ ఖనిజ సంపద 6 ట్రి. డాలర్లు అని అంచనా
పాకిస్తాన్ యునైటెడ్ స్టేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ డెలివరీని ఒక ముఖ్యమైన మైలురాయి అని USSM ప్రశంసించింది. మిస్సోరీలో ఉన్న USSM, కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడం రీసైక్లింగ్ చేయడంపై ఫోకస్ చేస్తోంది. సో ఇందులో కథేంటంటే ట్రంప్ ను ఆకర్షించేందుకు అరుదైన ఖనిజ నిల్వలతో పాక్ ప్రయత్నాలు చేసుకుంటోంది. మరోవైపు ట్రంప్ కూడా ఇదే అదనుగా భారత్ పై రెచ్చిపోతూ వ్యవహారం నడిపిస్తున్నారు. పాకిస్తాన్ ఖనిజ సంపద 6 ట్రిలియన్ డాలర్లుగా తరచూ ఆ దేశం ప్రొజెక్ట్ చేసుకుంటోంది. నిజానికి వీటిన్నటికి రాత్రికి రాత్రే అమ్మేసుకుని అప్పుల నుంచి బయటపడే పరిస్థితి లేదు. ఏళ్లకేళ్లు పడుతుంది. అంతకు మించిన రియాల్టీ ఏంటంటే.. చాలా మల్టీ నేషనల్ కంపెనీలు వెతికి వెతికి ఖనిజ వనరుల జాడ కనుక్కోలేక పాకిస్తాన్ నుండి పారిపోయాయి. అదీ సంగతి.
టెక్నాలజీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కీలకం
ఆటోమొబైల్స్ నుండి రాకెట్ టెక్నాలజీ, అధునాతన కంప్యూటింగ్ వరకు చాలా పరిశ్రమలలో రేర్ ఎర్త్ మినరల్స్ కీలకం. ఇందులో చైనా డామినేషన్ ఎక్కువగా ఉంది. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనాపైనే అమెరికా ఆధారపడి ఉంది. చైనా ఆపితే అమెరికాకు కష్టమే. అందుకే ఈ సవాల్ ను అధిగమించేందుకు పాకిస్తాన్ ను పట్టుకుని తిరుగుతోంది అమెరికా. నియోడైమియం మరియు ప్రాసోడైమియం స్వచ్ఛమైన లోహాలుగా దొరకవు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను ఖనిజాల నుంచి వేరు చేయడం, శుద్ధికి ఏళ్లకేళ్లు పడుతుంది. కొన్ని సార్లు దశాబ్దాలు కూడా పట్టొచ్చు. బలూచిస్తాన్ రెకో డిక్ గనిలో 15 మిలియన్ టన్నుల రాగి, అలాగే 26 మిలియన్ ఔన్సుల బంగారం ఉందని ఒక అంచనా ఉంది. రెకో డిక్ గనులు ప్రపంచంలోనే అతిపెద్ద రాగి నిక్షేపాలలో ఒకటిగా ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్, జ్యుయెలరీ, ఇన్వెస్ట్ మెంట్ కు కీలకం. అలాగే గిల్గిత్ బాల్టిస్తాన్ లో లిథియం నిక్షేపాలున్నాయి. బ్యాటరీలు, ఈవీల్లో కీలకం. యాంటిమొని లోహం బలూచిస్తాన్ క్వెట్టా రీజియన్ లో ఉంది. బలూచిస్తాన్ గ్వాదర్ రీజియన్ లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిని డిఫెన్స్ టెక్నాలజీ, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ లో వాడుతారు. అరుదైన ఖనిజ వనరులు ఉన్నదంతా బలూచిస్తాన్ లోనే. అక్కడే అభివృద్ధి లేదు. తమ ఖనిజ సంపదను దోచుకుని అభివృద్ధి కూడా చేయట్లేదని బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు కూడా చేస్తోంది. సో అక్కడ ఖనిజాల అన్వేషణ అంటే ప్రాణాలతో చెలగాటమే.
అరుదైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్.. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి సెమీకండక్టర్లు, డిఫెన్స్ దాకా ప్రతిదాంట్లో ఉపయోగించే 17 లోహ మూలకాల సమూహం. వీటి కోసం అమెరికా పెద్ద ప్లానే వేసింది. మరి ఈ డీల్స్ భారత్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయి? అమెరికా కోసం పాక్ ఓవర్ యాక్షన్ చేస్తోందా? బలూచిస్తాన్ లోని పాస్ని పోర్టును గుంపగుత్తగా అమెరికా చేతిలో పెట్టేందుకు రెడీ అవుతోందా? సీక్రెట్ డీల్స్ అన్నీ బయటపెట్టాలని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎందుకంటోంది?
