Pawan Kalyan Comments On Jagan: అధికారంలోకి వచ్చిన వెంటనే కైకలూరు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరీ సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీలో చర్చ లేకుండానే లాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారని.. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అంటూ పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రజలు భయం లేకుండా బ్రతకాలన్నదే తన కోరిక అని.. రాష్ట్ర అభివృద్ధియే తన లక్ష్యమని, రాష్ట్రం కోసమే తాను ఎంత తగ్గాలో అంత తగ్గానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కూటమి తరఫున బీజేపీ నుంచి కామినేని పోటీ చేస్తున్నారని.. అతడిని అధిక మెజారిటీతో గెలిపించాలని.. కాంటూరు సమస్యపై కామినేని కేంద్రంతో మాట్లాడుతారని ఆయన అన్నారు. కైకలూరు ఎమ్మెల్యేది కాదని.. కైకలూరు ప్రజలు ఆయనకు గానీ, ఆయన కొడుకు గానీ భయపడాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ఎన్నికలు ఎంతో కీలకమని.. రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూలీలకు ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది: జగన్
ఇటు సీఎం జగన్ పై ఆయన తీవ్రంగా ఫైరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓ అబద్ధాల కోరు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో జర్నలిస్టులపై కేసులు పెట్టారన్నారు. మీడియాను కట్టడి చేసేందుకు జీవోను తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే కైకలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిపరుస్తామని ఆయన అన్నారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు.