⦿ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
⦿ భూఆక్రమణ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు
⦿ కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్, సంబంధిత డిపార్ట్‌మెంట్లకు సూచన
⦿ కాకినాడ జిల్లా నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్న డిప్యూటీ సీఎం
అమరావతి: భూఆక్రమణలకు సంబంధించిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు నాలుగు దశాబ్దాల నాటి పాత విధానాన్ని తమ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తీసుకురానుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. నూతన చట్టంలో ఆక్రమణదారులకు కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం చెల్లింపు, ప్రభుత్వ భూముల సంరక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, భూఆక్రమణల నివారణకు చర్యలు, మెరుగైన రీతిలో భూ రికార్డుల నిర్వహణ, భూహక్కుల వెరిఫికేషన్, సమర్థవంతంగా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర వనరులను పరిరక్షించే క్రమంలో నేరస్థులను బాధ్యులుగా నిలబెడతామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి
రాష్ట్రంలో భూఆక్రమణ ఫిర్యాదులపై సంబంధిత ప్రభుత్వ విభాగాలు, అధికారులు తక్షణమే స్పందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. బాధితుల నుంచి ఈ తరహా ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలకు గురవుతున్నాయంటూ తనకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన చెప్పారు. బలవంతంగా భూసేకరణకు సంబంధించిన ఫిర్యాదులు కూడా అందాయని పేర్కొన్నారు. ఈ తరహా ఫిర్యాదులు కాకినాడ జిల్లాలో గణనీయ సంఖ్యలో నమోదవుతున్నాయని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఫిర్యాదులపై సీరియస్‌గా దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను కోరుతున్నట్టు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన శనివారం స్పందించారు.