15 దేశాలను మ్యాప్ చేసిన అమెరికా
US జియోలాజికల్ సర్వే ఈ ఏడాది జనవరిలో ఓ లిస్ట్ తయారు చేసింది. అరుదైన రేర్ ఎర్త్ మినరల్స్ ఏయే దేశాల్లో ఉన్నాయో అన్ని రకాల లెక్కలు తీసి 15 దేశాల్లోని భూభాగాలను మ్యాప్ చేశారు. అయితే ఆ లిస్టులో పాకిస్తాన్ లేదు. కానీ ఆశ్చర్యంగా ఇప్పుడు పాక్ తోనే ఒప్పందం చేసుకున్న పరిస్థితి. మధ్యలో ఏం జరిగిందన్నదే ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. పాక్ లో చైనా ఇప్పటికే మైనింగ్ చేస్తోంది. అయితే తమను తాము అమెరికాకు అమ్ముకునేందుకు ఆసిమ్ మునీర్, షెహబాజ్ షరీఫ్ తెగించేలా కనిపిస్తున్నారు.
పాక్‌లో చమురు నిల్వల అభివృద్ధి అన్న ట్రంప్
పాకిస్తాన్ లో భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఆ దేశంతో కలిసి పనిచేస్తామని జులైలో ట్రంప్ చెప్పారు. ఏమో ఏదో ఒక రోజు పాకిస్తానే భారత్ కు ఆయిల్ ఎక్స్ పోర్ట్ చేస్తుందేమో అని ట్రంప్ సెటైరిక్ గా కూడా మాట్లాడాడు. ఆ తర్వాత గత సెప్టెంబర్ పాక్-అమెరికా ఖనిజ మూలకాల డీల్ కుదిరింది. ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటి గేమ్ మాదిరిగా వ్యవహారం సాగుతోంది. వీటికి తోడు ఈ ఖనిజాలను ఎగుమతి చేయడానికి వీలుగా అరేబియా సముద్రంలోని పాస్ని పోర్ట్ ను అమెరికాకు అందుబాటులోకి తీసుకురావడానికి పాకిస్తాన్ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. మేమే దగ్గరుండి ఎక్కిస్తాం.. మీకేం శ్రమ వద్దు అన్నట్లుగా షరీఫ్, మునీర్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్. కానీ అక్కడ అతి తక్కువ అభివృద్ధి, అలాగే అతి తక్కువ జనాభా ఉంది. ఇక్కడే ఉన్న పాస్ని పోర్ట్ ను డెవలప్ చేసుకుని వాడుకోండి అని పాకిస్తాన్ ఫ్రీ ఆఫర్లు చాలానే ఇస్తోంది.
స్ట్రాటజిక్ లొకేషన్‌లో ఉన్న పాస్ని ఓడరేవు
పాస్ని ఓడరేవు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది. ఇది చైనా అభివృద్ధి చేసిన గ్వాదర్ పోర్ట్ నుండి కేవలం 113 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే ఇరాన్ బార్డర్ కు 161 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాస్నిలో ప్రతిపాదిత పోర్ట్.. పాకిస్తాన్ కీలకమైన ఖనిజాలను అమెరికాకు ఈజీగా ఎగుమతి చేయడానికి ఒక రూట్ గా పనిచేస్తుందని, వాణిజ్యం, వ్యూహాత్మక సహకారంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అటు పాకిస్తాన్ లో ఉన్న ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజ నిల్వలను సేకరిస్తే 130 బిలియన్ డాలర్ల అప్పుల్ని ఉఫ్ మని ఊదేయొచ్చని ఆర్థిక వ్యవస్థే మారిపోతుందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇటీవలే చెప్పుకున్నారు. ఇది పాకిస్తాన్ ను మొత్తంగా అమ్ముకోవడమే అన్న చర్చ ఆ దేశంలోనే జరుగుతోంది. ఖనిజ ప్రాజెక్టులు దీర్ఘకాలికమైనవి. వీటితో పాకిస్తాన్ అప్పులు వెంటనే తీరవు. రిలీఫ్ కూడా ఉండదు.
