“ఇది వరకు సినిమా బాగుంటే చూసేవారు, లేదంటే మానేసేవారు, పనిగట్టుకుని సినిమాలను ఫ్లాప్ చేసే కార్యక్రమం పెట్టుకునే వారు కాదు. ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ బాగా బలపడుతోంది.” ఓ తెలుగు మహిళా పారిశ్రామిక వేత్త వేసిన ట్వీట్ ఇది. ఆమె ఒక్కరే కాదు, సగటు నెటిజన్లు చాలామంది ఈ ట్రెండ్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హరిహర వీరమల్లు విషయంలో వైసీపీ, ఆ పార్టీ సానుభూతిపరులు, ఆ పార్టీ మీడియా, సోషల్ మీడియా వ్యవహరించిన తీరు దీనికి నిదర్శనం అంటున్నారు. పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ సమయంలో బాయ్ కాట్ అనే ట్రెండ్ నడిపారు. అది చాలదన్నట్టు ప్రివ్యూ షోలు పడిన వెంటనే ఫ్లాప్ టాక్ ని తెరపైకి తెచ్చారు. వీఎఫ్ఎక్స్ బాలేవని, హీరోకి డూప్ ని పెట్టారని, కథ బాలేదని, కథలో ఓ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని, చరిత్రను వక్రీకరించారని అబ్బో.. ఒకటేంటి సినిమాలోని ప్రతి ఫ్రేమ్ నీ విమర్శిస్తూ కథలల్లారు, కథనాలు రాసుకొచ్చారు. వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఈ సినిమాకి దారుణంగా రేటింగ్ లు ఇచ్చిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఎందుకంత భయం..?
హరిహర వీరమల్లు హిట్ అయితే నిర్మాతకి లాభాలొస్తాయి, ఒకవేళ ఫ్లాప్ అయితే నిర్మాతకే నష్టాలొస్తాయి. కానీ ఆ సినిమా హిట్ అయితే వైసీపీకి మా చెడ్డ నష్టం అనే స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ సినిమాని రాజకీయాలకు ముడిపెడుతూ వైసీపీ అనుకూల మీడియా ఇచ్చిన కథనాలు పవన్ పై వారి పగను తెలియజేస్తున్నాయని విమర్శిస్తున్నారు నెటిజన్లు. సినిమా రిలీజ్ టైమ్ లో వైసీపీ హ్యాండిల్స్ అన్నీ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయని అంటున్నారు. పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న వైసీపీ టీమ్.. సినిమాపై నెగెటివ్ పోస్ట్ లు పెట్టి ఏం సాధించిందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీకి నష్టమేంటి?
పవన్ కల్యాణ్ ని రాజకీయ నాయకుడిగా అభిమానించేవారి కంటే.. సినీ హీరోగా ఆయనంటే పిచ్చి అభిమానం ఉన్నవారు మరింత ఎక్కువమంది ఉన్నారు. ఇలాంటి అభిమానులకు రాజకీయ పార్టీల పట్టింపులు లేవు. వైసీపీలో కూడా పవన్ ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే వైసీపీ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. పవన్ సినిమాలు హిట్ అయితే ఆయనను మరికొంతమంది ఆరాధిస్తారు, మరింత ఎక్కువగా అభిమానిస్తారు. పవన్ ఫ్యాన్స్ లో కదలిక మొదలవుతుంది. పొలిటికల్ గా సినిమాలు పవన్ కల్యాణ్ కి మరింత మైలేజీ పెంచుతాయని వైసీపీ అంచనా వేస్తున్నట్టుంది. అందుకే పనిగట్టుకుని ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేసిందని అంటున్నారు పవన్ అభిమానులు. అటు వైసీపీ బాయ్ కాట్ అంటూ హడావిడి చేస్తుంటే, ఇటు జనసైనికులు పవన్ సినిమాని భుజాన మోశారు.
పవన్ రియాక్షన్ ఏంటి..?
నెగెటివ్ ట్రెండ్ పై పవన్ కూడా రియాక్ట్ కావడం విశేషం. నెగెటివ్ కామెంట్లను మరీ పర్సనల్ గా తీసుకోవద్దని, తనకు బాధ లేదని, తన అభిమానులు కూడా బాధపడొద్దని చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కల్యాణ్ పాలనను సైతం పక్కనపెట్టారంటూ వస్తున్న ఆరోపణలపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. తాను కేవలం రోజుకి 2 గంటలు మాత్రమే, అది కూడా తన వ్యక్తిగత సమయాన్ని మాత్రమే ఈ సినిమా కోసం కేటాయించానని చెప్పారు పవన్ కల్యాణ్. ఓజీ షూటింగ్ కూడా పూర్తయిందన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మరో 4 రోజులు కేటాయిస్తే సరిపోతుందన్నారు. ఇకపై కొత్త సినిమాల్లో నటించడం కష్టమేనని తేల్చి చెప్పారాయన.