లోటు పూడ్చుకునేందుకు ట్రంప్ డ్రామాలు
అమెరికా చైనా వాణిజ్య యుద్ధంతో చైనా కొన్ని లోహాల ఎగుమతుల్ని తగ్గించింది. దీంతో అమెరికాకు షార్టేజ్ వస్తోంది. ఈ లోటు పూడ్చుకోవడం కోసం ట్రంప్ రకరకాల డ్రామాలకు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక స్టేట్ మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ దక్షిణాసియాలో వ్యూహాత్మకంగా ఉందని, అలాగే మధ్య ఆసియాకు ప్రవేశ ద్వారమన్నది. రాగి, బంగారం, లిథియం, యాంటిమొని సహా విస్తారమైన ఖనిజ నిక్షేపాలకు నిలయమన్నది. అంతలోనే ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా అసిమ్ మునీర్ ఆగస్టు నాటికి యుఎస్‌కు వెళ్లాడు. ఇదంతా పక్కా స్క్రిప్టెడ్ గా వ్యవహారం నడుస్తోంది.
సమస్యలున్న చోట మైనింగ్ సాధ్యమా?
బలూచిస్తాన్, ఖైబర్ పంక్తుఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ మారుమూల ఎత్తైన ప్రాంతాలలో కఠినమైన భూభాగంలో, తీవ్రమైన భద్రతా సమస్యలున్న ఏరియాలో మైనింగ్ సాధ్యమా? 15 మిలియన్ల మందికి నివాసంగా ఉన్న బలూచిస్తాన్, అపారమైన సహజ వనరుల నిలయం. తమ వనరులన్నీ పాక్ దోచుకుని ఇక్కడ ఏమీ అభివృద్ధి చేయట్లేదంటోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇక్కడ పాకిస్తాన్ ప్రాజెక్టులను చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు అమెరికా మైనింగ్ ను అనుమతిస్తుందా? కచ్చితంగా చేయదు. ఈ గ్రూప్ గతంలో గ్వాదర్‌లో చైనా పెట్టుబడులతో సహా విదేశీ శక్తులతో ముడిపడి ఉన్న మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఎటాక్స్ చేసింది.
డీల్స్ బహిరంగ పరచాలని ఇమ్రాన్ పార్టీ డిమాండ్
అటు పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికన్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల పూర్తి వివరాలను బహిరంగంగా చెప్పాలని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పిటిఐ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ సీక్రెట్ డీల్స్ ఎవరి కోసం చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు.. వాళ్లు ఇస్తున్న డబ్బులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నలు సంధిస్తోంది. పాక్ పార్లమెంట్ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఒప్పందాలను బహిర్గతం చేయాలంటున్నారు. ఇది కేవలం 500 మిలియన్ డాలర్ల ఖనిజ ఒప్పందం మాత్రమే కాదని, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిందంటోంది. షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్, ట్రంప్ క్లోజ్డ్ డోర్ సమావేశం తర్వాత పాక్ లో వివాదాలు పెరుగుతున్నాయి. పాస్ని పోర్ట్ ను ఏకపక్షంగా, రహస్యంగా అమెరికాకు ఇచ్చే నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారని PTI పార్టీ క్వశ్చన్ చేస్తోంది.
Also Read: బ్రేకుల్లేకుండా పెరుగుతున్న బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?
అరేబియన్ సీ లో చైనా నిర్మించిన గ్వాదర్ ఓడరేవుకు, అలాగే ఇరాన్ లో భారత్ అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్టులకు సమీపంలోనే ఉన్న ఈ పాస్నీ పోర్ట్ ను అమెరికాకు అందించి సంతృప్తి పరచాలన్నది పాక్ తాపత్రయం. అటు చైనా, ఇటు భారత్ కు చెక్ పెట్టామని అమెరికాకు చెప్పుకునే ప్రయత్నంలో పాకిస్తాన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో ఫైనల్ గా ట్రంప్, మునీర్, షహబాజ్ మధ్య బ్రోమాన్స్ నడుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ సంక్షోభాన్ని ఆపినట్లు ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ ప్రేమానురాగాలు మరింత పెరిగాయి. పైగా ట్రంప్ ను నోబెల్ శాంతి పురస్కారానికి పాక్ నామినేట్ చేయడం కూడా చాలా మార్పులకు కారణమవుతోంది. పాక్ పై యుద్ధం ఆపడంలో ట్రంప్ ప్రమేయం లేనే లేదని భారత్ ప్రకటించడంతో చాలా కస్సుబుస్సు మీదున్న పెద్దన్న.. మోడీ మంచి మిత్రుడు, గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అంటూనే మనపై పరోక్షంగా ప్రతీకారాలు తీర్చుకునే పనిలో ఉన్నారు. సో సినిమా చూస్తే.. ఈ ఖనిజాల ఒప్పందాలు మూణ్నాళ్ల ముచ్చటగానే కనిపిస్తోంది.
Story By Vidya Sagar, Bigtv